ప్రచారానికి దూరం

ABN , First Publish Date - 2022-08-13T10:05:42+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తనను పిలవలేదని, అందుకే ఆ ఉప ఎన్నికకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

ప్రచారానికి దూరం

పిలవకుండా నేనెలా వెళతా?: ఎంపీ  కోమటిరెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తనను పిలవలేదని, అందుకే ఆ ఉప ఎన్నికకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నిర్వహించిన సమావేశాలకు పార్టీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ మీటింగ్‌ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. సమావేశానికి రావాలని ఆహ్వానించకపోతే ఎలా వెళ్లాలి? చండూరులో జరిగిన బహిరంగ సభలో నన్ను అసభ్యంగా తూలనాడారు. హోం గార్డుతో పోల్చారు. దీని వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. పార్టీ నుంచి నన్ను బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. అవమానిస్తే పార్టీ నుంచి నా అంతట నేనే వెళ్లిపోతానని అనుకుంటున్నారు. నన్ను వెళ్లగొట్టి కాంగ్రె్‌సను ఖాళీ చేద్దామనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. జరుగుతున్న విషయాలన్నింటినీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, నాయకుడు రాహుల్‌ గాంధీకి వివరిస్తానన్నారు.


వెంకట్‌రెడ్డిని ఆహ్వానించాం: దామోదర్‌రెడ్డి

చౌటుప్పల్‌ రూరల్‌: మునుగోడు నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే పాదయాత్రకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని కూడా ఆహ్వానించామని మాజీ మంత్రి, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లోని రాజీవ్‌ స్మారక భవన్‌లో రేవంత్‌ రెడ్డి పాదయాత్రపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎంపీ వెంకట్‌ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈనెల 13న సంస్థాన్‌ నారాయణపురం మండలం నుంచి చౌటుప్పల్‌ వరకు 5 వేల మందితో జరిగే అజాదీకాగౌరవ్‌ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్రస్థాయి నేతలందరూ పాల్గొంటారని చెప్పారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని, అనంతరం చౌటుప్పల్‌లో సభ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Updated Date - 2022-08-13T10:05:42+05:30 IST