క్వారంటైన్‌లో తిరుగుబాటు

ABN , First Publish Date - 2020-04-04T10:18:21+05:30 IST

రాప్తాడు సమీపంలోగల టీటీడీసీ క్వారంటైన్‌లో వైద్యులు, సిబ్బందిపై కరోనా అనుమానితులు తిరుగుబాటు చేశారు.

క్వారంటైన్‌లో తిరుగుబాటు

డాక్టర్లు, సిబ్బందితో అనుమానితుల వాగ్వాదం

నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయని ఇళ్లకు తరలింపు

రోజుకు 120 శాంపుళ్లకు మాత్రమే రోగ నిర్ధారణ పరీక్షలు

రిపోర్టుల కోసం తప్పని ఎదురుచూపులు


అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 3: రాప్తాడు సమీపంలోగల టీటీడీసీ క్వారంటైన్‌లో వైద్యులు, సిబ్బందిపై కరోనా అనుమానితులు తిరుగుబాటు చేశారు. మంత్రి మమ్మల్ని ఇళ్లకు పంపిస్తామన్నారనీ, ఎందుకు పంపించరని వాగ్వాదానికి దిగారు. గురువారం రాత్రి పొద్దుపోయే వరకూ ఈ గొడవ సాగిందని సమాచారం. శుక్రవారం క్వారంటైన్‌లో ఉంటున్న అనుమానితుల వ్యవహారంపై ఉన్నతాధికారులు సంబంధిత డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు. శాంపిళ్ల నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్టులు వచ్చిన వారిని ఇళ్లకు పంపించేయండని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో టీటీడీసీ క్వారంటైన్‌లో ఉన్న 49 మందిని శుక్రవారం మధ్యాహ్నమే ప్రత్యేక వాహనాల్లో ఇళ్లకు పంపించేశారు. సాయంత్రం సీఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న 60 మందిని ఊళ్లకు తరలించేశారు. నెగిటివ్‌ వచ్చినా కనీసం వారం, పదిరోజులు అధికారులు ఆధీనంలో ఉంచుకుని పర్యవేక్షిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


నత్తనడకన నిర్ధారణ పరీక్షలు

కరోనా అనుమానిత శాంపిళ్లు మూడ్రోజులుగా అధికంగా వస్తున్నాయి. జిల్లాతోపాటు కర్నూలు, ప్రకాశం (ఒంగోలు) నుంచి శాంపిల్స్‌ జిల్లా ల్యాబ్‌కు వస్తున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఆ స్థాయిలో చేయట్లేదు. రోజుకు 120 శాంపిళ్లు మాత్రమే పరీక్షిస్తున్నట్లు తెలిసింది. పరీక్షలు చేయడానికి నలుగురు రీసెర్చ్‌ సైంటిస్టులు మాత్రమే ఉన్నారని సమాచారం. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ వీరే పరీక్షలు సాగిస్తున్నారు. ఒక్కోసారి సుమారు 40 శాంపిళ్లు నిర్ధారణ చేసే అవకాశం ఉంది. ఇలా మూడుసార్ల చొప్పున 120 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. శాంపిళ్లు మాత్రం దండిగా వస్తున్నాయి. గురువారం ఒక్కరోజే 365 శాంపిళ్లు వచ్చాయి.


మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకూ అయితే 628 నమూనాలు మూడు జిల్లాల నుంచి వచ్చాయి. ల్యాబ్‌లో టెక్నీషియన్ల(సైంటిస్టు) కొరత వల్ల పూర్తిస్థాయిలో నిర్ధారణ పరీక్షలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఏడుగురు రీసెర్చ్‌ సైంటిస్టు వైద్యులను నూతనంగా నియమించుకున్నారు. వీరిలో ఐదుగురు విధుల్లో చేరారు. ఈ ఐదుగురికి కరోనా నిర్ధారణ పరీక్షలపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఈ మూడ్రోజులపాటు వారికి ప్రాక్టికల్‌గా శిక్షణ ఇస్తున్నారు. సోమవారం నుంచి ఈ ఐదుగురు కూడా నిర్ధారణ పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఉంటుందనీ, అప్పటి నుంచి రేయింబవళ్లు షిఫ్ట్‌ల పద్ధతిలో పరీక్షలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.


కిట్ల కొరత

మైక్రోబయాలజీ ల్యాబ్‌లో కిట్ల కొరత కనిపిస్తోంది. 500కిపైగా కరోనా అనుమానితుల శాంపిళ్లు ల్యాబ్‌లో ఉన్నట్లు తెలిసింది. 300 శాంపిళ్ల నిర్ధారణకు సరిపడా కిట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. అందుకే శాంపిళ్లు తీయటం కూడా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. ఇందుకు జిల్లా అధికారులు శుక్రవారం ఇచ్చిన రిపోర్టుల్లో జిల్లాలో ఒక్క శాంపిళ్లు కూడా తీయలేదని చూపించారు. దీన్నిబట్టే కరోనా అనుమానిత కేసుల నిర్ధారణ విషయంలో ఎంతమేర శ్రద్ధ చూపుతున్నారో అర్థమవుతోంది. వ్యాధి నిర్ధారణ రిపోర్టులు కూడా సకాలంలో బయటకు రావట్లేదు. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం బుధ, గురు వారాల్లో 137 నమూనాలను నిర్ధారణకు పంపించారు. శుక్రవారం 60 మాత్రమే ఇచ్చారు. మిగిలిన 77 నిర్ధారణ రిపోర్టులు ఇంకా ప్రకటించాల్సి ఉంది.


జిల్లా ఆస్పత్రిలో టెన్షన్‌ 

జిల్లా సర్వజనాస్పత్రిలో కరోనా టెన్షన్‌ కొనసాగుతోంది. అనుమానితులు ఈ ఆస్పత్రి ఓపీకి అధికంగా వస్తున్నారు. శుక్రవారం కూడా సాయిసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల హోంలో ఆరుగురికి లక్షణాలున్నాయని ఆస్పత్రి క్వారంటైన్‌కి తరలించారు. ఇప్పటికే ఆస్పత్రి ఐసొలేషన్‌లో 28 మంది వరకూ కరోనా అనుమానితులు చికిత్సలు పొందుతున్నారు. హిందూపురానికి చెందిన ఓ వ్యక్తిని ట్రామా సెంటర్‌లోని వెంటిలేటర్ల విభాగంలో ఉంచి మూడ్రోజులుగా చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు, సిబ్బంది టెన్షన్‌ పడుతున్నారు. ఇతర అనుమానితుల రిపోర్టులు కూడా రాకపోవటంతో ఆస్పత్రిలో రిపోర్టుల కోసం ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2020-04-04T10:18:21+05:30 IST