లైంగిక వేధింపుల ఆరోపణలతో వైవీయూ ప్రిన్సిపల్‌ బాధ్యతల నుంచి తొలగింపు

ABN , First Publish Date - 2021-07-27T05:30:00+05:30 IST

యోగివేమన యూనివర్శిటీలో ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ కృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి తొలగిస్తూ వీసీ సూర్యకళావతి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

లైంగిక వేధింపుల ఆరోపణలతో వైవీయూ ప్రిన్సిపల్‌ బాధ్యతల నుంచి తొలగింపు
ప్రొఫెసర్‌ చంద్రమతి శంకర్‌కు ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా నియామక పత్రం అందజేస్తున్న వీసీ సూర్యకళావతి

ఆరోపణలపై విచారణ కమిటీని నియమిస్తూ వీసీ ఉత్తర్వులు

ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా చంద్రమతి శంకర్‌


కడప వైవీయూ, జూలై 27: యోగివేమన యూనివర్శిటీలో ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ కృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి తొలగిస్తూ వీసీ సూర్యకళావతి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా ఉద్యోగినిపై ప్రిన్సిపల్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు మీడియాలో రావడం, బాధితురాలి ఆడియో కలకలం రేపడంతో వీసీ స్పందించి సమగ్ర విచారణకు ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ప్రొఫెసర్‌ పద్మ కన్వీనర్‌గా, ప్రొఫెసర్‌ దాము, ప్రొఫెసర్‌ నజీర్‌అహమ్మద్‌, డాక్టర్‌ రమాదేవి, ప్రొఫెసర్‌ కాత్యాయని, వాణి సుజాత, కృష్ణకుమార్‌లను సభ్యులుగా కమిటీలో నియమించారు. సమగ్ర విచారణ జరిపి బుధవారం సాయంత్రం మూడు గంటలలోపు నివేదికను అందజేయాలని కమిటీని వీసీ ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వీసీ వెల్లడించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా వైవీ యూనివర్శిటీ పీజీ కళాశాల ప్రొఫెసర్‌ చంద్రమతి శంకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈమె ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా కొనసాగనున్నారు. ఈ వ్యవహారంపై వీసీ సూర్యకళావతి స్పందిస్తూ నిజనిర్ధారణ కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. బాధితురాలిని విచారించామని, ఆమె ఫిర్యాదు ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌, వైవీయూ పాలక మండలి సభ్యులు వెంకటసుబ్బయ్య, సుబ్బారెడ్డి, పాల్గొన్నారు. కాగా కమిటీ సమావేశమై బాధితురాలి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.


బాధితురాలికి న్యాయం చేయండి

నాన్‌టీచింగ్‌ సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తించిన యూనివర్శిటీ ప్రిన్సిపల్‌ను తొలగించాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు నాయక్‌, దస్తగిరి, గంగాసురేష్‌ సంయుక్తంగా వీసీ సూర్యకళావతికి వినతిపత్రం అందజేశారు. వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలని వీసీని కోరారు.

 

Updated Date - 2021-07-27T05:30:00+05:30 IST