కొందరికే కిట్లు

ABN , First Publish Date - 2022-07-07T05:16:43+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులకే ‘జగనన్న విద్యాకానుక’ కిట్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాకు అవసరమైన స్థాయిలో కిట్లు రాలేదు. దీంతో పాఠశాలల పునఃప్రారంభం రోజున కొన్ని ప్రాంతాల్లో మొక్కుబడిగా వీటిని అందజేశారు.

కొందరికే కిట్లు
పిండ్రువాడలో పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

- ఎమ్మెల్యేలు చెప్పిన రోజునే ‘విద్యాకానుక’ పంపిణీ
- నాణ్యత లేని స్కూల్‌ బ్యాగ్‌లు.. అరకొరగా పుస్తకాలు
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ సోంపేట/ పొందూరు/ ఇచ్ఛాపురం)

ప్రభుత్వ పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులకే ‘జగనన్న విద్యాకానుక’ కిట్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాకు అవసరమైన స్థాయిలో కిట్లు రాలేదు. దీంతో పాఠశాలల పునఃప్రారంభం రోజున కొన్ని ప్రాంతాల్లో మొక్కుబడిగా వీటిని అందజేశారు. ఉదాహరణకు శ్రీకాకుళం మండలం కళ్లేపల్లిలో విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. చాలా పాఠశాలల్లో పంపిణీ ప్రారంభించలేదు. ఎమ్మెల్యేలు, లేదా ఎమ్మెల్సీలు పాఠశాలల వారీగా తేదీలు ఖరారు చేస్తే.. ఆ రోజున విద్యాకానుకలు పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. కాగా, కొన్నిచోట్ల విద్యాకానుక కిట్లలో బ్యాగులు, బూట్లు నాణ్యతగా లేవు. నాసిరకంగా ఉన్నాయని విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో వాటిని అధికారులు వెనక్కి పంపించేశారు. అలాగే పుస్తకాలు కూడా అరకొరగానే వచ్చాయి.  కొన్నిచోట్ల ఎనిమిదో తరగతి పుస్తకాలు పూర్తిగా రాలేదు. దీంతో కొంతమంది విద్యార్థులకే కొన్ని సబ్జెక్టుల పుస్తకాలను అందజేస్తున్నారు. జిల్లాకు అవసరం మేరకు విద్యాకానుక కిట్లు వచ్చాయా? ఎంతమంది విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారనే విషయమై అడిగినా.. సమగ్ర శిక్ష అధికారుల నుంచి సమాచారం కరవవుతోంది. పుస్తకాల విషయంపైనా స్పష్టత కొరవడుతోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

ఉదాహరణలివీ..
 - సోంపేట మండలంలో 8,100 మంది విద్యార్థులకు అందించేందుకు స్కూల్‌ కాంప్లెక్స్‌లకు చేరిన బ్యాగులు నాణ్యత లేకపోవడంతో తిరిగి పంపించేశామని విద్యాశాఖాధికారులు తెలిపారు. ఇక బూట్లు కూడా విద్యార్థుల కొలతలకు సరిపోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

- పొందూరు మండలంలో 49 ప్రాథమిక, 13 ప్రాథమికోన్నత, ఆరు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటితో పాటు ఒక్కో కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో 6,754 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం వీరికి నోటుబుక్స్‌, బెల్టులు మాత్రమే అందజేశారు. మూడు రోజుల్లో బ్యాగులు, బూట్లు వస్తాయని.. అప్పుడు వాటిని పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

- ఇచ్ఛాపురం మండలంలోని పాఠశాలలకు 1,10,515 పుస్తకాలు అవసరం కాగా  ఇప్పటివరకు 70,470 పుస్తకాలు వచ్చాయి. కవిటి మండలానికి 84,700 పుస్తకాలు అవసరం కాగా  53,500 పుస్తకాలు వచ్చాయి. కంచిలి మండలంలోని పాఠశాలలకు 61,700 పుస్తకాలు అవసరం కాగా 41,600 పుస్తకాలు మాత్రమే వచ్చాయి. సోంపేట మండలంలోని పాఠశాలలకు 69,900 పుస్తకాలు రావల్సి ఉండగా 52,100 పుస్తకాలు మాత్రమే వచ్చాయి.

పిండ్రువాడలో పాఠశాలకు తాళం
విలీన ప్రక్రియపై జనాగ్రహం

హిరమండలం, జూలై 6: జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల విలీన ప్రక్రియపై జనాగ్రహం పెల్లుబికుతోంది. ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నుంచి 3,4,5 తరగతులను అంబావల్లి ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై పిండ్రువాడ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గ్రామంలోని పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉపాధ్యాయులు రోజంతా ఆరుబయటే వేచి ఉండడం కనిపించింది. పాఠశాలల మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విలీనంతో పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రెండు కిలోమీటర్ల దూరంలోని అంబావల్లి పాఠశాలకు వెళ్లాలంటే తీర ప్రాంతాలు, కాలువలను దాటాల్సి ఉంటుందన్నారు. అందుకే విలీన ప్రక్రియను నిలిపివేసి తరగతులను ఇక్కడే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2022-07-07T05:16:43+05:30 IST