డైట్‌ బిల్లుల చెల్లింపుల్లో వివాదం

ABN , First Publish Date - 2022-07-28T05:30:00+05:30 IST

సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలకు సంబంధించి రూ.కోటీ 30 లక్షల డైట్‌ బిల్లులు చెల్లింపుల్లో ఇద్దరు ఏటీడబ్ల్యూవోల మధ్య వివాదం మొదలైంది. ఈ పంచాయితీ ఐటీడీఏ పీవో దృష్టికి వెళ్లింది.

డైట్‌ బిల్లుల చెల్లింపుల్లో వివాదం
సీతంపేట కేంద్రంగా నిర్వహిస్తున్న సహాయ గిరిజన సంక్షేమశాఖ కార్యాలయం

గిరిజన సహాయ సంక్షేమాధికారికి షోకాజ్‌ నోటీస్‌

 సీతంపేట: సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలకు సంబంధించి రూ.కోటీ 30 లక్షల డైట్‌ బిల్లులు చెల్లింపుల్లో ఇద్దరు ఏటీడబ్ల్యూవోల మధ్య వివాదం మొదలైంది. ఈ పంచాయితీ ఐటీడీఏ పీవో దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ జరిపి పూర్తి నివేదిక అందించాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బి.నగేష్‌ను పీవో ఆదేశించారు. వాస్తవానికి గతనెల 30న సీతంపేట ఏటీడబ్ల్ల్యూవో వెంకటరమణ  అనంతగిరికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరులో ఏటీడబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న జి.మంగవేణి  సీతంపేటకు బదిలీపై వచ్చారు.   కాగా ఈనెల 2న వెంకటరమణ రిలీవ్‌ అయ్యారు. అయితే ఐదు నెలల డైట్‌ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ప్రభుత్వం సుమారు రూ.కోటీ 40 లక్షలను ఏటీడబ్ల్యూవో ఖాతాలో జమ చేసింది. ఆ నిధులను  26 గిరిజన సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి కూరగాయలు, నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్న వెండర్‌ ఖాతాలో  జమ చేయాల్సి ఉంది.  అయితే కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏటీడబ్ల్ల్యూవో మంగవేణి ట్రెజరీ కోడ్‌ ద్వారా వెండరుదారులకు నిధులు జమ చేయాల్సి ఉంది. కాగా ఆమెకు సీఎఫ్‌ఎంఎస్‌ కోడ్‌ రాలేదు. దీంతో ఈ నిధులు వృథా పోకుండా ఉండాలనే ఉద్దేశంతో పూర్వ ఏటీడబ్ల్యూవో వెంకటరమణ లాగిన్‌ నుంచి ఈ నెల 16న రూ.కోటీ 30 లక్షలు వెండర్‌దారుల ఖాతాలో జమ చేశారు. ఇటీవల  గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విజిలెన్స్‌ తనిఖీలు జరుగుతున్న తరుణంలో ప్రస్తుత ఏటీడబ్ల్యూవో మంగవేణి ఈ అంశంపై ఐటీడీఏ పీవో నవ్యకు ఫిర్యాదు చేశారు. రిలీవ్‌ అయిన వ్యక్తి ఈ నిధులు ఎలా జమచేస్తారని, దీనిపై విచారణ జరపించాలని ఆమె కోరారు.  ఈ విషయమై పూర్వ ఏటీడబ్ల్యూవో వెంకటరమణను వివరణ కోరగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మంగవేణి అనుమతి తీసుకొని నిధులు వెండర్‌దారులకు వారి ఖాతాలో జమ చేశామని చెప్పారు. ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా గిరిజన సంక్షేమశాఖ డీడీ నగేష్‌ మాట్లాడుతూ.. ఏటీడబ్ల్యూవో మంగవేణి ఫిర్యాదు  ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు విచారణకు హాజరు కావాలని  పూర్వ ఏటీడబ్ల్యూవో వెంకటరమణకు షోకాజ్‌ నోటీసు ఇచ్చామన్నారు. 


Updated Date - 2022-07-28T05:30:00+05:30 IST