మూడు ముక్కలు

ABN , First Publish Date - 2022-01-26T07:05:06+05:30 IST

అందరూ అనుకున్నట్టుగానే సమైక్య పశ్చిమ గోదావరి జిల్లా మూడు ముక్కలైంది.

మూడు ముక్కలు

రాజమహేంద్రవరం, ఏలూరు, నరసాపురం జిల్లాలుగా పశ్చిమ
అర్ధరాత్రి హడావుడిగా ఉత్తర్వులు
ఏలూరులోకి నూజివీడు, కైకలూరు
రాజమహేంద్రవరంలో కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం
యథావిధిగానే నరసాపురం జిల్లా
ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడా ఇది ?


(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
అందరూ అనుకున్నట్టుగానే సమైక్య పశ్చిమ గోదావరి జిల్లా మూడు ముక్కలైంది. జిల్లాలను విభజిస్తూ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఊహించినట్టుగానే 15 నియోజకవర్గాలు కాస్తా మూడుగా విభజించబడ్డాయి. కృష్ణా జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజ కవర్గాలు పశ్చిమలో విలీనమవుతుండగా మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన రాజమహేంద్రవరంలో కలవనున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్థిరంగా మరో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ప్రతిపాదిత నరసాపురం జిల్లాలో ఉండబోతున్నాయి.  రివర్స్‌ పీఆర్సీపై పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉద్యమిస్తున్న వేళ ఉరుము లేని పిడుగులా కొత్త జిల్లాల ప్రకటన అందరినీ అయోమయానికి గురి చేసింది. ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసినట్లు చర్చ నడుస్తోంది. ఇక కొత్త జిల్లాల ఏర్పాట్పుఐ రాజకీయ పక్షాలన్నీ ఇప్పటికే జిల్లాలను నిర్ధేశించుకుని ఆ మేరకే కార్య వర్గాలను ఏర్పాటుచేశాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను బహిర్గతం చేసింది. ఇక ముందు పశ్చిమ గోదావరి జిల్లా అదృశ్యం కానున్నది. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాలుగా గోదావరి తీర ప్రాంతాలను వ్యవహరించిన పదం కాస్త అదృశ్యం కాబోతుంది. తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే ఇక్కడ కూడా కొత్త జిల్లాల విభజనకు వైసీపీ సహకరాంతో శ్రీకారం చుట్టినట్టయింది. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజనకు దిగింది. మంగళవారం పొద్దుపోయిన తరువాత నిర్దేశిత ఉత్తర్వులను జారీ చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదా వరిలో కీలక నియోజక వర్గాలుగా వున్న కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాజమహేంద్రవరం జిల్లాలో కలవనున్నా యి. కొవ్వూరు, గోపాలపురం రిజర్వుడ్‌ నియోజకవర్గాలు నిడదవోలు మాత్రం రాజకీయంగా ఒకింత భిన్నమైంది. అలాంటి ఈ నియోజకవర్గాలన్నీ తాజా నిర్ణయంతో సరికొత్త మార్గంలో పయనించనున్నాయి. రాజమహేంద్ర వరానికి అత్యంత చేరువలో ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ ఇప్పటికే ఆ పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్నాయి.  

కొత్త జిల్లాలు.. పరిధులు


ఏలూరు జిల్లా : ఏలూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి, ఉంగుటూరు పాత నియోజకవర్గాలతో పాటు కొత్తగా కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు, కైకలూరులను ఇందులో విలీనం చేయనున్నారు. దాదాపు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలను ఒకటిగా చేసి కొత్త జిల్లాకు రూపకల్పన చేశారు. కృష్ణా జిల్లాలో కీలకంగా, రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా వున్న నూజివీడును కొల్లేరులో అంతర్భాగమైన కైకలూరు ఇప్పుడు కొత్తగా ఈ జిల్లాలో కలిసినట్టయ్యింది.
ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు ఆమోదిస్తారా.. లేదంటే వ్యతిరేకిస్తారా అనేది వేచి చూడాల్సిందే..

నరసాపురం జిల్లా : నరసాపురం పేరిట కొత్త జిల్లాకు శ్రీకారం చుట్టింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నరసాపురం జిల్లా పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు వెలు వడ్డాయి. నరసాపురం, ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజక వర్గాలు ఉంటాయి. రాజకీయంగా, రైతు వారీగా, మార్కెట్‌పరంగా ఒకింత చైతన్యం కలిగిన ఈ ప్రాంత మంతా అభివృద్ధి చెందినదిగా పేరొందింది. ఇప్పటికే తాడేపల్లిగూడెం విద్యా, వాణిజ్య రంగాల్లో దూసుకు పోతుండగా భీమవరం రాష్ట్రానికే కాకుండా ఇతర ప్రాంతాలకు చిరపరిచితమైన పేరు. ఆక్వా రంగంలో విదేశీయులను ఆకర్షించిన ప్రాంతమిది.

రాజమహేంద్రవరం జిల్లా : తూర్పు గోదావరి పరిధి లో వున్న రాజమహేంద్రవరం జిల్లాలోకి రాజమహేంద్ర వరం అర్బన్‌, రూరల్‌, రాజానగరం, అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు పశ్చిమలోని కొవ్వూరు, నిడద వోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాలు వెళ్లను న్నాయి.

Updated Date - 2022-01-26T07:05:06+05:30 IST