‘మురికి’పాలిటీలు!

ABN , First Publish Date - 2022-07-18T04:20:35+05:30 IST

‘మురికి’పాలిటీలు!

‘మురికి’పాలిటీలు!
శ్రీకాకుళంలో నిత్యం రద్దీగాఉండే డేఅండ్‌నైట్‌ జంక్షన్‌ వద్ద కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

మునిసిపాలిటీల్లో పారిశుధ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లోని ఏ వార్డు చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. కాలువల్లో చెత్త నిల్వలు, మురుగునీరు పేరుకుపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఆపై వ్యాధులు విజృంభిస్తున్నాయి. శ్రీకాకుళంలో నీటిశుద్ధి కోసం రూపొందించిన సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ) పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో  మురుగునీరు నేరుగా నాగావళి నదిలో కలుస్తుండడంతో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు.  


- శ్రీకాకుళంలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

- పైకితేలుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు

- నిలిచిన ఎస్‌టీపీ పనులు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

శ్రీకాకుళం మునిసిపాలిటీ నగరపాలక సంస్థగా అవతరించి ఆరేళ్లు అవుతోంది. అప్పట్లో ఏ సమస్యలున్నాయో ఇప్పుడూ అవే సమస్యలు వెంటాడుతున్నాయి.  కార్పొరేషన్‌గా కేవలం బోర్డు మాత్రమే మారిందని, సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని నగర ప్రజలు వాపోతున్నారు. లక్షలాది మంది జనాభా ఉన్న శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌, మిర్తిబట్టి, పాలకొండ రోడ్డు, ప్రధాన మెయిన్‌ రోడ్డు, డేఅండ్‌నైట్‌ జంక్షన్‌, అరసవల్లి రోడ్డు, ఎనభై అడుగుల రోడ్డు, రామలక్ష్మణ జంక్షన్‌, ఇలా 14 ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మురుగు కాలువల్లో ఏళ్లుగా పూడిక తొలగించడం లేదు. దీంతో చిన్న వర్షం పడినా మురుగు రోడ్డుపైనే ప్రవహిస్తుంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో ఎప్పుడూ వర్షపునీరు నిలిచిపోతుంటుంది. కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు మురికినీరు ప్రవాహానికి ప్రతిబంధకాలుగా మారాయి. నగరంలోని అన్ని ప్రాంతాల కాలువల నుంచి నాగావళి నదిలోకి  మురుగు కలుస్తోంది. దీంతో నదీ కాలుష్యం తగ్గించేందుకు రూ.36 కోట్లతో మూడేళ్ల కిందట సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ) పనులు ప్రారంభించారు. కాలువల నుంచి వచ్చే మురికి నీటిని ఎస్‌టీపీలోకి చేర్చి అక్కడ ఆ నీటిని శుద్ధి చేసి అనంతరం నాగావళి నదిలోకి వదిలేందుకు ప్రణాళిక రచించారు. అమృత్‌ నిధులతో చేపట్టిన ఈ పనులు ఏడాది నుంచి నిలుపుదల చేశారు. దీంతో మురుగు నేరుగా నదిలో కలుస్తోంది. ఇప్పటికైనా ఎస్‌టీపీ పనులు పూర్తిచేయాలని, ప్రధాన జంక్షన్ల వద్ద ఉన్న కాలువల్లో పూడిక తొలగించాలని  నగరప్రజలు కోరుతున్నారు. 

 

అధ్వాన్నంగా పారిశుధ్యం

పలాస: జిల్లాకేంద్రం తర్వాత అతిపెద్ద మునిసిపాలిటీగా పేరుగాంచిన పలాస-కాశీబుగ్గలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ప్రధాన కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడంతో మురుగునీరు, చెత్త పేరుకుపోతోంది. ఒక్కో వార్డులో మూడు రోజులకోసారి కూడా చెత్త సేకరించే దాఖలాలు లేవు. ఇటీవల మునిసిపల్‌ కార్మికుల సమ్మెతో పారిశుధ్యం మరింత అధ్వానంగా మారింది. నెహ్రూనగర్‌, శ్రీనివాసనగర్‌, ప్రకాశరావునగర్‌, ఉల్లాసపేట, న్యూకాలనీ, ఇందిరమ్మజంక్షన్‌, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, ఎల్లమ్మతల్లి వీధి, హడ్కోకాలనీ, హరిజనవీధి, పురుషోత్తపురం ఎర్రచెరువు రోడ్డు, శివాజినగర్‌, సూదికొండకాలనీ, ఉల్లాసపేట, కంబిరిగాంరోడ్డు, గౌతమ్‌స్ట్రీట్‌ ప్రాంతాల్లో చెత్త నిల్వలు దర్శనమిస్తున్నాయి. పలాస మునిసిపాలిటిలో వందమందికి పైగా పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో సూపర్‌వైజర్లు ఎక్కువ. వారంతా సొంత పనులు తప్ప.. పారిశుధ్య పనులపై పర్యవేక్షణ చేయడం లేదని అధికారులే గుర్తించారు. వీరితో పాటు సచివాలయాల్లోని శానిటేషన్‌ సూపర్‌వైజర్లుకు విధివిధానాలు లేకపోవడంతో పర్యవేక్షణ లోపిస్తోంది. వార్డుల్లో ఇంటింటా చెత్త సేకరణ  అరకొరగానే సాగుతోంది. కేవలం వార్డు కౌన్సిలర్లుకు చెప్పి పనులు చేయించుకోవాల్సి వస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల టీడీపీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు స్పందించి ప్రధాన కాలువలు శుభ్రం చేయడంతో పాటు ఇంటింటా చెత్త సేకరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 


మురుగుతో దుర్వాసన 

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. డబ్బూరీ, కస్పా, గౌడ తదితర వీధుల్లో మురుగుకాలువలు కనీస మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరాయి. దీనికితోడు రోజుల తరబడి పురుషోత్తపురం తదితర ప్రాంతాల్లో చెత్త తొలగించకపోవడంతో వ్యాధులు ప్రబలే అవకాశముందన్న ఆందోళన నెలకొంది. బాసుదేవ క్వార్టర్స్‌, కస్పావీధి, గౌడవీధి, పురుషోత్తపురం కాలనీ, పురుషోత్తపురం పెద్దవీధి, చిన్నవీధి, డబ్బూరివీధి, కార్జీవీధి, బెల్లుపడ కాలనీల్లో కాలువలు అధ్వానంగా ఉన్నాయి. కాలువలో ఉన్న మురుగు తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. 

  

కాలువలు బాగుపడేదెప్పుడు?

ఆమదాలవలస: ఆమదాలవలస పురపాలక సంఘం ఏర్పడి మూడు దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ మురుగునీటి కాలువలు ఆధునికీకరణకు నోచుకోలేదు. పంచాయతీ పాలకుల హయాంలో నిర్మించిన కాలువలే కావడంతో చిన్నపాటి వర్షం కురిస్తే రోడ్లుపైకి మురుగునీరు చేరుతోంది. పట్టణంలోని పూజారిపేట కొత్తకోటవీధి,  ఎమ్మార్వోఆఫీసు రోడ్డు, ఐజేనాయుడు కాలనీ, చంద్రయ్యపేట, లక్ష్మీనగర్‌, మెట్టక్కివలస, చింతాడ, పాతఆమదాలవలస, కండ్రపేట ప్రాంతాల్లో డ్రైనేజీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మురుగునీటి వ్యవస్థ సరిగ్గా లేదు. నందగిరిపేట, పూజారిపేట కూడలి వద్ద మురుగునీరు రోడ్డుపైకి వస్తోంది.  మునిసిపాలిటీలో  23 వార్డులు ఉండగా, దాదాపుగా 45 కిలోమీటర్ల పొడవున మాత్రమే కాలువ వ్యవస్థ ఉంది. ఇంకా 40 శాతం డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. మునిసిపాలిటీలో 83 మంది పారిశుధ్య కార్మికులకుగానూ 60 మంది పనిచేస్తున్నారు. మిగతా వారంతా డ్రైవర్లుగా.. ఇతర సెక్షన్లలో, నాయకుల ఇళ్లల్లో పనిచేస్తున్నట్టు సమాచారం. 

  

డీ సిల్టింగ్‌కు టెండర్లు పిలిచాం 

శ్రీకాకుళం నగరంలోని 14 ప్రధాన జంక్షన్ల వద్ద కాలువల్లో డీ సిల్టింగ్‌ చేయకపోవడంతో మట్టి పేరుకుపోయింది. ఇటీవల సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వ్యయంతో కాలువల డీ సిల్టింగ్‌కు టెండర్లను పిలిచాం. టెండర్లు అంగీకారం కుదరగానే పనులు ప్రారంభిస్తాం. ఎస్‌టీపీ పనులను పబ్లిక్‌హెల్త్‌ విభాగంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. 

- ఓబులేసు, కమిషనర్‌, శ్రీకాకుళం నగరపాలక సంస్థ

Updated Date - 2022-07-18T04:20:35+05:30 IST