ప్రగతిపథంలో జిల్లా

ABN , First Publish Date - 2022-08-16T07:37:10+05:30 IST

జిల్లా అన్నిరంగాల్లో ప్రగతిసాధిస్తూ అభివృద్ధి పథంలో దూసుకు పోతోందని అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు.

ప్రగతిపథంలో జిల్లా
జెండాకు వందనం చేస్తున్న మంత్రి

వ్యవసాయ రంగానికి పెద్దపీట

స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి అల్లోల

జిల్లాలో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 15 : జిల్లా అన్నిరంగాల్లో ప్రగతిసాధిస్తూ అభివృద్ధి పథంలో దూసుకు పోతోందని అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని జాతీయజెండా ఆవిష్కరించారు. ప్రజ లనుద్దేశించి ప్రసంగిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో అనేక సంక్షేమ పథకాలు జిల్లాప్రజలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. దేశానికి  స్వాతంత్య్ర లభించి నేటికీ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యా గాలను స్మరించుకొని ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నివర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. సంక్షేమపథకాల అమలులో రాష్ర్టాన్ని నెంబర్‌ వన్‌గా నిలిపిన ఘనత సీఎందని తెలిపారు. పేద, బడుగు, మైనారిటీ వర్గాల అభివృద్ధి కాంక్షించి వినూత్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేశారని అన్నారు. రైతు సంక్షేమానికి రైతు బంధు పథకం అమలు, రైతు బీమా వర్తింపు, 24 గంటల ఉచిత కరెంట్‌ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదన్నారు. దళితుల అభ్యున్నతి కొరకు దళిత బంధు ప్రవేశపె ట్టారని పేర్కొన్నారు. జిల్లాలో శాంతి బద్రతల పరిరక్షణ కోసం ఆ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. షీటీం బృందాలు మహిళల రక్షణకు కృషి చేస్తున్నాయన్నారు. ధరణి ద్వారా ఇప్పటి వరకు 45 వేల భూ సమస్యలు పరిష్కరించామన్నారు. హరితహారంలో 7 లక్షల మొక్కలు నాటామన్నారు. జిల్లాలో 95 శాతం గుడుంబా అరికట్టామని, గీత కార్మికులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించినట్లు వివరించారు. పౌరసరఫరాశాఖ ఆహార భద్రత కార్డు దారులకు, అంత్యోదయ, తదితర లబ్ధిదారులకు పది వేల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేసిందని అన్నారు. 192 కొనుగోలు కేంద్రాల ద్వారా 29 వేల 50 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆర్‌ అండ్‌బీ రోడ్డు 270 కోట్లతో పూర్తి చేశామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం ద్వారా 638 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష 116 చెల్లించినట్లు వివరించారు. పది ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచినందుకు విద్యాశాఖను అభినందించారు. భారీ వర్షాలకు వరదలు రావడంతో కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి 9 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామన్నారు. జిల్లాలో 2450 రెండు పడకల గదులు నిర్మాణం పూర్తయిందని, 2029 నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధిశాఖ 1 లక్ష 80  వేల ఉపాధి హామీ జాబ్‌ కార్డులు మంజూరు చేసిందని, 66 కోట్ల 73 లక్షలు చెల్లించినట్లు పేర్కొన్నారు. నిర్మల్‌ పట్టణంలో 7 కోట్ల 20 లక్షలతో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయన్నారు. శ్మశాన వాటికల నిర్మాణం, పార్కుల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ దారులకు 226 కోట్ల రైతు బంధు జమ చేశామని తెలిపారు. 565 రైతులకు రైతు బీమా 28 కోట్లు అందజేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో నిర్మల్‌ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. వరుణుడి ఆటంకం కలిగించినప్పటికీ వజ్రోత్సవ వేడుకలు కొనసాగాయి. జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి, కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌, అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే. రాంబాబు, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి పోలీసు పరేడ్‌ పరిశీలించారు. విద్యార్థుల సాంస్కతిక క్రమాలు అలరించాయి.

Updated Date - 2022-08-16T07:37:10+05:30 IST