విటమిన్‌ ‘ఏ’దీ?

ABN , First Publish Date - 2022-01-14T05:14:49+05:30 IST

పిల్లల ఆరోగ్యాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది. క్రమం తప్పకుండా అందించాల్సిన వ్యాక్సిన్‌, విటమిన్‌ ఏ ద్రావణం సరఫరాను నిలిపివేసింది. దీనికి కొరతను కారణంగా చూపుతోంది. దీంతో చిన్నారుల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పిల్లలకు భవిష్యత్‌లో కంటి చూపు సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఆరు నెలలకు ఒకసారి ఉచితంగా విటమిన్‌-ఎ ద్రావణం సరఫరా చేస్తుండేవారు. గత ఏడాది కాలంగా కార్యక్రమం నిలిచిపోయింది.

విటమిన్‌ ‘ఏ’దీ?
అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులు

- ఏడాదిగా నిలిచిపోయిన ద్రావణం పంపిణీ

- చిన్నారుల కంటి చూపుపై ప్రభావం

- తల్లిదండ్రుల్లో ఆందోళన

(ఇచ్ఛాపురం రూరల్‌)

పిల్లల ఆరోగ్యాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది. క్రమం తప్పకుండా అందించాల్సిన వ్యాక్సిన్‌, విటమిన్‌ ఏ ద్రావణం సరఫరాను నిలిపివేసింది. దీనికి కొరతను కారణంగా చూపుతోంది. దీంతో చిన్నారుల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పిల్లలకు భవిష్యత్‌లో కంటి చూపు సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఆరు నెలలకు ఒకసారి ఉచితంగా విటమిన్‌-ఎ ద్రావణం సరఫరా చేస్తుండేవారు. గత ఏడాది కాలంగా కార్యక్రమం నిలిచిపోయింది. ఐదేళ్లలోపు చిన్నారులకు ద్రావణం విధిగా అందించాలి. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  జిల్లాలో 4,194 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు పిల్లలు 1.40 లక్షల మంది నమోదై ఉన్నారు. వీరంతా విటమిన్‌-ఎ ద్రావణం కోసం ఎదురుచూస్తున్నారు. 2019లో సరఫరా చేయగా పీహెచ్‌సీల్లో మిగిలిన ద్రావణాన్ని గత ఏడాది సర్దుబాటు చేశారు. అయినా చాలామంది చిన్నారులకు అందలేదు. దీనిపై తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్నతాధికారులను అడుగుతుంటే రాష్ట్రస్థాయిలో కొరత ఉందని చెబుతున్నారు. 


ఎందుకు వేయాలంటే..

 తొమ్మిది నెలల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఒక డోసు పూర్తయిన తరువాత మరో ఆరు నెలలకు కచ్చితంగా మరో డోస్‌ వేయాలి. ఇలా ఐదేళ్ల వరకూ కొనసాగించాలి. లేదంటే భవిష్యత్‌లో చిన్నారులను కంటి సమస్యలు వెంటాడుతాయి. శరీరంలో విటమిన్‌-ఎ లోపిస్తే ఎముకలు సరిగ్గా పెరగవు. బలహీనంగా మారతాయి. మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది. చర్మం పొడిబారుతుంది. కంటిచూపు మందగిస్తుంది. దీర్ఘకాలంలో శుక్లాల సమస్యలు తలెత్తుతాయి. ఇంతటి కీలకమైన విటమిన్‌-ఎ ద్రావణాన్ని సరఫరా చేయడంతో సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గతేడాదిలో ఒక్క సీసా కూడా సరఫరా చేయలేదు. దీంతో కొంత మంది ప్రైవేటుగా కొనుగోలు చేసి పిల్లలకు వాడుతున్నారు. అవగాహన లేనివారు ఈ ద్రావణానికి దూరంగా ఉంటున్నారు.


ఉన్నతాధికారుల దృష్టికి..

విటిమిన్‌-ఎ ద్రావణం కొరత ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారు. పీహెచ్‌సీలో నిల్వలు ఉంటే సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించాం. ద్రావణం వచ్చిన వెంటనే చిన్నారులకు పంపిణీ  చేస్తాం. 

- బగాది జగన్నాథరావు, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం 

Updated Date - 2022-01-14T05:14:49+05:30 IST