అధికార పార్టీలో అసంతృప్తి!

ABN , First Publish Date - 2021-11-27T06:27:07+05:30 IST

అధికార పార్టీ నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి.

అధికార పార్టీలో అసంతృప్తి!

  1. రెండుగా చీలుతున్న కర్నూలు మార్కెట్‌ యార్డు
  2. నంద్యాలలో ఒకరికే రెండు పదవులపై ఆగ్రహం
  3. సీనియర్లు, అనుభవజ్ఞులను పక్కనపెట్టిన వైనం 


కర్నూలు-ఆంధ్రజ్యోతి: అధికార పార్టీ నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి. కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల్లో పెత్తనం కోసం నాయకులు పాట్లు పడుతున్నారు. ఒకే వ్యక్తికి రెండేసి పదవులిస్తే తామేం కావాలంటూ నంద్యాల నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆధిపత్య పోరులో కర్నూలు మార్కెట్‌ యార్డు కూడా రెండుగా చీలబోతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా యార్డు చైర్మన్‌ను ఏడాదికే పక్కన పెట్టేశారు. కర్నూలులో ఓ నాయకురాలి వ్యవహారం విమర్శకు తావిస్తోంది. 


ఆ ఒక్కరికే రెండు పదవులు


పార్టీలో కష్టపడిన వారిని గుర్తించడం లేదని నంద్యాల నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవిని ఆశించిన పలు సామాజిక వర్గాల నేతలకు నిరాశే ఎదురైంది. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న వారిలో చాబోలుకు చెందిన సత్తు రాజగోపాల్‌రెడ్డి, పోలూరుకు చెందిన మహేశ్వరరెడ్డి, కొత్తపల్లె గ్రామానికి చెందిన తాతిరెడ్డి తులసిరెడ్డి, మునగాల మాజీ సర్పంచ్‌తోపాటు నంద్యాల పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ బొల్లి మునెయ్యకు అధికార పార్టీ పెద్దలు భరోసా ఇచ్చినట్లు సమాచారం. వీరందరినీ కాదని ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఇసాక్‌బాషాకు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవి ఇవ్వడంతో వారంతా నిరాశకు గురయ్యారు. తాజాగా ఎమ్మెల్సీ పదవుల భర్తీలో తిరిగి ఇసాక్‌ బాషానే స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం భగ్గుమంటోంది. నియోజకవర్గంలో బలమైన పట్టు కలిగిన ముస్లిం, బలిజ, వైశ్య, ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాల నాయకులు తమను గుర్తించడం లేదని వాదిస్తున్నారు. మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎస్‌ఎండీ నౌమాన్‌, కానాలకు చెందిన ప్రముఖ న్యాయవాది ఎం.విజయశేఖరరెడ్డి, మిద్దె శివరామ్‌కు కాకుండా మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవిలో ఉన్న ఇసాక్‌బాషానే ప్రతిపాదించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. 


 ఓ ప్రభుత్వ శాఖలో పని చేసిన ఆమె రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ పాదయాత్రలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తదనంతరం కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్‌తో కలిసి పని చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోచింగ్‌ సెంటర్‌ ప్రారంభించారు. విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేశారనే అభియోగాలు రావడంతో ఆమెను పార్టీ నుంచి దూరం పెట్టారు. దీంతో ఆమె ఓ మాజీ ప్రజాప్రతినిధి శిబిరానికి చేరువయ్యారు. ఇటీవల కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. కట్‌ చేస్తే తనకు పార్టీ, ప్రజాప్రతినిధి అన్యాయం చేశారంటూ ఆత్మహత్య ప్రయత్నానికి దిగారు. దీని వెనుక ఓ మాజీ ఉన్నట్లు బయటకు రావడంతో అధినాయకత్వం సీరియస్‌ అయినట్లుగా తెలుస్తోంది.


పాలక వర్గం కనిపించడం లేదు


కర్నూలు మార్కెట్‌ యార్డుకు పాలక వర్గం ఎన్నుకుని ఏడు నెలలు గడిచాయి. రోకియాబీని చైర్‌ పర్సన్‌గా, మరో 12 మందితో కూడిన పాలక వర్గాన్ని కర్నూలు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. తదనంతరం కర్నూలు మార్కెట్‌ యార్డును రెండుగా చీల్చి పాణ్యం మార్కెట్‌ యార్డుగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు బలపడ్డాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా అధికారులకు అందాయి. తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు చర్చించుకుని తదుపరి యార్డు చైర్మన్‌ను ఓ ప్రజాప్రతినిధికి అనుకూల వర్గానికి కట్టబెట్టేలా ఒప్పందం కుదుర్చుకోవడంతో యార్డు చీలిక పర్వం పెండింగ్‌లో పడింది. అయితే కొద్ది నెలలకే ఆ ఒప్పందం బెడిసి కొట్టింది. ఆర్నెళ్లకోసారి పునరుద్ధరించాల్సిన యార్డు పాలకవర్గంపై నిర్ణయానికి ఓ ప్రజాప్రతినిధి మోకాలడ్డారు. తన నియోజకవర్గానికే చైర్మన్‌ పదవి కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని కోరుతూ పాలకవర్గ సభ్యులు ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌తో పాటు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబును కూడా కలిశారు. అయితే స్థానికంగానే పంచాయితీ తేల్చుకోమని సలహాలు ఇచ్చి పంపినట్లు సమాచారం. 

Updated Date - 2021-11-27T06:27:07+05:30 IST