Disney కి 20 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు గుడ్‌బై చెప్పే ఛాన్స్ !.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-06-15T22:10:11+05:30 IST

ఐపీఎల్(IPL) స్ట్రీమింగ్ మీడియా హక్కులు కోల్పోయిన డిస్నీ ప్లస్(Disney+) పెద్ద మొత్తంలో సబ్‌స్క్రైబర్ల(Subscribers)ను కోల్పోనుందా?

Disney కి 20 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు గుడ్‌బై చెప్పే ఛాన్స్ !.. కారణం ఇదే..

ముంబై : ఐపీఎల్(IPL) స్ట్రీమింగ్ మీడియా హక్కులు కోల్పోయిన డిస్నీ ప్లస్(Disney+) పెద్ద మొత్తంలో సబ్‌స్క్రైబర్ల(Subscribers)ను కోల్పోనుందా? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకోలేకపోయిన డిస్నీ ప్లస్ మున్ముందు దాదాపు 20 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లను నష్టపోయే అవకాశముందని రీసెర్చ్ సంస్థ ‘మీడియా పార్టనర్స్ ఏసియా’ అంచనా వేసింది. ఈ పరిణామంతో 2024 నాటికల్లా గ్లోబల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 260 మిలియన్లకు చేరాలనే లక్ష్యానికి ఆటంకాలు ఎదురవ్వడం ఖాయమని విశ్లేషించింది. ఐపీఎల్ స్ట్రీమింగ్‌తో డిస్నీ ప్లస్ పెద్ద మొత్తంలో సబ్‌స్ర్కైబర్లను పెంచుకోగలిగిందని మీడియా పార్టనర్స్ ఏసియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ కౌటో పేర్కొన్నారు. స్పోర్ట్స్ పరంగానే కాకుండా మరిన్ని వినోద కార్యక్రమాల ద్వారా సబ్‌స్ర్కైబర్లకు దగ్గరైందని ప్రస్తావించారు. నవంబర్ 2019లో అన్‌లిమిటెడ్ డిస్నీ మూవీస్, టీవీ షోలు ప్రకటించిన తొలిరోజే ఏకంగా 10 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు చేరారు. ఆ తర్వాత క్రమంగా 138 మిలియన్ సబ్‌స్ర్కైబర్లకు చేరుకోగలిగింది. పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా 2024 నాటికల్లా సబ్‌స్క్రైబర్లను 260 మిలియన్లకు పెంచుకోవాలని లక్ష్యాన్ని కంపెనీ నిర్దేశించుకుంది. కాగా డిస్నీ ప్లస్ సబ్‌స్ర్కైబర్లలో మూడోవంతు అంటే దాదాపు 50 మిలియన్ల మంది డిస్నీ ప్లస్ హాస్ట్‌స్టార్ నుంచి వచ్చినవారే కావడం విశేషం. డిస్నీ ప్లస్ హాస్ట్‌స్టార్ భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో సర్వీసెస్ అందిస్తోంది. దీని ఎదుగుదలకు క్రికెట్ బాగా దోహదపడింది. కాగా ఈసారి ఐపీఎల్ డిజిటల్ హక్కులను వయా18 దక్కించుకున్న విషయం తెలిసిందే.


ఇప్పటికే ప్రతికూల అంచనాలు..

డిస్నీ కంపెనీ తన వృద్ధి అంచనాలను తగ్గించే అవకాశాలున్నాయని కొన్ని నెలలుగా ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కైబర్లు భారీగా తగ్గిన నేపథ్యంలో ఈ అంచనాలు మొదలయ్యాయి. ఇందుకు తగ్గట్టు గత త్రైమాసికంలో డిస్నీ బలహీన గణాంకాలు వెల్లడించింది. నష్టాలు తప్పవనే ఊహాగానాలతో డిస్నీ షేర్ విలువ ఈ ఏడాది 39 శాతం మేర పతనమైంది. ఇప్పుడు ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులు దక్కకపోవడంతో నష్టాలు మరింత పెరుగుతాయనే అంచనాలు బలపడుతున్నాయి. ఐపీఎల్ హక్కులు కోల్పోవడం దీర్ఘకాల వృద్ధిపై ప్రభావం చూపుతుందంటున్నారు. అయితే క్రికెట్ నష్టాలను తగ్గించుకునే దిశగా కంపెనీ అడుగులు వేయాల్సి ఉంటుందంటున్నారు. 

Updated Date - 2022-06-15T22:10:11+05:30 IST