ఇంటి చెంతకే సర్కారు సారె

ABN , First Publish Date - 2020-10-01T09:30:07+05:30 IST

ఇంటి చెంతకే సర్కారు సారె

ఇంటి చెంతకే సర్కారు సారె

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు 

ఈనెల 9 నుంచి పంపిణీ షురూ..

కరోనా దృష్ట్యా ఇళ్ల వద్దకే చేరవేత

ఈ సారి ఆకట్టుకునేలా డిజైన్లు


తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడబిడ్డల ఆనందానికి అవధులు ఉండవు. ఎంతో ప్రత్యేకత, విశిష్టత ఉన్న ఈ పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా మహిళలకు సారె కింద చీరలను పంపిణీ చేస్తోంది. ఆడపడుచులకు  ఏటా అందించే బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 24 వరకు బతుకమ్మ సంబరాలు జరగనుండడంతో ముందుగానే మహిళలకు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 9 నుంచి చీరలను పంపిణీ చేయాలని సూచించింది. 


హన్మకొండ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఈసారి బతుకమ్మ చీరలు మహిళలను అలరించనున్నాయి. కొత్త డిజైన్లతో బతుకమ్మ చీరలను సిద్ధం చేశారు. చేనేతకు చేయూతనిచ్చేందుకు సిరిసిల్లతో పాటు వరంగల్‌లో మరమగ్గాలపై బతుకమ్మ చీరలను తయారు చేయించారు. 287 విభిన్నమైన డిజైన్లలో బంగారు, వెండి జరి అంచులతో పాలిస్టర్‌, ఫిలమెంట్‌, నూలు చీరలు ఉన్నాయి. గతంలో తయారుచేయించిన రకాలకు అదనంగా మరికొన్ని డిజైన్లు జత చేశారు. సుమారు రూ.317.81కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఈ చీరలు తయారు చేయించింది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా  కోటికిపైగా చీరలను పంపిణీ చేయనుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చీరలు చేరాయి. అక్టోబర్‌ 9 నుంచి చీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన చీరలను వివిధ స్టాక్‌ పాయింట్లలో నిల్వ చేస్తున్నారు. ఒక్కో బండిల్‌లో 160 చీరలు ఉండేట్టు ప్యాక్‌ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వాటిని యథాతథంగా పంపిణీకి తరలిస్తోంది. ఇంతకుముందు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్‌ దుకాణాల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతో లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేశారు. 


13.97 లక్షల చీరలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 13,92,747 చీరలను పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 10,87,356 చీరలు జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. ఇంకా  3,05,391 చీరలు రావాల్సి ఉంది. ఇవి మూడు నాలుగు రోజుల్లో అందుతాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలకు చేరిన చీరలను ఆయా జిల్లాలోని మార్కెట్‌ యార్డుల్లోని గోదాముల్లో భద్రపరిచారు. ఇప్పటి వరకు వచ్చిన చీరలను అర్బన్‌ పరిధిలోని లబ్ధిదారుల కోసం వరంగల్‌ నగర పాలక సంస్థకు, మున్సిపాలిటీల పరిధిలోని వారికి మునిసిపాలిటీలకు, గ్రామీణ ప్రాంతాల వారికి మండలాలకు పంపించేశారు. 


ఈసారి ఇంటికే చీరలు

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ యేడు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి బతుకమ్మ చీరలను అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. చీరల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావలసి ఉంది. కలెక్టర్ల పర్యవేక్షణలో మునిసిపాలిటీలు, పంచాయతీ సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, రేషన్‌డీలర్లతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నట్టు సమాచారం. 18ఏళ్లు నిండిన యువతుల నుంచి వయోవృద్ధుల వరకు వీటిని పంపిణీ చేయనున్నారు. కరోనా దృష్ట్యా  చీరల పంపిణీకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి. రేషన్‌షాపుల వద్ద చీరల పంపిణీ చేపడితే మహిళలు పెద్ద ఎత్తున ఎగబడే అవకాశం ఉన్నందున దీనిని నివారించేందుకు రేషన్‌డీలర్‌ ముందుగా తన పరిధిలోని రేషన్‌కార్డులు కలిగిన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి టోకెన్లను అందజేస్తాడు. వాటిపై తేదీ, సమయం ఉంటుంది. వారు ఆ సమయానికి రేషన్‌షాపునకు వెళ్లి తీసుకోవచ్చు. లేదంటే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వస్తారు. వారికి ఈ టోకెన్‌ చూపించి చీరలను పొందవచ్చు. మహిళ పేరు రేషన్‌కార్డులో తప్పనిసరిగా ఉండాలి. అదే వారికి గుర్తింపు.

 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ ఈ విధంగా జరుగనున్నది.


జిల్లాలు                     మొత్తం చీరలు             రావలసిన చేరలు

వరంగల్‌ అర్బన్‌               3,30,470                    3,09,000

వరంగల్‌ రూరల్‌              2,70,000                    1,90,000

ములుగు                     1,60,882                      44,000

భూపాలపల్లి                  1,46,634                      76,800

మహబూబాబాద్‌            2,85,205                      2,68,000

  మొత్తం                   13,92,747                    10,87,356           

Updated Date - 2020-10-01T09:30:07+05:30 IST