తొలి రెండు గంటల్లోనే.. అరవై వేల డోసులు పంపిణీ

ABN , First Publish Date - 2021-04-15T09:23:43+05:30 IST

కొవిడ్‌ టీకాల కోసం ప్రజలు పెద్దఎత్తున తరలివస్తుండగా, కొరత వల్ల అందరికీ డోసులు అందించలేని పరిస్థితిలో అధికారులున్నా రు.

తొలి రెండు గంటల్లోనే.. అరవై వేల డోసులు పంపిణీ

ఆపై డోసుల్లేక జనం వెనక్కి.. ‘టీకా ఉత్సవ్‌’ పరిస్థితి ఇదీ!


విజయవాడ, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ టీకాల కోసం ప్రజలు పెద్దఎత్తున తరలివస్తుండగా, కొరత వల్ల అందరికీ డోసులు అందించలేని పరిస్థితిలో అధికారులున్నారు. కృష్ణాజిల్లాలో కొన్నిరోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొవిడ్‌ కట్టడికి టీకాయే అస్త్రంగా ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన ‘టీకా ఉత్సవ్‌’లో భాగంగా ఈ జిల్లాలో రోజుకు 130 గ్రామ, వార్డు సచివాలయాల్లో 50 వేల మందికి కొవిడ్‌ టీకా అం దించాలని అధికారులు ప్రణాళికను రూపొందించారు. 45 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్‌ ఇస్తారని ముందుగానే ఆరోగ్య సిబ్బంది, వలంటీర్ల ద్వారా ప్రజలకు సమాచారం అందించారు.


ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ భయం వెంటాడుతుండటంతో, ప్రజలు  టీకా తీసుకునేందుకు భారీసంఖ్యలో క్యూ కట్టారు. అయితే దఫదఫాలుగా జిల్లాకు వచ్చిన దాదాపు నాలుగు లక్షల వ్యాక్సిన్‌ డోసులను ‘టీకా ఉత్సవ్‌’ ప్రారంభం కావడానికి ముందే దాదాపుగా వినియోగించేశారు. దీంతో టీకా ఉత్సవ్‌ ప్రారంభమైన 11వ తేదీ నాటికి కేవలం 20వేల లోపు మాత్రమే టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. ఈ కారణంగా దాదాపు మూడొంతుల కేంద్రాల్లో తొలిరోజు టీకా ఉత్సవ్‌ ప్రారంభమే కాలేదు. టీకా డోసులు లేని కారణంగా రెండోరోజు జిల్లాలో అసలు ‘టీకా ఉత్సవ్‌’నే నిర్వహించనేలేదు. 13న ఉగాది పేరుతో సెలవు ప్రకటించారు.  మంగళవారం సాయంత్రానికి 60 వేల టీకా డోసులు కృష్ణాజిల్లా కేంద్రానికి చేరుకొన్నాయి. వాటితో చివరి రోజైనా ‘టీకా ఉత్సవ్‌’ను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 130 గ్రామ, వార్డు సచివాలయాలకు వంద, రెండొందలు, మూడొందలు చొప్పున మొత్తం డోసులను సరఫరా చేశారు.


బుధవారం ఉదయమే ఒక్కొక్క సచివాలయం వద్ద ప్రజలు టీకా కోసం భారీసంఖ్యలో బారులుతీరారు. వరుసలో ముందున్నవారికి టీకా ఇవ్వడంతో రెండు గంటల్లోనే అంటే ఉదయం 10 గంటలకే టీకా డోసులు అయిపోయినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. 

Updated Date - 2021-04-15T09:23:43+05:30 IST