గాలీ వాన..

ABN , First Publish Date - 2020-04-10T11:16:02+05:30 IST

లాక్‌ డౌన్‌ కష్టాలకు తోడు గురువారం జిల్లా ప్రజలపై అకాల వర్షం ఈదురుగాలులతో విరుచుకుపడింది.

గాలీ వాన..

ఈదురుగాలుల తాకిడికి పలుచోట్ల నేలకూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు 

పలు మండలాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

నేలరాలిన మామిడి.... రైతులకు తీవ్ర నష్టం


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌:  లాక్‌ డౌన్‌ కష్టాలకు తోడు గురువారం జిల్లా ప్రజలపై అకాల వర్షం ఈదురుగాలులతో విరుచుకుపడింది.ఐరాల మండలంలో మోస్తరు వర్షం కురిసింది.తిమ్మాజీపల్లెలో పిడుగుపాటుకు పాడియావు మృతి చెందగా పత్తిపాటివారిపల్లెలో ఈదురుగాలులకు చింతమాను, చిన్న వెంకటంపల్లె ఎస్సీ క కాలనీలో విద్యుత్‌ స్తంభం కూలిపోయాయి. శ్రీకాళహస్తిలో ఈదురు గాలులతో కూడిన వాన పడింది. అరగంట పాటు కురిసిన వానకు వాటర్‌ వర్క్స్‌ కాలనీలో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్‌ ఆంతరాయం ఏర్పడింది. పట్టణంలోని చెన్నై రోడ్లులో గాలుల తాకిడికి పలు చెట్లు నేలకూలాయి.కేవీబీపురంలో కురిసిన వర్షానికి రోడ్లు, వీధులన్నీ జలమయమయ్యాయి. గాలుల తాకిడికి పలు చోట్ల విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి.


దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.పెద్దమండ్యం మండలంలో ఈదురు గాలుల తీవ్రవతకు మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి.పీలేరు మండలంలో మధ్యాహ్నం గంటన్నర పాటు ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. మామిడి పంట దెబ్బ తింది.వడమాలపేటలో గంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడి పంట దెబ్బతిన్నది. కాయలు, పిందెలతో సహా రాలిపోయాయి. సదుం మండలంలో ఈదురుగాలులతో ఓ మోస్తరు వాన కురవగా మామిడి పిందెలన్నీ నేల రాలాయి.వరదయ్యపాళెం మండలంలో వేరుశెనగ పంట కోత పూర్తి చేసి పొలాల్లోనే వాములు వేసి వుండగా వర్షంతో చెట్లన్నీ తడిచిపోయాయి. హఠాత్తుగా కురవడంతో వాములపై పాలిథిన్‌ షీట్లు పరిచే సమయం కూడా లేకపోయింది. పొలాల్లో కూడా నీరు చేరడంతో చెట్లన్నీ కుళ్ళిపోయే పరిస్థితి తలెత్తింది.తిరుపతి మంగళం రోడ్డులోని బొంతాలమ్మ గుడి వద్ద కూరగాయల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన పందిళ్లు గాలీవానకు కూలిపోయాయి.జీడీనెల్లూరు మండలంలో గంట పాటు ఈదురుగాలులు వీచాయి.


వర్షం మాత్రం పడలేదు. అయితే గాలుల ప్రభావానికి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.సోమల, ఎస్‌ఆర్‌ పురం మండలాల్లో గాలుల తీవ్రతకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది.రామకుప్పంలో వర్షపు నీరు ఇళ్ళలోకి ప్రవేశించింది.చౌడేపల్లె, సత్యవేడు, పుత్తూరు, పిచ్చాటూరు, వెదురుకుప్పం, నిండ్ర, గుడిపాల, కార్వేటినగరం, తవణంపల్లె మండలాల్లో ఈదురుగాలులతో మోస్తరు వానలు కురిశాయి.కుప్పం, బైరెడ్డిపల్లె, యాదమరి, పులిచెర్లలో తేలికపాటి వర్షాలు పడ్డాయి.కేవీపల్లె, పుంగనూరు, కలకడ, రామసముద్రం, పలమనేరు మండలాల్లో చిరుజల్లులు కురిశాయి.


పెద్దపంజాణి, తంబళ్లపల్లె మండలాల్లో ఈదురుగాలులు తీవ్రంగా వీచాయి.పూతలపట్టులో బుధవారం రాత్రి ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షానికి విద్యుత్‌ తీగలు తెగి పడ్డాయి. గంటల తరబడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎర్రచెరువుపల్లె సమీపాన గ్లోబల్‌ ఫామ్‌ ఫ్రెష్‌ ఫ్యాక్టరీపై పిడుగుపడి రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది.


Updated Date - 2020-04-10T11:16:02+05:30 IST