Abn logo
May 14 2021 @ 00:35AM

17 నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ

చిత్తూరు (సెంట్రల్‌), మే 13: ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈనెల 17 నుంచి వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు జేడీ దొరసాని  తెలిపారు. గురువారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టారు. విత్తనాల పంపిణీకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న 946 రైతు భరోసా కేంద్రా(ఆర్బీకే)ల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. మదనపల్లె డివిజన్‌ పరిధిలో ఈనెల 10 నుంచి ప్రారంభమవగా, గురువారం నుంచి చిత్తూరు డివిజన్‌లో, శనివారం నుంచి తిరుపతి డివిజన్‌ పరిధిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. రైతులకు టోకెన్లు ఇస్తున్నామని, నిర్దేశించిన తేదీల్లో మూడు విడతలుగా విత్తనాలు పొందవచ్చన్నారు. కరోనా కారణంగా రైతులు ఒక్కసారిగా ఆర్బీకేలకు రావద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో లక్ష హెక్టార్లకుపైగా వేరుశనగ సాగు చేయనున్న క్రమంలో 70వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమన్నారు. అయితే 76వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 30 కిలోల బస్తా ధర రూ.2604 ఉండగా, ప్రభుత్వ సబ్సిడీ రూ.1041 పోను, లబ్ధిదారుడి వాటా కింద రూ.1563 చెల్లించాలన్నారు. అరెకరా ఉన్న రైతుకు 30 కిలోల బస్తా, ఆపై ఉన్న వారికి గరిష్ఠంగా రెండు బస్తాలు ఇవ్వనున్నట్లు వివరించారు. నైరుతి రుతు పవనాలు త్వరగా వస్తాయని వాతావరణ శాఖ సూచనల మేరకు రైతులు లోదుక్కులు దున్ని భూమిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగాను నూతన జేడీని ఇన్‌చార్జి డీడీ శివకుమార్‌, ఏడీఏ రమణరావు, సూపరింటెండెంట్‌ అంజయ్య, ఏవోలు శ్రీకాంత్‌రెడ్డి, సుజాత, సంగీత, గాయత్రి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement