Jain sects dispute : జైనమతంలో ఎందుకీ వివాదం..? సుప్రీంకోర్టుకు చేరిన వ్యవహారం..

ABN , First Publish Date - 2022-07-30T00:04:39+05:30 IST

ప్రాచీన భారతీయ మతాలలో జైన మతం (Jainism) ఒకటి. అహింసాయుత జీవన మార్గాలు బోధించడమే పరమావధిగా ఉద్భవించిన ఈ మతం ఎంతోమందికి ముక్తిమార్గాలు చూపింది.

Jain sects dispute : జైనమతంలో ఎందుకీ వివాదం..? సుప్రీంకోర్టుకు చేరిన వ్యవహారం..

న్యూఢిల్లీ : ప్రాచీన భారతీయ మతాలలో జైనమతం (Jainism) ఒకటి. అహింసాయుత జీవన మార్గాలు బోధించడమే పరమావధిగా ఉద్భవించిన ఈ మతం ఎంతోమందికి ముక్తిమార్గాలు చూపింది. దేశంలో ఎన్నో జైనాలయాలు(Jain Temples) ఇందుకు వేదికలుగా నిలిచాయి. ప్రశాంతతకు మారుపేరుగా పిలవబడుతున్న ఈ ఆలయాలే ప్రస్తుతం జైనమతంలో వివాదాలకు కారణమయ్యాయి. ఆలయాలపై పెత్తనం కోసం  ఉపవర్గాలు కుస్తీ పడుతున్నాయి. ప్రాథమిక హక్కుల(Fundamental Rights) ఉల్లంఘన జరుగుతోందంటూ ఒక వర్గం ఇటివలే సుప్రీంకోర్టు(Supreme Court) గడప తొక్కింది. జైన మతంలో అంతర్గత వివాదానికి సంబంధించిన ఆ వివరాలు ఏంటి, సుప్రీంకోర్ట్ ఏం చెప్పిందో ఒక లుక్కేద్దాం..


ప్రార్థనా స్థలాల చట్టాన్ని అమలు చేయండి..

జైన్ మతాన్ని ఆచరించే రెండు ఉప వర్గాలు జైనాలయాలపై పెత్తనం కోసం పాకులాడుతున్నాయి. శ్వేతాంబరులకు చెందిన ‘జైన్ తపగచ్ఛా’ అనే ఒక ఉపవర్గం తమ ప్రాథమిక హక్కులు హాననమవుతున్నాయని సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. తమ వర్గానికి చెందిన ఆలయాల్లోకి ప్రవేశించకుండా ఇతర వర్గాలువారు అడ్డుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లోని జైన్ ఆలయాల్లోకి తమ సన్యాసులను అనుమతించడం లేదని ఆరోపిస్తూ సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించింది. ప్రార్థనా స్థలాల చట్టం(ప్లేసెస్ ఆఫ్ వొర్షిప్ యాక్ట్)ను వర్తింపజేసి ఉపశమనం కల్పించాలని పిటిషన్‌లో కోరింది. తమ వర్గానికి చెందిన ఆలయాలను ఇతర జైన వర్గాలు బలవంతంగా మార్చివేస్తున్నాయని, సంప్రదింపులు జరపుకుండా ఈ చర్యలకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ వ్యవహారంపై పిటిషనర్ల తరపును సీనియర్ అడ్వకేట్ అర్వింద్ దటార్ వాదనలు వినిపించారు. ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం.. దేవాలయం ఒక జైన సమూహానికి చెందినదైనా ఇతర వర్గాల వారి ప్రవేశంపై నిషేధం విధించడానికి వీల్లేదన్నారు. మరోవైపు దేవాలయాల రూపురేఖల్ని మార్చుకుండా రాష్ట్ర ప్రభుత్వాలే భద్రత కల్పించాలని ఆయన కోరారు. 


సుప్రీంకోర్ట్ చెప్పిందిదే...

పిటిషనర్ వాదనలు విన్న జడ్జిలు డీవై చంద్రచూడ్, జేబీ పార్ధివాలాల బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం ఒకే మతానికి చెందిన రెండు వర్గాలకు సంబంధించినదని పేర్కొంది. ఆలయంపై పెత్తనం ఎవరిదనేది ట్రయల్ కోర్టులో నిర్ణయించబడుతుందని, ఈ మేరకు వ్యాజ్యం దాఖలు చేయాలని సూచించింది. పిటిషనర్లు పేర్కొన్న హక్కులపై సాక్ష్యాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని వర్తింపజేయాలని కోరుతున్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 32కు సంబంధించి కాదని గ్రహించాలని స్పష్టం చేసింది. సాక్ష్యాధారాలు పరిశీలించాల్సిన ఈ కేసులో నేరుగా సుప్రీంకోర్టునే ఎందుకు ఆశ్రయిస్తున్నారని బెంచ్ ప్రశ్నించింది. ‘ ప్రతి క్రిమినల్ కేసు సివిల్ వ్యాజ్యంగా మారుతుంది. ప్రతి సివిల్ వ్యాజ్యం కోరుకుంటే రిట్ పిటిషన్ అవుతుంది. ఈ వివాదం వ్యాజ్యంలో పరిష్కారం అవుతుంది. ఆచార సాంప్రదాయ హక్కులు, వినియోగానికి సంబంధించిన ఆధాలు అందాల్సి ఉంది. ఇది రిట్ పిటిషన్‌కు సంబంధించిన అంశం కాదు’ అని బెంచ్ పేర్కొంది. 


3 రాష్ట్రాల్లో 20 ఆలయాలకు సంబంధించిన అంశం...

అడ్వకేట్ అర్వింద్ దటార్ వాదనలు వినిపిస్తూ ఈ వివాదం ఒక ఆలయానికి సంబంధించినది కాదన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలోని 20 ఆలయాలకు సంబంధించినదిగా ఆయన పేర్కొన్నారు. ‘ సింగిల్ ఆర్డర్ కోసం ప్రయత్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే పలుమార్లు లేఖలు రాశాం’ అని లాయర్ చెప్పారు. ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్రలోని ఘట్కోపర్‌లోని ఒక ఆలయం విషయంలో వివాదం చెలరేగింది. మాతా ఆలయంలోకి ప్రవేశం విషయంలో రెండు వర్గాల సన్యాసుల మధ్య ఘర్షణకు చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే తరహా ఘటనలు వెలుగుచూశాయి.

Updated Date - 2022-07-30T00:04:39+05:30 IST