ల్యాబో దిబో

ABN , First Publish Date - 2022-08-11T05:49:28+05:30 IST

జిల్లాలో వైఎ్‌సఆర్‌ అగ్రి ల్యాబ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విత్తనా లు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలు నిర్వహించేందుకు నియోజకవర్గ స్థాయిల్లో అగ్రి ల్యాబ్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది

ల్యాబో దిబో
రాయదుర్గంలోని అగ్రి ల్యాబ్‌

అస్తవ్యస్తంగా అగ్రి ల్యాబ్‌ల నిర్వహణ ! 

నియోజకవర్గానికి ఒక ల్యాబ్‌ ఏర్పాటుకు నిర్ణయం 

నాలుగు నియోజకవర్గాల్లో ఆరంభం

కళ్యాణదుర్గం, గుత్తిలో ప్రారంభానికి నోచుకోని దుస్థితి 

కొన్ని చోట్ల అరకొరగానే నాణ్యత పరీక్షలు 

రైతులకు అందని విత్తనాలు, ఎరువుల 

నాణ్యత ఉచిత పరీక్షలు

క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించడంలో 

వ్యవసాయ యంత్రాంగం నిర్లక్ష్యం  


అనంతపురం అర్బన : జిల్లాలో వైఎ్‌సఆర్‌ అగ్రి ల్యాబ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.  విత్తనా లు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలు నిర్వహించేందుకు నియోజకవర్గ స్థాయిల్లో అగ్రి ల్యాబ్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆశించిన మేరకు అగ్రి ల్యాబ్స్‌ నిర్వహణ సవ్యంగా ముందుకు సాగడం లేదన్న విమర్శలున్నాయి. నియోజకవర్గ స్థాయిల్లో అగ్రి ల్యాబ్‌లు ఏర్పాటు ప్రాముఖ్యత, అక్కడ రైతులకు లభించే సదుపాయాలపై క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో ఆశాఖ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. రైతులకు ఉచితంగానే విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ విషయాలపై రైతులకు అవగాహన కల్పించకపోవడం గమనార్హం. ఇప్పటి దాకా రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువుల పరీక్షలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. 


ఉరవకొండలో విత్తనాల నాణ్యత పరీక్షలకే పరిమితం

గతేడాది జూలై 8న సీఎం జగనమోహనరెడ్డి రాయ దుర్గంలో వైఎ్‌సఆర్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించా రు. జిల్లాలోని రాయదుర్గం, ఉరవకొండ, నార్పల, తాడిపత్రి ప్రాంతాల్లో వైఎ్‌సఆర్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు (విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షా కేంద్రం) ఏర్పాటు చేశారు. ఉరవకొండలో ఏడాది క్రితమే ల్యాబ్‌ను మొదలుపెట్టారు. అక్కడి ల్యాబ్‌లో విత్తనాల మొలక శాతాన్ని మాత్రమే పరీక్షిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులను పరీక్షించడం లేదు. ల్యాబ్‌కు సంబంధించి కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో  రెండు మాసాల కిందట విద్యుత శాఖ సిబ్బంది కరెంట్‌ కట్‌ చేశారు. అప్పటి నుంచి అక్కడి అధికారులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. 


రెండు ప్రాంతాల్లో ఆరంభానికి నోచుకోని వైనం 

కళ్యాణదుర్గం, గుత్తి  ప్రాంతాల్లో అగ్రి ల్యాబ్‌లు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. కళ్యాణదుర్గంలో ఏడాది క్రితమే భవన నిర్మాణం పూర్తయింది. ల్యాబ్‌కు సంబంధించి పరికరాలు తెప్పించడంలో జాప్యం చేయడంతో ఇప్పటి దాకా ప్రారంభానికి  నోచుకోలేదన్న విమర్శలున్నాయి. ఎట్టకేలకు గత నెలలో పరికరాలు అమర్చి, వ్యవసాయ శాఖ అధికారులకు  ల్యాబ్‌ను అప్పగించారు. అయితే ఎప్పటిలోగా ప్రారంభించి నిర్వహణలోకి తీసుకువస్తారో అర్థం కావడం లేదు. గుత్తిలో అగ్రి ల్యాబ్‌ నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది. భవనం చూసేందుకు పనంతా పూర్తయినట్లు కనిపించినా భవనం లోపలి భాగంలో ల్యాబ్‌కు సరిపడేలా నిర్మాణాలు, ప్రహరీ  పెండింగ్‌లో ఉండిపోయాయి. ఎప్పటిలోగా నిర్మాణ  పనులు పూర్తి చేస్తారో తెలియని అయోమయం నెలకొంది. 


అరకొరగానే పరీక్షలు 

జిల్లాలోఇప్పటి దాకా నాలుగు నియోజకవర్గాల్లో అగ్రి ల్యాబ్‌లు మొదలు పెట్టారు. తిరుపతి రీజనల్‌ కోడింగ్‌ సెంటర్‌ పరిధిలో నియోజకవర్గ స్థాయిలోని అగ్రి ల్యాబ్‌లు పని చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల శాంపిళ్లు తీసిన వ్యవసాయ అధికారులు ముందుగా తిరుపతి కోడింగ్‌ సెంటర్‌కు పంపాల్సి ఉం టుంది. అక్కడి నుంచి రాష్ట్రంలోని ఇతర ల్యాబ్‌లతోపాటు జిల్లాలోని నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్‌లకు  విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల శాంపిళ్లను కోడింగ్‌ పద్ధతిలో నాణ్యత పరీక్షల నిమిత్తం  పంపుతున్నారు. రాయదుర్గం ల్యాబ్‌లో కోడింగ్‌ పద్ధతిలో ఇప్పటి దాకా 72 విత్తనాలు, 36 ఎరువుల నాణ్యత పరీక్షలు చేశారు. తాడిపత్రిలో 55 విత్తనాలు, 32ఎరువులు పరీక్షలు చేశారు. నార్పల 83 విత్తనాలు, 38 ఎరువుల పరీక్షలు చేశారు. ఉరవకొండలో  56 విత్తనాల పరీక్షలు చేయడంతో సరిపెట్టారు. 


ఉచిత పరీక్షలేవీ..?  

అగ్రి ల్యాబ్‌ల్లో కోడింగ్‌ కేంద్రాల నుంచి పంపిన విత్తనాలు, ఎరువుల పరీక్షలు నిర్వహించడంతోపాటు స్థానిక రైతులకు ఉచితంగా  విత్తనాల  నాణ్యత, మొలక శాతం, ఎరువుల నాణ్యత పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ అధికారులు, ల్యాబ్‌లో విధులు నిర్వర్తించే అధికారులు వారి పరిధిలోని ఆర్బీకే సిబ్బంది ద్వారా ల్యాబ్‌లో ఉచితంగా విత్తనాలు, ఎరువులు నాణ్యత పరీక్షలు చేస్తారన్న సమాచారం అందించి, రైతులకు పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఆ దిశగా రైతులకు  అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. తాడిపత్రి ల్యాబ్‌లో ఇప్పటి దాకా ఆరుగురు రైతులకు ఎరువుల నాణ్యత పరీక్షలు చేయడంతో సరిపెట్టారు. మిగతా ల్యాబ్‌లలో ఎక్కడా ఉచిత పరీక్షలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల విత్తనాలు, ఎరువుల ఉచిత నాణ్యత పరీక్షలకు రైతులు దూరమవుతున్నారు. దీనిప్రభావం పంటల దిగుబడులపైనా పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


ల్యాబ్‌ విషయమే తెలీదు..

 నార్పల కేంద్రంలో అగ్రి ల్యాబ్‌ ఏర్పాటు చేశారన్న విషయమే నాకు తెలియదు. ల్యాబ్‌ను ఏర్పాటు  చేశారని, అందులో విత్తనాలు, ఎరువుల పరీక్షలు రైతులకు ఉచి తంగా చేస్తారని అధికారులెవరూ చెప్పలేదు. గ్రామాల్లో ప్రచారం కూడా చేయలేదు. రైతులకు చెప్పి ఉంటే అనేక మంది విత్తనాలు, ఎరువుల పరీక్షలు చేయించుకునేవారు. 

-  రైతు తలారి చంద్ర, నార్పల


ఉచిత పరీక్షలని ఎవరూ చెప్పలేదు..

నాకు 15 ఎకరాల పొలం ఉంది. వేరుశనగ, కంది పంటలు సాగు చేస్తున్నా. నియోజకవర్గ స్థాయిలో అగ్రి ల్యాబ్‌లు పెడుతున్నారని మీడియా ద్వారా తెలుసుకున్నా. ల్యాబ్‌లో రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు చేస్తారన్న విషయం ఎవరూ చెప్పలేదు. అంత ముఖ్యమైన విషయాన్ని రైతులకు  తెలియజేయకపోవడం సరికాదు. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఉచిత సేవలు పొందలేకపోయారు. ఇప్పటికైనా రైతులందరికీ ఆ విషయాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకోవాలి. 

రైతు సురేంద్రయాదవ్‌, చిన్నమట్లగొంది, శింగనమల మండలం 

Updated Date - 2022-08-11T05:49:28+05:30 IST