కశ్మీరు సంఘర్షణ పాక్ స్పాన్సర్డ్ ‘ఫ్యామిలీ బిజినెస్’ : డిస్‌ఇన్ఫో ల్యాబ్

ABN , First Publish Date - 2021-08-04T17:44:04+05:30 IST

కశ్మీరు సంఘర్షణ కొన్ని కుటుంబాలు నడుపుతున్న ఫ్యామిలీ

కశ్మీరు సంఘర్షణ పాక్ స్పాన్సర్డ్ ‘ఫ్యామిలీ బిజినెస్’ : డిస్‌ఇన్ఫో ల్యాబ్

న్యూఢిల్లీ : కశ్మీరు సంఘర్షణ కొన్ని కుటుంబాలు నడుపుతున్న ఫ్యామిలీ బిజినెస్ అని డిస్‌ఇన్ఫో ల్యాబ్ నివేదిక వెల్లడించింది. పాకిస్థాన్ ప్రభుత్వం అండదండలతో ఇది ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తోందని పేర్కొంది. దీనిలో అగ్రశ్రేణి రాజకీయ నేతలు, పాకిస్థాన్ ప్రభుత్వం ఉండేవిధంగా, శాశ్వతంగా కొనసాగే విధంగా దీనిని రూపొందించారని పేర్కొంది. ‘ది కశ్మీర్ కాన్‌ఫ్లిక్ట్ ఇండస్ట్రీ నెట్‌వర్క్’ శీర్షికతో ఈ నివేదికను రూపొందించారు. 


2016 నుంచి ఈ కుటుంబ వ్యాపార కేంద్రం సౌదీ అరేబియా నుంచి టర్కీకి మారినట్లు ఈ నివేదిక తెలిపింది. కశ్మీరు లోయలో ఏర్పడే ప్రతి కల్లోలం వెనుక పాకిస్థాన్ ఉంటుందని, కశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘన అంటూ చేసే ప్రతి ఆరోపణకు పాకిస్థాన్‌ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధం ఉంటుందని పేర్కొంది. కశ్మీరు కశ్మీరీలకు తప్ప మిగిలినవారందరికీ సంబంధించిన అంశంగా ఎలా మారిందో కూడా వెల్లడించింది. కశ్మీరుపై చర్చలో కశ్మీరీలకు స్థానం లేదని, ఒకవేళ ఉన్నా ఆ కశ్మీరీలను పక్కనపెట్టేశారని తెలిపింది. 


2016 అక్టోబరు 3న పాకిస్థానీ సెనేట్ ఓ నివేదికను ప్రచురించింది. భారత దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ భావనలో పెను మార్పులు వచ్చే విధంగా పని చేసేందుకు లాబీయింగ్ గ్రూపులను పునరుద్ధరించింది. దీంతో కశ్మీరుతోపాటు భారత దేశంలో మానవీయ విలువలు, మైనారిటీలు, దళితుల హక్కులపై ‘‘వైట్ ఎక్స్‌పర్ట్స్’’, ‘‘హ్యూమన్ రైట్స్ చాంపియన్స్’’ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ లక్ష్యం కోసం పోలిస్ ప్రాజెక్టు, ఈక్వాలిటీ ల్యాబ్, జస్టిస్ ఫర్ కశ్మీర్ వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. కశ్మీరు సంక్షోభంలో ఉందని, భారత సైన్యం అరాచకాలు చేస్తోందని, జమ్మూ-కశ్మీరు జనాభాలో వివిధ వర్గాల సంఖ్యను మార్చేందుకు అధికరణ 370ని రద్దు చేశారని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు అనేకం ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. 


ఈ తప్పుడు ప్రచారాలన్నిటికీ ‘‘స్టాండ్ విత్ కశ్మీర్’’ అనే సంస్థతోనూ, అమెరికాలోని పాక్ ఐఎస్ఐ వ్యక్తి గులామ్ నబీ ఫాయ్‌తోనూ సంబంధం ఉన్నట్లు తెలిపింది. భారత దేశానికి వ్యతిరేకంగా మానసిక, ఇన్ఫో యుద్ధం కోసం సామాజిక మాధ్యమాలను ఐఎస్ఐ ఎంచుకుందని తెలిపింది. పాకిస్థాన్ ప్రజలు తమ దేశంలోని పరిస్థితులు, అభివృద్ధి గురించి ప్రశ్నించిన ప్రతిసారీ వారి దృష్టిని మరలించేందుకు కశ్మీరు నినాదాన్ని ప్రభుత్వం వినిపిస్తూ ఉంటుందని పేర్కొంది.



Updated Date - 2021-08-04T17:44:04+05:30 IST