Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 06 Aug 2022 02:16:32 IST

అసెంబ్లీ రద్దు?

twitter-iconwatsapp-iconfb-icon
అసెంబ్లీ రద్దు?

  • మునుగోడులో మునుగుతామని భయం
  • ముందే ముందస్తుకెళ్లాలని టీఆర్‌ఎస్‌లో చర్చ..
  • ఉప ఎన్నిక కాచుకోవడం కంటే అదే మేలు
  • ఉప ఎన్నికల్లో దెబ్బతింటే బీజేపీకి ఊపు..
  • బలం లేదన్నచోటే కమలం గెలిస్తే విస్ఫోటమే
  • గోడ దూకే నేతలను ఆపలేమని అనుమానం..
  •  ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలంటే కత్తిమీద సామే
  • టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల్లో మొదలైన గుబులు..
  •  ‘ముందస్తు’పై విపక్షంలోనూ మంతనాలు


హైదరాబాద్‌, ఆగస్టు, 5 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికల కంటే ముందే మొత్తం అసెంబ్లీని రద్దు చేసేస్తే? ముందస్తు ఎన్నికలకు వెళ్తే? టీఆర్‌ఎ్‌సలో ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఇదే. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే... బీజేపీ చేతిలో ఓడిపోతే... ఇక రాష్ట్రవ్యాప్తంగా సంచలన పరిణామాలు, భారీగా వలసలకు అది కారణమవుతుంది. దానికి మించి బీజేపీ బలంగా ఉందన్న సంగతి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మనసుల్లో నాటుకుపోతుంది. అందునా.. బీజేపీ బలంగా లేదని భావిస్తున్న నల్లగొండ జిల్లాలోనే ఆ పార్టీ గెలిస్తే ఒక్కసారిగా రాజకీయ వాతావరణమే మారిపోతుంది. ఊహించని పరిణామాలు తెర మీదకు వస్తాయి. పైగా మునుగోడు ఉప ఎన్నిక విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కాకుండా ఏకంగా కేంద్ర పార్టీనే రంగంలోకి దిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా దగ్గరి నుంచి ప్రతి వ్యవహారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కనుసన్నల్లోనే జరిగింది.  ‘రాజీనామా చేయండి, ఉప ఎన్నికల్లో గెలిపిస్తాం’ అన్న భరోసా అక్కడి నుంచే వచ్చింది. అంటే ఈ ఎన్నికలపై హుజూరాబాద్‌ కంటే సీరియ్‌సగా బీజేపీ అధినాయకత్వం దృష్టి పెట్టనుందని స్పష్టమైంది. అలాంటి పరిస్థితుల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే, ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో పరిస్థితి చేజారి పోతుందే మోనన్న ఆందోళన టీఆర్‌ఎ్‌సలో ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో ఫలితాలు ఎలాగైనా ఉండొచ్చు.


 ఆ సంకేతాలు రాష్ట్రం మొత్తం చేరకముందే, మునుగోడు ఉప ఎన్నికలనే సెమీ ఫైనల్‌ను ఆడకుండా నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోతే బాగుంటుందనే ఆలోచన అధికార పార్టీలో కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన టీఆర్‌ఎ్‌సకు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు కొత ్త కాకున్నా... నెల రోజుల క్రితం ఆయన తనకు తానుగా ముందస్తు ఎన్నికల సవాల్‌ను విసిరారు. దానిపై కొంత కలకలం రేగింది. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా సై అంటే సై అన్నాయి. తాము అసెంబ్లీని రద్దు చేసేందుకు సిద్ధమేనని, ఎన్నికల తేదీలను ఇప్పుడే ప్రకటిస్తేనే చేస్తామంటూ టీఆర్‌ఎస్‌ కౌంటర్‌ ఇచ్చింది. దీంతో ఆ అంశాన్ని అప్పటికి అలా ముగించేశారు. అయితే, ఇప్పుడు మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికలు అనివార్యమైన నేపథ్యంలో అదే ముందస్తు ప్రతిపాదనపై ఆ పార్టీలో తాజా చర్చకు తెర లేచిందని సమాచారం. ప్రగతి భవన్‌ లాబీల్లో కూడా కొందరు కీలక నేతల మధ్య ఈ చర్చ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, అఽధినేత కేసీఆర్‌ నోటి నుంచి మాత్రం దీనిపై నేతల వద్ద ఎలాంటి మాట బయటకు రాలేదు. ఈటల రాజేందర్‌ రాజీనామాతో జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నాటికి టీఆర్‌ఎ్‌సలో అత్యంత ధీమా కనిపించేది. ఆ ఎన్నికలను పార్టీ అత్యంత ధీమాతో ఎదుర్కొంది. బీజేపీని, రాజేందర్‌ను ఓడించగలమనే బలమైన విశ్వాసంతోనే ఎన్నికలకు వెళ్లింది.


 ఫలితం ప్రతికూలంగా వచ్చినాపోరాటం మాత్రం గెలుపుపై నమ్మకంతో, ధైర్యంగా చేసింది. పార్టీ పరంగానే కాకుండా...రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా సర్వశక్తులూ ఒడ్డింది. అనేక ఉచిత పథకాలను ప్రకటించింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్న దళితబంధు పథకం ఆ ఉప ఎన్నికల్లోనే పుట్టింది. ప్రతి గ్రామానికి కొత్తరోడ్లు వేశారు. కొత్త రేషన్‌కార్డులు, కొత్త ఫించన్లు...ఒకటేమిటి? ఏదంటే అది ఇచ్చేశారు. అయినా ఉప ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. దాంతో ఇప్పుడు మళ్లీ మునుగోడు ఉప ఎన్నికలకు వెళ్లేందుకు ఆ ధైర్యం, స్థైర్యం అదే ఆత్మవిశ్వాసం ఉన్నాయా? అంటే లేవనే పరిస్థితే నెలకొంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే! అన్న ఆలోచనే ఆ పార్టీని భయంలోకి నెట్టేస్తోంది. గెలుపు మనదే అన్నంత ధీమా కనిపించడం లేదు. అది కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానం అయినా... అధికారంలో ఉన్న పార్టీగా ఉప ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్యత టీఆర్‌ఎ్‌సది. అది కూడా పక్కన పెడితే బీజేపీ తమకు పోటీ కాదని, ఆ పార్టీ తమను ఓడించలేదని వచ్చే సాధారణ ఎన్నికల్లో ఘంటాపథంగా చెప్పాలంటే ఈ ఉప ఎన్నికల్లో విజయం తప్పనిసరి. రాజకీయ బలాబలాల్లో తేడా వస్తే గోడ దూకేసేందుకు సిద్దంగా ఉన్న నేతల్ని నిలువరించాలన్నా కూడా గెలిచి తీరాలి. ఈ తప్పనిసరి పరిస్థితే ఇప్పుడు టీఆర్‌ఎ్‌సలో భయాన్ని నింపుతోందనే వాదన ఉంది. ఇంత సవాల్‌ను ఎదుర్కోవడం బదులు అసెంబ్లీని రద్దుచేసి సాధారణ ఎన్నికలకు వెళ్లిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.


బీజేపీ గెలిస్తే.. ఇక విస్ఫోటమే

వాస్తవానికి ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ అంచనాల ప్రకారమే నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీకి బలం లేదు. మిగతా జిల్లాల్లో ఆ పార్టీకి కొన్నిచోట్ల బాగా బలం, మరి కొన్నిచోట్ల కొంతమేర మాత్రం బలం ఉందనేది అంచనా. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రం కచ్చితంగా బీజేపీకి ఇప్పటికైతే బలం లేదు. మరి అలాంటి బలం లేని నల్గొండ జిల్లాలోనే బీజేపీ గెలిస్తే ఆ ప్రభావం అణు విస్ఫోటంలా అన్ని వైపులకు వ్యాపిస్తుంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పెద్ద ఎత్తున రాజకీయ చేరికలు చోటు చేసుకుంటాయి. బలం లేని ఆ రెండు జిల్లాల్లో బీజేపీ బలోపేతం కావడమే కాకుండా, ఇప్పటికే బలమున్న మిగతా జిల్లాల్లో మరింత బలోపేతమవుతుంది. ఇదే జరిగితే, ఆ తర్వాత సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడం కత్తిమీద సామే. 


ఆ పరిస్థితి రాకుండా, గతం నుంచీ అంటున్న ముందస్తు ఎన్నికల ప్రణాళికను బయటకు తీస్తే, అసెంబ్లీని రద్దు చేసి నేరుగా సాధారణ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆ పార్టీలో నడుస్తోంది. ఇదొక్క ఉప ఎన్నికే కాదు. ఈ ఉప ఎన్నిక అనంతరం కూడా మరికొన్ని ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రె్‌సకు రాజీనామా చేస్తే... ఏకంగా ఎంపీ స్థానానికే ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్రంలో మరో 12 ఉప ఎన్నికలు ఉన్నాయని బహిరంగంగా చెబుతున్నారు. అన్ని ఉప ఎన్నికలు ఉన్నాయా? లేదా అన్నదాన్ని పక్కనపెడితే ఉప ఎన్నికల ద్వారా బీజేపీ విసిరే సవాళ్లను తట్టుకోవడానికి సిద్దంగా ఉండాల్సిందే. వాటిల్లో గెలిస్తే అధికార పార్టీ కదా! గెలిచిందిలే అంటారు. అదే ఓడిపోతే మాత్రం అధికార పార్టీగా ఉండి కూడాఓడిపోయిందంటే ఇక వచ్చే ఎన్నికల్లో కష్టమే అన్న భావనకు ప్రజలు వచ్చేందుకు అవకాశం ఇచ్చినట్లుంటుంది. ఈ నేపథ్యంలో ఉన్నఫళంగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న గతకాలపు ఆలోచనను వర్తమానంలోకి తేవాలన్న వాదన టీఆర్‌ఎస్‌ నేతల్లో వినిపిస్తోంది. 

విపక్షాల్లోను మళ్లీ అదే చర్చ

అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందేమో అన్న చర్చ బీజేపీ, కాంగ్రె్‌సలలోను జరుగుతోంది. కేసీఆర్‌ వచ్చే ఏడాది చివరి వరకు ఆగకుండా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే ఎన్నికలకు వెళ్లేలా అసెంబ్లీని రద్దు చేస్తారనే వాదన వచ్చింది. అప్పుడు కేసీఆర్‌ విసిరిన ముందస్తు సవాల్‌కు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా సై అన్నారు. అమిత్‌షా కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చు, సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ మునుగోడు ఉప ఎన్నికలకు కాకుండా ముందస్తు ఎన్నికలకే కేసీఆర్‌ మొగ్గు చూపొచ్చని, దానికి తామూ సిద్ధమేనని విపక్ష పార్టీలు అంటున్నాయి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.