‘కొత్త’ పోరు..!

ABN , First Publish Date - 2022-01-28T07:25:03+05:30 IST

కొత్త జిల్లాలను హడావుడిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై జిల్లా లో అనేకచోట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ మనోభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా కొత్త జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేయడంపై పార్టీలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆందోళనలు పెరుగుతున్నా యి.

‘కొత్త’ పోరు..!

  • కొత్త జిల్లాల ఏర్పాటుపై కదులుతున్న తేనెతుట్టె 
  • ఎక్కడికక్కడ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి పెరుగుతున్న అభ్యంతరాలు
  • విలీన మండలాలతో కలిపి రంపచోడవరం జిల్లా ఏర్పాటుచేయాలని అఖిలపక్షం తీర్మానం
  • కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని వైసీపీ, టీడీపీ, మాలమహానాడు డిమాండ్‌
  • జీఎంసీ బాలయోగి పేరు పెట్టాలంటూ తెరమీదకు మరికొందరి వాదన
  • కాకినాడ జిల్లాకు సత్యలింగనాయకర్‌ జిల్లాగా నామకరణం చేయాలని వినతులు
  • కాకినాడ జిల్లా నుంచి తూర్పుగోదావరి పేరు వేరు చేస్తే ఊరుకోమని ప్రజాసంఘాల హెచ్చరిక
  • తాళ్లరేవును కోనసీమ జిల్లాలో కలపొద్దంటూ నేటి నుంచి అఖిలపక్షం ఆందోళన
  • మరోపక్క కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడో, రేపో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేయనున్న కలెక్టర్‌ 
  • ఫిబ్రవరి 26 వరకు అభ్యంతరాల స్వీకరణకు ఏర్పాట్లు.. దీనికి కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగం

కొత్త జిల్లాలపై తేనెతుట్టె కదులుతోంది. ఎవరికివారే తమ అభ్యంతరాలపై ఆందోళనలు, నిరసనలకు సిద్ధమవుతున్నారు. దగ్గరగా ఉన్న జిల్లా కేంద్రాన్ని కాదని వేరే కొత్త జిల్లా కేంద్రంలో తమను కలపొద్దంటూ పార్టీలు సైతం ఉమ్మడిగా పోరాటానికి సన్నాహాలు చేస్తున్నాయి. తమ అభ్యంతరాలను వినకుండా నిర్ణయం తీసుకుంటే ఊరుకునేది లేదని ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. విలీన మండలాలను కలుపుతూ రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించాలని ఏజెన్సీలో అఖిలపక్ష పార్టీలు గురువారం తీర్మానించాయి. తాళ్లరేవును కోనసీమ జిల్లాలో కలపొద్దని, పక్కనే ఉన్న కాకినాడ జిల్లాలో చేర్చాలంటూ వైసీపీ, టీడీపీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. కొత్త జిల్లాలకు పేర్ల విషయంలోను డిమాండ్‌లు పెరుగుతున్నాయి. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ జిల్లాగా నామకరణం చేయాలని వైసీపీ, టీడీపీ, దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లోక్‌సభ దివంగత స్పీకర్‌ జీఎంసీ బాలయోగి పేరు పెట్టాలన్న మరో వాదనా తెరమీదకు వస్తోంది.  కాకినాడ జిల్లా నుంచి తూర్పుగోదావరి పదం తొలగిస్తే ఊరుకునేది లేదని ప్రజా సంఘాలు గొంతెత్తుతున్నాయి. ఇక మండపేట నియోజకవర్గాన్ని కోనసీమలో కాకుండా రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలనే డిమాండు అంతకంతకూ రాజుకుంటోంది. కాగా నేడో, రేపో కొత్త జిల్లాలపై కలెక్టర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి అభ్యంతరాలు స్వీకరించనున్నారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కొత్త జిల్లాలను హడావుడిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై జిల్లా లో అనేకచోట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ మనోభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా కొత్త జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేయడంపై పార్టీలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆందోళనలు పెరుగుతున్నా యి. రంపచోడవరం, ఏటపాక డివిజన్లను 250 కిలోమీటర్ల దూరంలోని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాలో కలపొద్దని గిరిజన సంఘాలు,రాజకీయ పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. బదులుగా విలీనమండలాలను కలిపి రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే కాకినాడ కేంద్రమే దూరాభారంగా ఉందని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు తమ ప్రాంతంతో సంబంధాలే లేని పాడేరులో కలపడం ఏమిటని నిలదీస్తున్నాయి. ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేస్తేనే ఇక్కడి ఆదివాసీల కష్టాలు తీరుతాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రంప కేంద్రంగా కొత్త జిల్లా కావాలని కూనవరంలో అఖిలపక్ష నాయకులు గురువారం తీర్మానం చేశారు. అన్ని మండలాల్లోను ఇలా తీర్మానాలు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు వీటిని అందించాలని నిర్ణయించారు. ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవును కోనసీమ జిల్లాలో కలపొద్దని, పక్కనే ఉన్న కాకినాడ జిల్లాలో చేర్చాలని అక్కడ వైసీపీ, టీడీపీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. కోనసీమ నుంచి తమను విడదీయాలంటూ స్థానిక వైసీపీ, ఇతర ప్రజాసంఘాలు గురువారం తమ అభ్యంతరాలతో కూడిన పత్రాలు విడుదల చేశారు. ఇతర అన్ని పార్టీలు, ప్రజాపక్షాలను ఏకం చేసి శుక్రవారం నుంచి ఆందోళనలు చేపట్టనున్నాయి. పెదపూడి విషయంలోనూ అన్ని పార్టీలతో కలిపి ఆందోళనకు టీడీపీ సిద్ధమవుతోంది. అటు రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల నుంచి కూడా ఆందోళనకు పార్టీలు, ప్రజాసంఘా లు కార్యాచరణ రచిస్తున్నాయి. మండపేట నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లాలో కాకుండా పక్కనే ఉన్న రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని అక్కడ పెద్దఎత్తున ప్రజలు డిమాండు చేస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క పేర్ల విషయంలోనూ క్రమేపీ డిమాండ్లు పెరుగుతున్నాయి. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ జిల్లా పేరు పెట్టాలని వైసీపీ డిమాండ్‌ చేస్తోంది. ఈపేరు సాధించే వరకు గట్టి ప్రయత్నాలు చేస్తామని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి పేర్కొన్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు, మాల మహానాడు సైతం అంబేడ్కర్‌ జిల్లాగా కోనసీమను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కోనసీమకు లోక్‌సభ దివంగత స్పీకర్‌ జీఎంసీ బాలయోగి పేరు పెట్టడమే సబబుగా ఉంటుందని టీడీపీలోనే కొందరు డిమాండు చేస్తున్నారు. అటు తూర్పుగోదావరి పేరును రాజమహేంద్రవరం జిల్లాకు కొనసాగించి కాకినాడ జిల్లాకు తొలగిస్తున్నారని, అలా అయితే ఊరుకోమని ప్రజాసంఘాలు, సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం హెచ్చరిస్తున్నాయి. తూర్పుగోదావరి వాసులుగా బయటకు వెళ్లి చెప్పుకోవడం తమకు గర్వకారణమని, ఇప్పుడు కేవలం కాకినాడ జిల్లా వాసులుగా చెబితే తమకు గుర్తింపు ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. దీని పై అన్ని సంఘాలు ఆందోళనకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అటు కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగనాయకర్‌ పేరు పెట్టాలంటూ టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. ఇలా ఎక్కడికక్కడ తమ ప్రాంత అభీష్ఠాలకు అనుగుణంగా పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళనలు మొదలుపెడుతున్నాయి. మరోపక్క కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నేడో, రేపో జిల్లా స్థాయి లో గెజిట్‌ నోటిఫికేషన్‌ను కలెక్టర్‌ హరికిరణ్‌ జారీ చేయనున్నారు. ఈ మే రకు రెవెన్యూశాఖ ఫైలు సిద్ధం చేసింది. ఇది విడుదల చేసిన రోజు నుంచి ఫిబ్రవరి 26 వరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అభ్యంతరా లను ప్రజలు, పార్టీలు, ప్రజాసంఘాల నుంచి స్వీకరించనున్నారు. కలెక్టరేట్‌లో ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లోను వీటిని తీసుకుంటారా, లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - 2022-01-28T07:25:03+05:30 IST