జిల్లా కేంద్రం..‘చెత్త’ భద్రం

ABN , First Publish Date - 2022-05-09T05:26:02+05:30 IST

ప్రస్తుతం రాయచోటి కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కేంద్రం. దీంతో పట్టణ రూపురేఖలు మారిపోతాయని ప్రజలు ఎంతో ఆశించారు. అయితే అందుకు భిన్నంగా పట్టణంలో పారిశుధ్యం అటకెక్కింది.

జిల్లా కేంద్రం..‘చెత్త’ భద్రం
కొద్దిపాటి వర్షానికే రోడ్డుమీదకు వచ్చిన వర్షపు నీళ్లు

కంపు కొడుతున్న రాయచోటి

చేతులెత్తేసిన మునిసిపాలిటీ


పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. ఒక్కసారి రాయచోటిని చూస్తే పరిస్థితి అర్థం అవుతుంది. ప్రస్తుతం రాయచోటి కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కేంద్రం. దీంతో పట్టణ రూపురేఖలు మారిపోతాయని ప్రజలు ఎంతో ఆశించారు. అయితే అందుకు భిన్నంగా పట్టణంలో పారిశుధ్యం అటకెక్కింది. ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి అపరిశుభ్రత తాండవిస్తోంది. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన మునిసిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో చెత్త కంపు భరించలేక ప్రజలు ముక్కులు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): రాయచోటి మునిసిపాలిటీలో చిన్న, పెద్ద కలిసి సుమారు 180 కిలోమీటర్ల వరకు మురికినీటి కాలువలు ఉన్నాయి. సాధారణంగా వీటిని తరుచూ శుభ్రం చేయాలి. అయితే సక్రమంగా శుభ్రం చేయకపోవడం.. అది కూడా ఏ నెలకో.. రెండు నెలలకో మునిసిపాలిటీ వాళ్లు శుభ్రం చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా మురికినీటి కాలువలు మట్టి, ఇసుకతో నిండి.. నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడినా మురికినీళ్లు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. కొత్తపేట, బోస్‌నగర్‌, కె.రామాపురం, దూదేకులపల్లె, కొత్తపల్లె, ఇలా దాదాపు పట్టణమంతా మురికినీటి కాలువలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. మునిసిపాలిటీలో పారిశుధ్య పనులు పర్యవేక్షిస్తున్న వారు.. సక్రమం గా మురికినీటి కాలువలను శుభ్రం చేయించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం కాలువలో పైపైన మట్టి, ఇసుకను తొలగిస్తున్నారు. దీంతో కేవలం వారం పది రోజులకే మళ్లీ కాలువలు నిండి.. మురికి నీళ్లు రోడ్లపైన దర్శనమిస్తున్నాయి. 


ఎత్తిన చెత్త.. తొలగించేదెపుడో.. 

కాలువలను శుభ్రం చేసి అందులోని మట్టి, చెత్తను కాలువ గట్టున వేస్తున్నారు. అయితే ఆ చెత్తను వారం పది రోజులైనా తొలగించడం లేదు. దీంతో మళ్లీ ఆ చెత్త కాలువలోనే పడుతోంది. కొత్తపేట సాయిరాం వీధిలో సుమారు 15 రోజుల కిందట కాలువలను శుభ్రం చేసి చెత్తను బయట వేశారు. అయితే ఇప్పటి వరకు ఆ చెత్తను తొలగించలేదు. అదే విధంగా బాలాజీ స్కూల్‌ ఎదురుగా వీధిలోనూ ఇదే పరిస్థితి ఉంది. కొత్తపేట రామాపురం లోనూ ఇదేవిధంగా ఎత్తిన చెత్తను తొలగించలేదు. నిత్యం జనం, అధికారులు తిరుగుతూ ఉండే ఈ ప్రాంతలోనే కాలువ గట్టు మీద చెత్తను అలాగే వదిలేస్తే.. ఇక భట్టు వీధి, కొత్తపల్లె, పూలతోటపల్లె ప్రాంతాలలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పవలసిన అవసరం లేదని పలువురు వ్యాఽఖ్యానిస్తున్నారు. 


చేతులెత్తేసిన మునిసిపాలిటీ

రాయచోటి మునిసిపాలిటీలో ప్రస్తుతం పారిశుధ్య సిబ్బంది రెగ్యులర్‌ 6, అవుట్‌ సోర్సింగ్‌ 148 మంది ఉన్నారు. వీళ్లంతా ప్రతిరోజూ పనులకు హాజరవుతున్నట్లు మస్టర్‌లో నమోదు చేస్తున్నారు. వీరిలో 46 మంది క్లాప్‌ ప్రోగ్రాం ఆటోలతో పాటు వెళతారు. మిగిలిన వారు వీధులు శుభ్రం చేయడంతో పాటు.. మురికినీటి కాలువలు శుభ్రం చేయాలి. మరి రోజూ అంతమంది విధులకు హాజరవుతూ ఉంటే.. మునిసిపాలిటీలో పారిశుధ్యం పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకుందో.. మునిసిపల్‌ అధికారులే చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. పారిశుధ్య పనుల విషయంలో మునిసిపాలిటీ పూర్తిగా చేతులెత్తేసిందని ఆరోపిస్తున్నారు. మునిసిపాలిటీకి చెందిన అధికారులు కనీసం నెలకు ఒకసారైనా వీధుల్లో తిరిగితే.. వాస్తవ పరిస్థితి అర్థం అవుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపఽథ్యంలో జిల్లా కేంద్రం కావడంతో.. ఇక్కడికి కొత్తగా అధికారులు, అనధికారులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. చాలామంది ఇక్కడ నివాసం ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాయచోటి కంపును చూసి జడుసుకుంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


నా దృష్టికి వస్తే తక్షణం చర్యలు తీసుకుంటా..

- రాంబాబు, మున్సిపల్‌ కమిషర్‌, రాయచోటి

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా కాలువలు శుభ్రం చేసి చెత్తను ఎత్తి వేయకపోతే నా దృష్టికి తీసుకురావాలి. వెంటనే స్పందించి చెత్తను తొలగింపచేస్తాం. 



Read more