ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డుల పంపిణీ షురూ

ABN , First Publish Date - 2020-06-05T09:24:54+05:30 IST

జిల్లావ్యాప్తంగా నిర్వహించిన నవశకం సామాజిక సర్వే ద్వారా గుర్తించిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ..

ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డుల పంపిణీ షురూ

జిల్లాలో లబ్ధిదారులు 14.50 లక్షలు

కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అవినాష్‌ వెల్లడి


గుంటూరు (మెడికల్‌) జూన్‌ 4: జిల్లావ్యాప్తంగా నిర్వహించిన నవశకం సామాజిక సర్వే ద్వారా గుర్తించిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు కొత్తగా ముద్రించిన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభించినట్లు ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బీ అవినాష్‌ తెలిపారు. వలంటీర్లు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కార్డులను అందజేస్తారని ఆయన వివరించారు. జిల్లాలో మొత్తం 14,40,597 మంది లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కార్డులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కార్డులను మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోల ద్వారా గ్రామ, వార్డు సచివాలయాలకు చేర్చడం జరిగిందన్నారు. 


గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో 1,40,345 మంది, గుంటూరు రూరల్‌ పరిధిలో 10,030 మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. నూతనంగా ఇస్తున్న క్యూఆర్‌ బేస్డ్‌ హెల్త్‌కార్డులో అర్హుడై ఉండి సాంకేతికంగా లబ్ధిదారుడు పేరు లేకపోయినా, ఫొటో లేకపోయినా ఆరోగ్యశ్రీ వైద్యసేవలు యధావిధిగా కొసాగిస్తారని డాక్టర్‌ అవినాష్‌ తెలిపారు. కొత్త కార్డు కోసం కుటుంబ సభ్యుల పేర్లు కొత్తగా చేర్చాలన్నా, లేక తీసివేయాలన్నా దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డుల సమాచారం కోసం ప్రజలు  టోల్‌ఫ్రీ నెంబర్‌ 104ను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-06-05T09:24:54+05:30 IST