కాంగ్రెస్‌లో డిష్యుం.. డిష్యుం!

ABN , First Publish Date - 2022-05-25T05:43:10+05:30 IST

జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్‌లో వర్గపోరు నెలకొంటుంది. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.

కాంగ్రెస్‌లో డిష్యుం.. డిష్యుం!
లింగంపేట్‌ మండలం కోమట్‌పల్లిలో కోట్లాడుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

- కాంగ్రెస్‌ రచ్చబండలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు

- సుభాష్‌రెడ్డి వర్సెస్‌ మదన్‌మోహన్‌ వర్గీయులు

- ఇరువర్గాల మధ్య తారస్థాయికి చేరుతున్న వర్గ విభేదాలు

- లింగంపేట్‌ కోమటిపల్లి రచ్చబండలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

- అధిష్ఠానం హెచ్చరించినా మారని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల తీరు

- గత కొన్ని రోజులుగా ఇరువర్గాలు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు

- అయోమయంలో నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు


కామారెడ్డి, మే 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్‌లో వర్గపోరు నెలకొంటుంది. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అధిష్ఠానం సైతం ఇరువర్గాల మధ్య సమన్వయం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు. తాజాగా ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరాయి. ఇరువర్గాల కార్యకర్తలు ప్రజల ముందే ఒకరిపై ఒకరు దుర్భాషలాడడమే కాకుండా బట్టలు చింపుకునేదాక పిడిగుద్దులు గుద్దుకోవడం చర్చనీయాంశంగా మారింది. లింగంపేట మండలం కోమట్‌పల్లి కాంగ్రెస్‌ రచ్చబండలో ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ రచ్చరచ్చ చేశారు. దీంతో సుభాష్‌రెడ్డి, మదన్‌మోహన్‌రావు వర్గీయుల మధ్య విభేదాలు మరోసారి బయటపడడమే కాకుండా రచ్చకెక్కాయి. ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ను మదన్‌మోహన్‌ వర్గీయులు చీల్చే కుట్ర చేస్తున్నారంటూ సుభాష్‌రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.

కోమట్‌పల్లి రచ్చబండలో కాంగ్రెస్‌ కార్యకర్తల రచ్చరచ్చ

కాంగ్రెస్‌ అధిష్ఠానం రైతు డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఈ రైతు డిక్లరేషన్‌ను గ్రామగ్రామానా రైతులతో పాటు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీ కాంగ్రెస్‌ రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత వారం రోజులుగా ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు నాయకులు, కార్యకర్తలు ఊరూరా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ శ్రేణులు రచ్చబండ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే ఎల్లారెడ్డిలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం పార్టీ కో ఆర్డినేటర్‌ వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం చేపడుతుండగా ఐటీసెల్‌ ఇన్‌చార్జ్‌ మదన్‌మోహన్‌ ఆధ్వర్యంలోనూ వేరుగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. లింగంపేట్‌ మండలం కోమటిపల్లిలో మంగళవారం మదన్‌మోహన్‌రావు వర్గీయులు నిర్వహించిన రచ్చబండలో కార్యకర్తలు నానా రచ్చరచ్చ చేశారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ సుభాష్‌రెడ్డికి ఆహ్వానం లేకుండా కోమటిపల్లిలో ఎలా రచ్చబండ నిర్వహిస్తారని ఆ నేత వర్గీయులు మదన్‌మోహన్‌ వర్గీయులను అడ్డుకుని నిలదీశారు. ఇదే క్రమంలో ఇరువర్గాల కార్యకర్తల మధ్య మాటామాటా పెరగడం ఒకరిపై ఒకరు దుర్భాషలాడడంతో కొట్టుకునే పరిస్థితి దాక వెళ్లింది. చివరికి కార్యకర్తలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ బట్టలు చినిగిపోయే వరకు కొట్టుకోవడంతో ఆ గ్రామ ప్రజలు సైతం విస్తుపోయారు.

అధిష్ఠానం ఆదేశించినా మారని తీరు

జిల్లా కాంగ్రెస్‌లో గత  కొన్ని రోజులుగా వర్గపోరు కొనసాగుతోంది. ప్రధానంగా జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, ఐటీసెల్‌ అధ్యక్షుడు మదన్‌మోహన్‌ ఆరు నియోజకవర్గాల్లో వేరే వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టడంపై కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఆ నియోజకవర్గాల సీనియర్‌ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే గత నెలరోజుల కిందట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు మదన్‌మోహన్‌ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడంటూ సస్పెండ్‌ చేశాడు. ఈ సస్పెన్షన్‌ కాస్తా జిల్లా కాంగ్రెస్‌లో మరింత విభేదాలను సృష్టించింది. మదన్‌మోహన్‌ సైతం అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకోవడంతో జిల్లా కాంగ్రెస్‌ నేతలపై అధిష్ఠానం సీరియస్‌ అయింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం ఉండాలని అందరు కలిసే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ఇటీవల కాంగ్రెస్‌ క్రమ శిక్షణ కమిటీ సైతం మదన్‌మోహన్‌తో పాటు డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావులను విచారించడంతో పాటు వివాదాలు చేయవద్దని హెచ్చరించింది. అయినా మదన్‌మోహన్‌ వర్గీయుల్లో మాత్రం అధిష్ఠానం ఆదేశాలను బేఖారత్‌ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కో ఆర్డినేటర్‌ సుభాష్‌రెడ్డిని కాదని వేరుగా చేయడం ఏమిటని ఆ నియోజకవర్గ కార్యకర్తలే కాకుండా జిల్లా సీనియర్‌ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. మదన్‌మోహన్‌ తనతో ఉన్న కొందరు కాంగ్రెస్‌ను రెండుగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అధిష్ఠానం ఆదేశించినా మదన్‌మోహన్‌ వర్గీయుల్లో తీరు మారకపోవడంపై సీనియర్‌ నేతలు గుస్సుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-05-25T05:43:10+05:30 IST