జేఏ సై

ABN , First Publish Date - 2021-01-19T07:04:00+05:30 IST

రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్‌ స్థానాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అందులో భాగంగా ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

జేఏ సై
తాళ్లరేవు మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని కోరుతూ సమావేశమైన అఖిలపక్ష జేఏసీ

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై నిరసన గళం విప్పుతున్న ప్రజలు

పార్లమెంటు స్థానాల వారీగా ఏర్పాటుకు వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు

అనేకచోట్ల జేఏసీలుగా ఏర్పడి ఆందోళనలు

పెదపూడి మండలాన్ని రాజమహేంద్రవరం నుంచి తప్పించి

 కాకినాడలో కలపాలని డిమాండ్‌

రామచంద్రపురం, కాజులూరులను కాకినాడలో,   మండపేటను రాజమహేంద్రవరంలో చేర్చాలని వినతులు

తాళ్లరేవును అమలాపురంలో కాకుండా కాకినాడ జిల్లాలో  చేర్చాలంటూ సంయుక్త కార్యాచరణ కమిటీ ఆవిర్భావం


రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాలో ఆందోళనలు క్రమేపీ పెరుగుతున్నాయి. ప్రజలు, ప్రజా సంఘాల నుంచి అభ్యంతరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తమను కాకినాడ జిల్లాలో కలపాలని కొందరు, అమలాపురం జిల్లా కాకుండా   రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని మరికొన్ని సంఘాలు ఆందోళనబాట పడుతున్నాయి. మరికొన్నిచోట్ల ఏకంగా అన్ని రాజకీయ             పార్టీలు కలిసి జేఏసీలుగా కూడా ఏర్పడుతున్నాయి. పార్లమెంట్‌   స్థానాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే తాము నష్టపోతామంటూ జిల్లాలో అనేక మండలాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమలాపురం  పార్లమెంట్‌ స్థానం విషయంలో కోనసీమేతర నియోజకవర్గాలు, మండలాల్లో ఎక్కువగా ఆందోళనలు పెరుగుతున్నాయి.

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్‌ స్థానాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అందులో భాగంగా ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. జిల్లాల్లో ఏ రెవెన్యూ డివిజన్‌లో ఏ శాఖకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? భూములు ఎన్ని? నియోజకవర్గాల వారీగా జనాభా, ఆస్తులు వంటి వివరాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. జిల్లా అధికారులు గడిచిన కొన్ని నెలలుగా కసరత్తు కూడా మొదలుపెట్టారు. శాఖల వారీగా ఆయా నియోజకవర్గాలు, పార్లమెంట్‌ స్థానాల్లో ఎన్ని భవనాలున్నాయి? ఆస్తులు? భూములు? ఫర్నీచర్‌?           తదితర వివరాలు సేకరిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో సమాచారం పంపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుకుసంబంధించి అనేక మండలాల నుంచి అభ్యంతరాలు క్రమేపీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమలాపురం పార్లమెంట్‌ స్థానంలో కోనసీమేతర నియోజకవర్గాలు, మండలాల నుంచి ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. వాస్తవానికి అమలాపురం పార్లమెంట్‌ స్థానం పరిధిలో కోనసీమేతర నియోజకవర్గాలు రామచంద్రపురం, మండపేట ఉన్నాయి. రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని కాజులూరు, రామచంద్రపురం, కె.గంగవరం మండలాల ప్రజా సంఘాలు తాము అమలాపురం జిల్లాలో కలవబోమని, కాకినాడ జిల్లాలో కలపాలంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అధికారులను కలిసి వినతిపత్రాలు అందించాయి. అమలాపురం జిల్లాకు వెళ్లాలంటే తాము గోదావరి             దాటాలని, ఇందుకు రవాణా సదుపాయం కూడా లేదని, పైగా తమకు కాకినాడ  దగ్గరగా ఉంటుందని వాదిస్తున్నారు. కాజులూరు మండలం నుంచి కూడా ఇవే అభ్యంతరాలు వస్తున్నాయి. కాకినాడ తమకు 22 కిలోమీటర్లు వస్తుందని, అదే అమలాపురం యాభై కిలోమీటర్లు దూరం అవుతుందని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమలాపురం జిల్లాలో తమను కలపవద్దని అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడిగా పోరాడేందుకు వీలుగా జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మండపేట నియోజకవర్గం అమలాపురం పార్లమెంట్‌ స్థానంలోకి వస్తుంది. ఈ నియోజకవర్గంలో మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను అమలాపురం జిల్లాలో కలప    వద్దని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల నిరసన తెలుపుతున్నారు. తమ నియోజకవర్గంలో మండలాలన్నింటికీ రాజమహేంద్రవరం చాలా దగ్గరని, ప్రజలకు కూడా ఇదే సౌలభ్యం అని విలేకరుల సమావేశం కూడా ఏర్పాటుచేసి నిరసన వ్యక్తం చేశారు.      తాళ్లరేవు మండలం ముమ్మిడివరం నియోజకవర్గంలోకి వస్తుంది. ఇది అమలాపురం పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఉన్నందున కోనసీమ జిల్లాలో కలిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది తమకు సమ్మతం కాదని, తాళ్లరేవు మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక్కడైతే   అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి కాకినాడలో కలపాలని ఉద్యమం కూడా మొదలుపెట్టాయి. 

అనపర్తి నియోజకవర్గ పరిధిలోని పెదపూడి కాకినాడకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అనపర్తి రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఉన్నందున ఆ జిల్లాలో కలుపుతారనే అంచనాలున్నాయి. కానీ అక్కడి పార్టీల నేతలు, ప్రజలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పెదపూడిని వేరుచేసి కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజా సంఘాలు, టీడీపీ నేతలు ఇప్పటికే అధికారులకు వినతిపత్రాలు అందించారు. 

ఏజెన్సీ మండలాలు సైతం తమను అరకు జిల్లాలో కలపవద్దని, ప్రత్యేక ఆదివాసీ జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీని కొత్త జిల్లాగా ప్రకటించి అందులో తూర్పు గోదావరి ఏజెన్సీని కలిపితే అంత దూరం వెళ్లడం తమకు ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ఎక్కడికక్కడ మండలాల నుంచి తేనెతుట్టలు కదులుతున్నాయి.



Updated Date - 2021-01-19T07:04:00+05:30 IST