ఎందరో త్యాగధనులు

ABN , First Publish Date - 2022-08-11T05:24:44+05:30 IST

స్వాతంత్య్రమే లక్ష్యంగా పోరాడారు. ఎన్నో త్యాగాలు చేశారు. బ్రిటీష్‌ పాలనను ఎదురించి మరెన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు.

ఎందరో త్యాగధనులు
క్విట్‌ ఇండియా ఉద్యమంలో సాలూరు వాసులు

 స్వాతంత్య్ర సంగ్రామంలో  జిల్లా సమరయోధులు  

  బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాటం

  జైలు జీవితం గడిపిన వైనం

  స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన ‘మన్యం’ వీరులు

 (పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

స్వాతంత్య్రమే లక్ష్యంగా పోరాడారు. ఎన్నో త్యాగాలు చేశారు.  బ్రిటీష్‌ పాలనను ఎదురించి మరెన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు.   జైలు శిక్షలు సైతం అనుభవించారు. మహోద్యమంలో తమదైన పాత్ర పోషించి ప్రజలను చైతన్యవంతం చేశారు. వందేమాతరం అంటూ స్వాతంత్య్ర కాంక్షను రగిలించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. మొత్తంగా తమ   ధైర్యసాహసాలతో ముందుకుసాగి చరిత్రలో జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కేలా చేశారు.  స్వాతంత్య్ర సంగ్రామంలో చెరగని ముద్ర వేసుకున్న జిల్లాకు చెందిన సమరయోధులపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. 

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంతోమంది స్వాతంత్య్ర సమరంలో భాగస్వాములయ్యారు. క్విట్‌ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. ప్రజలను ఉద్యమం వైపు నడిపించి బ్రిటీష్‌ వారికి దడ పుట్టించారు. స్వాతంత్య్ర పోరును మరో దశకు చేర్చి నేటికీ చర్చించుకునేలా సేవలందించారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యుల పరిస్థితిని ఇప్పుడు తెలుసుకుందాం. 

పార్వతీపురంలో.. 

  జిల్లా కేంద్రం విషయానికొస్తే.. పార్వతీపురానికి చెందిన గొర్లి సూర్యనారాయణ స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. ఆచార్య రంగా, సర్దార్‌ గౌతు లచ్చన్న శిష్యుడిగా ఉండేవారు. ముఖ్యంగా నాటి యువతను చైతన్యపర్చి మహోద్యమం వైపు నడిచేలా చేశారు. దీంతో బ్రిటీష్‌ వారి ఆగ్రహానికి గురై.. 1932 నుంచి ఐదేళ్లపాటు ఆయన వరుసగా పార్వతీపురంలోనే జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్య్ర సమరంలో తనవంతు పాత్ర పోషించిన సూర్యనారాయణ  సుమారు 32 ఏళ్ల  కిందట వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన భార్య గంగాయమ్మ ఆరు నెలల కిందట  చనిపోయారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సూర్యనారాయణ పెద్ద కుమారుడు ప్రభాకరరావు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభాకరరావు తమ్ముడు రాజేంద్రప్రసాద్‌  మృతి చెందడంతో ఆయన భార్య కళావతితో పాటు వారి పిల్లలను కూడా ప్రభాకరరావు పోషించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూడాలని ఆయన కోరుతున్నారు. 

  పట్టణానికి చెందిన కూర్మాపు నారాయణమూర్తి 1922, సెప్టెంబరు 15న శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుళ్లసీతారాంపురంలో జన్మించారు. కాగా ఆయన కుటుంబం పార్వతీపురంలోనే స్థిరపడింది. విద్యార్థి దశ నుంచే ఆయన బ్రిటీష్‌ పాలనను వ్యతిరేకించారు. ఆ తర్వాత స్వాత్రంత్య్ర సమరంలో తనదైన పాత్ర పోషించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. నారాయణమూర్తి కుటుంబం కూడా ఆర్థిక సమస్యల్లోనే ఉంది. స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే ప్రభుత్వ భూమిని కూడా ఆయన తీసుకోలేదు. ప్రస్తుతం పట్టణంలో ఉన్న ఆయన నివాసం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆ ఇంట్లో ఎవరూ ఉండడం లేదు. కుటుంబ సభ్యులు అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. 

  మరొక స్వాతంత్య్ర సమరయోధుడు మల్లావర్జుల రామ్మూర్తి 1897 జనవరి 17న పార్వతీపురంలో జన్మించారు. ఆయన సరోజనీనాయుడుకు ముఖ్య అనుచరుడిగా, టంగుటూరి ప్రకాశం పంతులుకు నమ్మిన బంటుగా ఉండేవారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం అందించిన భూమిని కూడా పేదలకు త్యాగం చేశారు. రామ్మూర్తి విగ్రహాన్ని పార్వతీపురంలో ఏర్పాటు చేయాలని ఆయన మనుమరాలు వెంకటపద్మలత ప్రయత్నించినప్పటికీ సఫలీకృతులు కాలేకపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టణంలో తన తాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

  పట్టణవాసి పాలూరు సాంబమూర్తి రైతు కుటుంబంలో జన్మించారు. అయితే బాల్యం నుంచి గాంధీజీ , నెహ్రూ సందేశాలు వింటూ పెరిగారు. ఆ తర్వాత ప్రత్యక్షంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి  1940లో జైలుకు కూడా వెళ్లారు. 

  పార్వతీపురరానికి చెందిన మరొక స్వాతంత్య్ర సమరయోధుడు పేలూరి సోమిబాబు కూడా గాంధీజీ మార్గంలో నడిచారు. విదేశీ వస్తు బహిష్కరణకు తనువంతుగా పోరాటం చేశారు. ఖద్దరును ధరిస్తూ  స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1942లో జైలుకు వెళ్లి శిక్ష కూడా అనుభవించారు.  

  మరో  స్వాతంత్య్ర సమరయోధుడు బెలగాం లక్ష్మీనారాయణ 1916 ఫిబ్రవరి 26న పార్వతీపురంలోనే జన్మించారు.  బాల్యం నుంచే  బ్రిటీష్‌ పాలనను వ్యతిరేకించారు.  అనేకసార్లు జైలుకు కూడా వెళ్లారు.  స్వాతంత్య్రం వచ్చిన తరువాత పట్టణంలో ఉన్న గాంధీ సత్రానికి చైర్మన్‌గా ఉంటూ సేవా కార్యక్రమాలు చేసేవారు. 

  పట్టణానికి చెందిన గేదెల పైడితల్లి రైతు కుటుంబంలో జన్మించారు. స్వాతంత్య్ర సమరంలో చురుగ్గా పాల్గొని 1940, 1942లో  జైలు శిక్ష అనుభవించారు. సుమారు ఎనిమిదేళ్ల కిందట ఆయన కన్నుమూశారు. 

సాలూరులో.. 

 సాలూరు: సాలూరుకు చెందిన కూనిశెట్టి వెంకట నారాయణ దొర  1907 జూలై4న   యరకన్నదొర, సాయమ్మ దంపతులకు తొలి సంతానంగా  జన్మించారు. విద్యార్థి దశ నుంచే దేశ స్వాతంత్య్రం కోసం పరితపించిన ఆయన 1922లో సాలూరులో చేపట్టిన సహాయనిరాకరణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. సారా, కల్లు వేలం పాటలు జరగకుండా నిరోధించారు. విదేశీ  వస్తు బహిష్కరణకు తనవంతుగా సహాయ సహకారాలు అందించారు. 1930 విశాఖలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆరు నెలల పాటు కఠిన కరాగార శిక్ష అనుభవించారు. 1932లో గుంటూరులో గాంధీజీ శిష్యురాలు వేదాంతం కమలాదేవి అధ్యక్షతన జరిగిన  ఆంధ్రా పొలిటికల్‌ కాన్ఫెరెన్స్‌కు హాజరై అరెస్ట్‌ అయ్యారు. 1940లో నాగపూర్‌, హైదారాబాద్‌, గుంటూరులోని సత్యాగ్రహ శిబిరాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు గాను మరోసారి అరెస్ట్‌ అయ్యారు. 1942లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమానికి సాలూరు తరఫున నాయకత్వం వహించినందుకు ఆయనపై ఆంక్షలు విధించారు.  1952-55 మధ్య కాలంలో సాలూరు తొలి ఎమ్మెల్యేగా పనిచేశారు.  1974లో తామ్రపత్రాన్ని అందుకున్నారు. పట్టణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

  

Updated Date - 2022-08-11T05:24:44+05:30 IST