జిల్లా కేడర్‌ ఉద్యోగుల విభజన పూర్తి!

ABN , First Publish Date - 2021-12-21T07:01:10+05:30 IST

జిల్లా కేడర్‌ ప్రభుత్వ ఉద్యోగుల విభజన పూర్తయింది. సోమవారం వీరికి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల్లోగా నిర్దేశిత జిల్లాల్లో కలెక్టర్లకు, తమ శాఖల జిల్లా అధికారులకు వీరు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం కలెక్టర్లు, జిల్లా అధికారులు పాలనా..

జిల్లా కేడర్‌ ఉద్యోగుల విభజన పూర్తి!

  • లక్ష మందికి కేటాయింపు ఉత్తర్వులు..
  • వారం లోగా జిల్లాల్లో రిపోర్టు చేయాలి: సీఎస్‌


హైదరాబాద్‌, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లా కేడర్‌ ప్రభుత్వ ఉద్యోగుల విభజన పూర్తయింది. సోమవారం వీరికి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల్లోగా నిర్దేశిత జిల్లాల్లో కలెక్టర్లకు, తమ శాఖల జిల్లా అధికారులకు వీరు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం కలెక్టర్లు, జిల్లా అధికారులు పాలనా సౌలభ్యం, ఖాళీల మేరకు పోస్టింగ్‌లు ఇస్తారు. అయితే.. జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల విభజన కొంత నిదానంగా సాగుతోంది. ఇప్పటివరకు 10 వేలమంది ఉద్యోగుల విభజనే పూర్తయినట్లు తెలిసింది. ఇది కొలిక్కి రావాలంటే మరో వారం పట్టొచ్చని అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు వివరిస్తున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల విభజన  హైదరాబాద్‌ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో కొనసాగుతోంది. ఉద్యోగుల కేటాయింపుపై నాలుగు జిల్లాల్లో ఈ నెల 11 నుంచి 15 వరకు, ఐదు జిల్లాల్లో ఈ నెల 17 నుంచి సోమవారం వరకు సమావేశాలు జరిగాయి.


జిల్లా కేడర్‌ పోస్టులకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు.., జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల విభజనపై సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి వికా్‌సరాజ్‌ చైర్మన్‌గా ఉన్న రాష్ట్రస్థాయి కమిటీ సమావేశమయ్యాయి. జిల్లా కమిటీల సమావేశాలు సోమవారంతో ముగిశాయి. 9 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 1.02 లక్షల మంది ఉద్యోగుల విభజనను పూర్తి చేసినట్లు తెలిసింది. కాగా, ఈ నెల 20లోపు జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టుల విభజన పూర్తి చేసి, కేటాయింపు ఉత్తర్వులివ్వాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ షెడ్యూల్‌ జారీ చేశారు. ఈ దృష్ట్యా జిల్లా పోస్టుల విభజనను పూర్తి చేశారు. మరోవైపు రాష్ట్ర స్థాయి కమిటీ చైర్మన్‌ వికా్‌సరాజ్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌, ఆర్థిక శాఖ కన్సల్టెంట్‌ ఎన్‌.శివశంకర్‌ ఆధ్వర్యంలో బీఆర్కే భవన్‌లో.. జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల విభజన సోమవారం కొనసాగింది. మరో 7,500 మంది ఉద్యోగుల కేటాయింపును పూర్తి చేశారు. ఆదివారం పురపాలక-పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమం, సాగునీటి పారుదల, వాణిజ్య పన్నుల శాఖల్లోని దాదాపు 2,500 మంది విభజనను పూర్తి చేశారు. సోమవారం పోలీసు, సహకార తదితర శాఖలతో పాటు.. ఆదివారం పురపాలక, వాణిజ్య పన్నుల శాఖల్లో మిగిలిపోయిన ఉద్యోగుల విభజనను చేపట్టారు. వాస్తవానికి విభజన చేయాల్సిన జోనల్‌ పోస్టులు 1.50 లక్షలు, మల్టీ జోనల్‌ పోస్టులు 28 వేల వరకు ఉన్నాయి. ఇప్పటివరకు 10 వేల పోస్టుల విభజనే పూర్తయినందున.. మిగతావాటికి వారం పట్టనుంది. ఆ తర్వాతనే కేటాయింపు ఉత్తర్వులు జారీ చేస్తారు.


విభాగాధిపతులతో సీఎస్‌ భేటీ

ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తి చేయాలని సీఎస్‌ అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం బీఆర్కే భవన్‌లో ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశమయ్యారు. అన్ని కేడర్ల ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్నామని, ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితాలను ప్రదర్శనకు పెట్టి, సమావేశాలు నిర్వహించామని సీఎ్‌సకు అధికారులు వివరించారు. సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారని.. ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎస్‌ ఆదేశించారు.


జాగ్రత్తలు తీసుకోండి: సాగునీటి ఈఎన్‌సీ

ఉద్యోగులకు కొత్త జిల్లా, జోనల్‌కు కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ కోరింది. ఈ మేరకు అధికారులకు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ-అడ్మిన్‌) అనిల్‌కుమార్‌ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. లోకల్‌ కేడర్‌ ఉద్యోగుల విషయంలో మంజూరైన సంఖ్య ఎంత? ఎంతమంది పనిచేస్తున్నారు? వంటి వివరాలపు ప్రామాణికం చేసుకోవాలని పేర్కొన్నారు. గజ్వేల్‌ ఈఎన్‌సీ అనుసరించిన విధానాన్ని సర్క్యులర్‌కు జోడించి.. ఆచరించాలని సూచించారు. 


పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపు

పౌర సరఫరాల సంస్థలో పనిచేస్తున్న 261 మంది రెగ్యులర్‌ ఉద్యోగులకు పీఆర్సీ-2020 ప్రకారం జీతాలను చెల్లించేలా ప్రభుత్వ అదనపు కార్యదర్శి వి.అనిల్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పొందుతున్న సంస్థల్లోని రెగ్యులర్‌ ఉద్యోగులకు పీఆర్సీ అమలుకు ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Updated Date - 2021-12-21T07:01:10+05:30 IST