డీజిల్‌ @ రూ.100

ABN , First Publish Date - 2021-10-09T17:28:34+05:30 IST

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోధరలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికే రూ.108కి చేరవైన పెట్రోల్‌ మంట మండుతుంటే.. రూ.100కి చేరిన డీజిల్‌ కూడా దడపుట్టిస్తోంది. వారం రోజులు గా పెట్రోధరలు

డీజిల్‌ @ రూ.100

- పెట్రోలు రూ.107.36

- రోజురోజుకు పెరుగుతున్న ధరలతో జనం హడల్‌


ఖమ్మం: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోధరలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికే రూ.108కి చేరవైన పెట్రోల్‌ మంట మండుతుంటే.. రూ.100కి చేరిన డీజిల్‌ కూడా దడపుట్టిస్తోంది. వారం రోజులు గా పెట్రోధరలు పెరుగుతూవస్తుండగా.. శుక్రవారం పెట్రోలు రూ.107.36, డీజిల్‌ లీటర్‌ ధర రూ 100.52 ఉంది. ఇక పవర్‌ పెట్రోల్‌ ధర రూ.110.92 పైసలు, టర్బోడీజిల్‌ ధర రూ 103.53 పైసలకు విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు వణికిపోతున్నారు. అసలే కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజలపై మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టుగా చమురు ధరలు చుక్కలు చూపుతున్నాయి. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలకు తోడు.. రోజురోజుకు పెరుగుతున్న పెట్రో ధరలతో నిరుపేదలు, సామాన్యులు బిక్కుబిక్కుమంటున్నారు. ఖమ్మం జిల్లాలో 170 బంకులుండగా వీటిలో రోజుకు 1లక్ష 80వేల లీటర్ల పెట్రోల్‌,  4.50 లక్షల లీటర్ల డీజిల్‌ విక్రయిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని 56 బంకుల్లో 80వేల లీటర్ల పెట్రోల్‌, 2.20 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెట్రో ధరలు భారీగా పెరుగుతుండటం.. వినియోగదారులపై పెనుభారం పడుతోంది. ప్రస్తుత వ్యవసాయ సీజన్‌  నేపథ్యంలో ట్రాక్టర్లు, ఇతర యంత్రాలకు డీజిల్‌ అవసరం మరింత ఉంటుండగా.. డీజిల్‌ ధరలు పెను భారంగా మారుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల అన్ని నిత్యావసర వస్తువులపై ప్రభావం చూపుతోందని, తద్వారా ఆ భారం సామాన్యులపై మోయలేని విధంగా ఉంటుందని సగటు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో!

- నాగబత్తిని రవి, సీనియర్‌ పెట్రో డీలర్‌, ఖమ్మం


పెట్రోలు ధర ఇప్పటికే రూ.107 అయ్యింది. తాజాగా డీజిల్‌ కూడా రూ.100 దాటింది. ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు మరింత ఇబ్బందికరం. ఇక డీలర్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయో తెలియని పరిస్థితి. పెట్రోల్‌డీజిల్‌ ధరల ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులతో పాటు రైతులకు ఇబ్బందికరమైన సందర్భమే. పెట్రోధరల పెంపుతో డీలర్లపైనా పెనుభారం పడుతోంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలను నియంత్రించే ఆస్కారం ఉంటుంది.

Updated Date - 2021-10-09T17:28:34+05:30 IST