దిశ@3.2 లక్షలు

ABN , First Publish Date - 2022-05-21T06:19:46+05:30 IST

ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజులో 3.2 లక్షల సెల్‌ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించాలని భావించిన యంత్రాంగం దాన్ని అధిగమించింది.

దిశ@3.2 లక్షలు

యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించిన పోలీసులు 

రోడ్లపై కాప్స్‌, సచివాలయ సిబ్బంది

విజయవాడ, మే 20(ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజులో 3.2 లక్షల సెల్‌ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించాలని భావించిన యంత్రాంగం దాన్ని అధిగమించింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులు, సచివాలయ సిబ్బంది రహదారులపైనే విధులు నిర్వర్తించారు. మొత్తానికి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. 3.2 లక్షల ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. 1.70 లక్షల రిజిస్ర్టేషన్లు జరిగాయి. 2000 మంది పోలీసు సిబ్బంది, 12981 మంది ఇతర శాఖల సిబ్బంది ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు. విజయవాడలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఈ డౌన్‌లోడ్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌ దిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌, పోలీసు కమిషనర్‌ కాంతిరాణా ప్రారంభించారు. విజయవాడ నగరంలో మోడల్‌ గెస్ట్‌హౌస్‌, ఇంద్రకీలాద్రి, జక్కంపూడి కాలనీ, పీఎన్‌బీఎస్‌, రైల్వేస్టేషన్‌ తదితర ప్రాంతాల్లో డౌన్‌లోడ్‌ ప్రక్రియను పోలీసు కమిషనర్‌ పరిశీలించారు. పలు ప్రాంతాల్లో కలెక్టర్‌ దిల్లీరావు పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగుల, విద్యార్థినులతోపాటు యువకుల ఫోన్లలోనూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. మహిళలు, యువతుల ఫోన్లలో కచ్చితంగా దిశ యాప్‌ ఉండాలన్న ఉద్దేశంతో ఈ మెగాడ్రైవ్‌ను చేపట్టారు. కృష్ణా జిల్లా పోలీసులు కొద్దిరోజుల క్రితం ఈవిధంగా డ్రైవ్‌ నిర్వహించి లక్ష డౌన్‌లోడ్లు చేశారు. దాన్ని ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు అధిగమించారు.


Updated Date - 2022-05-21T06:19:46+05:30 IST