నూనె తేలుతున్న ఉప్మా

ABN , First Publish Date - 2020-07-08T10:15:08+05:30 IST

మాయదారి రోగానికి తోడు అధికారుల నిర్లక్ష్యం కరోనా బాధితులను మరింత కలవర పెడుతోంది.

నూనె తేలుతున్న ఉప్మా

తినలేక భయపడుతున్న కరోనా బాధితులు 

ఇడ్లీ పెట్టండని వేడుకోలు

జేఎన్‌టీయూ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో దుస్థితి


అనంతపురం వైద్యం, జూలై 7: మాయదారి రోగానికి తోడు అధికారుల నిర్లక్ష్యం కరోనా బాధితులను మరింత కలవర పెడుతోంది. వైద్యం సంగతి దేవుడెరుగు... కనీసం తిండి కూడా కడుపంటకుండా చేస్తున్నారు. మంగళవారం నగరంలోని జేఎన్‌టీయూ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఇదే దుస్థితి ఎదురైంది. ఇక్కడి కరోనా బాధితులకు మూడు రోజులుగా వరుసగా ఉదయం అల్పాహారంగా ఉప్మా పెడుతున్నా... ఇది నోటికందకుండా పోతోంది. ప్యాకింగ్‌తో వచ్చిన ఉప్మా పాకెట్లు ముట్టుకుంటేనే నూనె కారుతోంది. మోతాదుకు మించి నూనె కలపడంతో తినడానికి ఎగటుపుడుతోంది. ఉప్మా పిండితే నూనె కారుతోందని బాధితులు సమాచారమిస్తున్నారు.


ముందుగానే కొంద రు కరోనా పాజిటివ్‌ బాధితులు దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి నూనె తేలుతున్న ఉప్మా ఇస్తే ఎలా తింటారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి కొవిడ్‌ కేంద్రంలోని కరోనా బాధితులు ఈ ఆయిల్‌ ఉప్మాపై పెదవి విరుస్తున్నారు. ఆయిల్‌ ఉప్మా మాకొద్దు... ఇది తింటే చచ్చిపోవాల్సిందేనని సరఫరాదారులపై తిరుగబడుతున్నారు. ఇడ్లీ పెట్టించాలని వేడుకుంటున్నారు. 


ఆది నుంచీ విమర్శలే...

జిల్లాలోని కొవిడ్‌-19 చికిత్స విభాగాల్లో సౌకర్యాలపై తొలి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా బాధితులకు తిండి సమస్య మరింత వేధిస్తోంది. నిబంధనల మేరకు ఈ చికిత్స విభాగాల్లో బాధితులకు సౌకర్యాలు కల్పించడం  లేదని తెలుస్తోంది. ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం ఉన్నతాధికారులు స్పందిస్తున్నారు. ఆయా సెంటర్లకు వెళ్లి ఆరా తీ స్తుండడంతోనే సరిపెడుతున్నారు. కాగా ఇక్కడి కేంద్రాల్లోని బాధితులు మాత్రం ధైర్యంగా జరుగుతున్న తంతును ఉన్నతాధికారులకు చెప్పలేకపోతున్నారు. కారణం... అలా వ్యతిరేకిస్తే కేంద్రంలో మళ్లీ మమ్ములను ఏం చేస్తారోనని భయపడిపోతున్నారు. దీన్ని ఆసరా చేసుకుని కొవిడ్‌ కేంద్రాల్లో నాణ్యమైన ఆహారానికి తిలోదకాలిస్తున్నారు. అర్ధాకలితో బాధితులకు కడుపు మాడుతోంది. అయితే అన్ని వసతులు కల్పిస్తున్నామని అధికారులు గొప్పలుపోతుండడం గమనార్హం.

Updated Date - 2020-07-08T10:15:08+05:30 IST