ఆదివాసుల అభివృద్ధికి నిరంతర కృషి

ABN , First Publish Date - 2020-08-10T10:18:30+05:30 IST

ఆదివాసుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ అన్నారు.

ఆదివాసుల అభివృద్ధికి నిరంతర కృషి

మెడికల్‌ కాలేజీ అందుబాటులోకి వస్తే వైద్య సేవలు మరింత మెరుగు

వైద్య, ఆరోగ్య శాఖ పోస్టుల భర్తీలో  మన్యానికి  తొలి ప్రాధాన్యం

ఆదివాసీ దినోత్సవంలో జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌


పాడేరు, ఆగస్టు 9: ఆదివాసుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ అన్నారు. తలారిసింగి క్రీడా మైదానంలో స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విశాఖ పట్నం వచ్చినప్పుడల్లా... గిరిజన ప్రాంతం అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్య రంగాల గురించి ప్రత్యేకంగా మాట్లాడతారని అన్నారు. పాడేరులో మెడికల్‌ కాలేజీ అందుబాటులోకి వస్తే మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు.


ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో పోస్టులను భర్తీ చేస్తున్నదని, తొలుత ఏజెన్సీలో ఖాళీల భర్తీ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీలో రూ.99.84 కోట్ల వ్యయంతో 367 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.35 కోట్లతో 350 అంగన్వాడీ భవనాలు, రూ.25 కోట్లతో 135 వెల్‌నెస్‌ సెంటర్లు, రూ.500 కోట్లతో వెయ్యి కిలోమీటర్ల రహదారి నిర్మాణాలు చేపడుతున్నామని కలెక్టర్‌ వివరించారు. గిరిజనుల కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ఆయన వివరించారు.


పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ఆదివాసులు గొప్ప దేశ భక్తులని, పర్యావరణ సంరక్షకులని కొనియాడారు. సీఎం జగన్మోహనరెడ్డి 50 వేల మంది గిరిజను లకు లక్ష ఎకరాలకు భూమి హక్కు పట్టాలు ఇవ్వడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ, గిరిజనుల హక్కులు, చట్టాల పరిరక్షణకు, వారి అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారన్నారు.


గత ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలపై జారీ చేసిన జీవో- 97ను తమ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అంతకు ముందు వేదికపై గిరిజన నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివిధ పథకాలలబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేశారు. ధింసా నృత్యాలు, గిరిజనుల ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, మాజీ మంత్రి ఎం.మణికుమారి, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు డాక్టర్‌ టి.నరసింగరావు, ఐటీడీఏ ఏపీవో వీఎస్‌.ప్రభాకరరావు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-10T10:18:30+05:30 IST