బల్క్‌ డీజిల్‌ భగభగ..

ABN , First Publish Date - 2022-03-21T07:57:08+05:30 IST

బల్క్‌ డీజిల్‌ ధర భగ్గుమంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర దాదాపు 40 శాతం పెరిగిన ....

బల్క్‌ డీజిల్‌ భగభగ..

లీటరుపై రూ.25 పెంపు

పెట్రోల్‌ బంకుల్లో స్థిరంగా కొనసాగుతున్న ధర

డీజిల్‌ కోసం పెట్రోల్‌ బంకుల బాటలో బల్క్‌ వినియోగదారులు

అమ్మకాల్లో పెరుగుదల.. రిటైలర్లకు పెరుగుతున్న నష్టాలు

ప్రైవేటు రిటైలర్లపై ఒత్తిడి.. బంకుల మూసివేత దిశగా యోచన!


న్యూఢిల్లీ, మార్చి 20: బల్క్‌ డీజిల్‌ ధర భగ్గుమంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర దాదాపు 40 శాతం పెరిగిన నేపథ్యంలో బల్క్‌ వినియోగదారులకు విక్రయించే డీజిల్‌ ధర లీటరుకు రూ.25 పెరిగింది. అయితే పెట్రోల్‌ పంపుల వద్ద వాహనదారులకు విక్రయిస్తున్న డీజిల్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. బల్క్‌ డీజిల్‌ ధర మండిపోతున్న నేపథ్యంలో బల్క్‌ వినియోగదారులైన బస్‌ ఫ్లీట్‌ ఆపరేటర్లు, మాల్స్‌ నిర్వాహకులు పెట్రోల్‌ పంపుల వద్ద క్యూ కడుతున్నారు. ఇంతకు ముందు వీరంతా ఆయిల్‌ కంపెనీల నుంచి నేరుగా ఇంధనాన్ని ఆర్డరు చేసేవారు.


కానీ ఇప్పుడు బల్క్‌ డీజిల్‌ ధర పెరగడంతో అందుకు బదులుగా పెట్రోల్‌ పంపుల వద్ద ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఈ నెలలో పెట్రోల్‌ పంపుల అమ్మకాలు 20 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ముంబైలో బల్క్‌ వినియోగదారులకు విక్రయించే డీజిల్‌ ధర లీటరుకు రూ.122.05కు పెరిగింది. కానీ పెట్రోల్‌ పంపుల వద్ద విక్రయిస్తున్న డీజిల్‌ ధర మాత్రం లీటరుకు రూ.94.14గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్‌ పంపుల్లో లీటరు డీజిల్‌ ధర రూ.86.67 ఉండగా.. బల్క్‌ లేదా పారిశ్రామిక వినియోగదారులకు విక్రయించే డీజిల్‌ ధర దాదాపు రూ.115గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నా గత నవంబరు 4 నుంచి ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచలేదు. ప్రస్తుతం పెట్రోధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. మరోవైపు పెట్రోల్‌ పంపుల్లో తక్కువ ధరకు ఇంధనాలను విక్రయిస్తుండటం వల్ల రిటైలర్లకు నష్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్‌ వంటి ప్రైవేటు రిటైలర్లపై ఒత్తిడి పెరుగుతోంది.


కానీ ఇప్పుడున్న రేట్లతో ఎక్కువ ఇంధనాన్ని విక్రయించడం కన్నా మూసివేయడం మేలన్న ఆలోచన చేస్తున్నట్టుగా సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 136 రోజులుగా ఇంధనాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంతకుముందు 2008 సంవత్సరంలో ప్రభుత్వరంగ కంపెనీల నుంచి పోటీని తట్టుకోలేక రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ దేశవ్యాప్తంగా 1,432 పెట్రోల్‌ పంపులను మూసివేసింది. బల్క్‌ వినియోగదారులు పెట్రోల్‌ పంపుల వైపు మళ్లుతున్నందు వల్ల రిటైలర్ల నష్టాలు పెరిగి మళ్లీ ఇలాంటి పరిస్థితి రావొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. 


ధరల పెరుగుదల ప్రభావం ఎంత?

రాష్ట్రాల రవాణా సంస్థలు, ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్లు, విమానాశ్రయాలు, మాల్స్‌, సినిమా హాళ్లు, టెక్‌ పార్కులు, పరిశ్రమలు, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు వంటివి బల్క్‌ డీజిల్‌ వినియోగదారుల కేటగిరీ కిందకు వస్తాయి. వీటి డీజిల్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేరుగా చమురు విక్రయ కంపెనీల నుంచి డీజిల్‌ను కొనుగోలు చేస్తుంటాయి. సాధారణంగా బల్క్‌ డీజిల్‌ ధర.. రిటైల్‌ ధరకన్నా తక్కువగా ఉంటుంది. బల్క్‌ డీజిల్‌ ధరల పెరుగుదల వల్ల ఆయా సంస్థల నిర్వహణ వ్యయాలు మరింత పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా అవి అందించే వస్తు, సేవల ధరలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రవాణా సంస్థలు పెరిగిన ధరలకనుగుణంగా చార్జీలను పెంచే అవకాశం ఉంటుందంటున్నారు. పెరిగిన డీజిల్‌ ధరలకు అనుగుణంగా బల్క్‌ డీజిల్‌ వినియోగదారులు ధరలను పెంచితే ఆ మేరకు వినియోగదారులపైనే భారం పడే పరిస్థితి నెలకొంటుంది. 

Updated Date - 2022-03-21T07:57:08+05:30 IST