‘మెరూన్‌’తో పేదల జీవితాల్లో వెలుగు

ABN , First Publish Date - 2020-10-01T09:46:14+05:30 IST

పేదల ఇళ్లకు మెరూన్‌ (ముదురు కుంకుమ రంగు) పాస్‌పుస్తకాలు ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపే

‘మెరూన్‌’తో పేదల జీవితాల్లో వెలుగు

దసరా నుంచి పాస్‌పుస్తకాల పంపిణీ

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మంలో విలేకరుల సమావేశం


ఖమ్మం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : పేదల ఇళ్లకు మెరూన్‌ (ముదురు కుంకుమ రంగు) పాస్‌పుస్తకాలు ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని, దీని ద్వారా పేదల ఇళ్లకు కుడా హక్కులు దక్కుతాయని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం నగరంలో పదివేల ఇళ్లకు అలాగే సత్తుపల్లి, వైరా, మధిర మునిసిపాలిటీల్లో ఐదు వేల ఇళ్లకు మెరూన్‌ పాసుపుస్తకాలు అందే సౌలభ్యం ఉంటుందని మంత్రి వివరించారు. మునిసిపల్‌ పట్టణాలతోపాటు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పేదల ఇళ్ల వివరాలను ధరణి వెబ్‌సైట్‌లోకి చేర్చి వారికి మెరూన్‌ పాసుపుస్తకాలు అందజేస్తామని.. ఇప్పటి వరకు పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు నిర్మించుకున్న ఇళ్లకు ప్రత్యేకంగా పాస్‌పుస్తకాలు ఇవ్వలేదని, కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే పట్టాదారు పాస్‌పుస్తకాలు హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్‌ పట్టణాలతోపాటు గ్రామ పంచాయతీల్లో ఉన్న వారి పేదల ఇళ్లకు హక్కులు కల్పిస్తూ మెరూన్‌ పాస్‌పుస్తకాలు దసరా నుంచి ఇవ్వబోతుందని, తద్వారా ఆ స్థలాలు, ఇళ్లపై శాశ్వత హక్కు లభిస్తుందన్నారు. అలాగే దేవాదాయ, వక్ఫ్‌ భూములు, ఎన్నెస్పీ భూములు ఏజెన్సీలోని 1/70చట్టం పరిధిలో ఇళ్లు నిర్మించుకుని ఉన్న వారి ఇళ్లను కూడా సర్వే చేసి హక్కు కల్పించే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.


ప్రస్తుతం మునిసిపల్‌, గ్రామపంచాయతీల్లో ఇంటినెంబర్లు లేని ఇళ్లకు ఇంటినెంబర్లు ఇవ్వడంతోపాటు వారిపేరిట కరెంట్‌మీటరు, వాటర్‌పంపు, తదితర రికార్డుల ఆధారంగా ధరణి వెబ్‌సైట్‌లోకి ఎక్కిస్తామన్నారు. ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్‌, సత్తుపల్లి, మధిర, వైరా మునిసిపాలిటీల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో సర్వే ముమ్మరంగా సాగుతోందని మంత్రి వివరించారు. ప్రతీ ఇంటిని ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా ధరణి వెబ్‌సైట్‌లోకి ఇంటి యజమాని వివరాలన్నీ చేర్చుతారని, తద్వారా వివాదాలకు అవకాశం ఉండదని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలంతా సర్వే బృందాలకు సహకరించి తమ ఇళ్లు, స్థలాల ఆధారాలను, వివరాలను ఇవ్వాలని సూచించారు. ఇకపై ప్రైవేటు ఇళ్లస్థలాలు, ఇళ్లు ఎక్కడా ఆక్రమణలకు గురికాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్‌లో 50 డివిజన్లలో సర్వే సాగుతోందని, ప్రతీ ఇంటిని ధరణి యాప్‌లో గుర్తించడం జరుగుతోందన్నారు. యజమానులు స్థానికంగా లేకపోతే వెంటనే అద్దెకు ఉన్న వారి ద్వారానైనా సమాచారం అందించాలని సూచించారు. ఈవిలేకరుల సమావేశంలో  ఖమ్మం జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, నగర మేయర్‌ పాపాలాల్‌, ‘సుడా’ చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ అనురాగజయంతి, జేసీ స్నేహలత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T09:46:14+05:30 IST