అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2020-10-20T07:11:19+05:30 IST

అంతర్‌జిల్లా ద్విచక్రవాహన దొంగల ముఠా సభ్యులు ఐదుగురిని అరెస్టు చేశామని మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్టు

 విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

 

ఏసీసీ, అక్టోబరు 19: అంతర్‌జిల్లా ద్విచక్రవాహన దొంగల ముఠా సభ్యులు ఐదుగురిని అరెస్టు చేశామని మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు.  సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మంచిర్యాల పట్టణంలో గత కొన్ని రోజులుగా రాత్రి సమయంలో ఇళ్ల ముందు పెట్టుకున్న ద్విచక్రవా హనాలను చోరీ చేస్తున్న ముఠాను పట్టుకోవడానికి మంచిర్యాల టౌన్‌ సీఐ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పార్టీలను ఏర్పాటు చేశామని చెప్పారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం 6 గంటలకు పట్టణంలోని సున్నంబట్టివాడలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఒక రెడ్‌కలర్‌ యమహా ఎఫ్‌జెడ్‌ వాహనం మీద అనుమానాస్పదంగా తిరుగుతుండగా విచారించామని వివరించారు. మంచిర్యాల టౌన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో దాదాపు 15 ద్విచక్రవాహనాలను దొంగతనం చేసినట్లు పంచ్‌ విట్‌నెస్‌ సమక్షంలో ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ఒక బాల నేరస్తుడిని(15) గతంలో మోటార్‌సైకిల్‌, గంజాయి సరఫరా కేసులో మందమర్రి పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. 


బాల సంరక్షణ గృహంలో ఉండి జూన్‌ నెలలో విడుదలయ్యాడని తెలిపారు. అతడు బయటకు వచ్చిన తర్వాత ములుగు  జిల్లా వెంకటాపురంకు చెందిన తన మేనమామ అయిన నాయికిని శ్రీకాంత్‌, మంచిర్యాలలోని గోపాల్‌వాడకు చెందిన పెర్మల్‌ చైత్య ఈశ్వర్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారని చెప్పారు. మంచిర్యాల పట్టణంతో పాటు మందమర్రి, లక్షెట్టిపేట, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ పట్టణం, పెద్దపల్లి పట్టణంలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 15 మోటార్‌ సైకిళ్లను చోరీచేశారని తెలిపారు. వాటిని భూపాలపల్లి జిల్లా ములుగు వెంకటాపురం పీఎస్‌ పరిధిలోని సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన కిరణ్‌ అనే వ్యక్తికి, మంచిర్యాలలో ఉండే మహేందర్‌కు విక్రయించారని తెలిపారు.


ఆ డబ్బులతో అందరు కలిసి జల్సాలు చేస్తున్నారని  అన్నారు. ఐదుగురు ముఠా సభ్యులను పట్టుకోవడం లో కృషి చేసిన మంచిర్యాల టౌన్‌ ఇన్స్‌పెక్టర్‌ ముత్తి లింగయ్య, వి. ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై మారుతి, ఎస్సై రాజమౌళిగౌడ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ దివాకర్‌, కానిస్టేబుళ్లు భరత్‌, శ్రావణ్‌కుమార్‌, సీసీఎస్‌ మంచిర్యాల సిబ్బందిని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, మంచిర్యాల ఇన్‌చార్జి ఏసీపీ నరేందర్‌ అభినందించారు. 

Updated Date - 2020-10-20T07:11:19+05:30 IST