స్కూళ్లు..వసూళ్లు..ప్రైవేటులో కొత్త ఫీజులు

ABN , First Publish Date - 2022-04-16T16:59:25+05:30 IST

విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలోనే ఏడాదికి సంబంధించిన ఫీజును, ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నిర్ధారిస్తాయి

స్కూళ్లు..వసూళ్లు..ప్రైవేటులో కొత్త ఫీజులు

కరోనా వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులు కొత్త ఫీజులను తెరపైకి తెస్తున్నారు. డీజిల్‌ ధరలు పెరిగాయని, ప్రత్యేక క్లాసులని.. ఇలా రకరకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నారు. వార్షిక ఫీజులు కాకుండా, సమ్మర్‌ ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట అదనపు ఫీజులను తీసుకుంటుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు.

 డీజిల్‌ ధరల పెరుగుదల పేరుతో అదనపు భారం

 వేసవి ప్రత్యేక క్లాసుల పేరిట మరో దోపిడీ

 బెంబేలెత్తుతున్న తల్లిదండ్రులు

హైదరాబాద్‌ సిటీ: విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలోనే ఏడాదికి సంబంధించిన ఫీజును, ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నిర్ధారిస్తాయి. ఆ మేరకు టర్మ్‌ల వారీగా లేదా నెలవారీగా వసూలు చేస్తుంటాయి. కానీ, ఇప్పుడు మధ్యలో కొత్త రకం ఫీజుల భారాన్ని తల్లిదండ్రులపై మోపుతున్నారు. నగరంలో 1,886 ప్రైవేట్‌ పాఠశాలలు నడుస్తున్నాయి. ఇందులో సుమారు 6.70 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నగరంలోని పలు విద్యాసంస్థలు ఏప్రిల్‌ 5 నుంచి ఒకటి నుంచి 9 తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభించగా, మరికొన్ని శనివారం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. కరోనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 80 శాతం యాజమాన్యాలు ఇప్పటికే పెండింగ్‌ ఫీజులను వసూలు చేశాయి. మిగతా విద్యా సంస్థలు పరీక్షలు పూర్తయ్యేలోపు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశాయి. 


ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీల పెంపు

డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయంటూ దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల బస్సు చార్జీలను తరచూ పెంచుతుండడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. ఉదాహరణకు హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రెండు నెలల క్రితం ఒక విద్యార్థి నెలవారీ ట్రాన్స్‌పోర్టు చార్జీ రూ.1500 ఉండగా, ప్రస్తుతం రూ.2వేలకు పెంచారు. జూబ్లీహిల్స్‌లోని మరో పాఠశాల గతంలో రూ.1600 ట్రాన్స్‌పోర్టు చార్జీ ఉండగా, ఏప్రిల్‌లో ఏకంగా రూ.2400 తీసుకోవడం గమనార్హం. అయితే డీజిల్‌ ధరలు పెరగడంతోనే తప్పనిసరి పరిస్థితిలో రేట్లు పెంచామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్‌ 1 వరకు జరగనున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులు జూన్‌ మొదటి వారం వరకు ట్రాన్స్‌పోర్టు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు ఇప్పటికే మౌఖికంగా చెప్పినట్లు తెలిసింది.


సమ్మర్‌ క్లాసుల పేరిట..

1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈనెల 22 వరకు పరీక్షలు పూర్తి చేసి 24 నుంచి వేసవి సెలవులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో ఎదురైన కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు కార్పొరేట్‌ పాఠశాలలు వేసవి ప్రత్యేక క్లాసుల పేరిట ఫీజులు వసూలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠాలను వేసవిలో ప్రారంభించడం ద్వారా విద్యార్థులను పై తరగతికి సన్నద్ధులను చేస్తున్నామని చెబుతూ తమ ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై కొందరు తల్లిదండ్రులు విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

Updated Date - 2022-04-16T16:59:25+05:30 IST