వ్యాధుల కాలం.. అప్రమత్తతే ముఖ్యం

ABN , First Publish Date - 2022-06-27T03:58:53+05:30 IST

వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. పరిసరాల పరిశుభ్రత, తాగునీరు తదితర విషయాలపై వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు అవగాహన కల్పించాలి. వ్యాధులు సోకితే గ్రామీణ ప్రాంత ప్రజలు దగ్గరలో ఉన్న పీహెచ్‌సీలకే వెళతారు. వారికి సరైన సమయంలో చికిత్స అందించడం ఎంతో అవసరం. లేకుంటే అతిసార, విషజ్వరాలు ఒకరి నుంచి ఒకరికి ప్రబలే అవకాశాలున్నాయి.

వ్యాధుల కాలం.. అప్రమత్తతే ముఖ్యం

పీహెచ్‌సీలో అరకొర సిబ్బంది

పేరుకే రౌండ్‌ది క్లాక్‌ పీహెచ్‌సీలు

ప్రజలకు అందని వైద్యసేవలు

తాండూర్‌, జూన్‌ 26 : వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. పరిసరాల పరిశుభ్రత, తాగునీరు తదితర విషయాలపై వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు అవగాహన కల్పించాలి. వ్యాధులు సోకితే గ్రామీణ ప్రాంత ప్రజలు దగ్గరలో ఉన్న పీహెచ్‌సీలకే వెళతారు. వారికి సరైన సమయంలో చికిత్స అందించడం ఎంతో అవసరం. లేకుంటే అతిసార, విషజ్వరాలు ఒకరి నుంచి ఒకరికి ప్రబలే అవకాశాలున్నాయి. 

ఈ నేపథ్యంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరే కీలకం. జిల్లాలో 18 మండలాల్లో 9 రౌండ్‌ది క్లాక్‌ పీహెచ్‌సీలు ఉండగా మిగితావి 12 గంటల పీహెచ్‌సీ ఉన్నాయి. కాసిపేట, దండేపల్లి, నెన్నెల, జన్నారం, తాండూర్‌, కోటపల్లి, భీమిని, వేమనపల్లి, జైపూర్‌ మండలాల్లో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు ఉన్నాయి. అయితే ఈ రౌండ్‌ది క్లాక్‌ పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కో వైద్యుడు మాత్రమే ఉన్నారు. దీంతో ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు వరకు మాత్రమే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. వైద్యులతోపాటు మిగతా సిబ్బంది, మందుల కొరత కూడా ఉంది.

పరిసరాల పరిశుభ్రతే ముఖ్యం

వానాకాలం సీజన్‌లో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యం.  ఇటీవల నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతిలో పారిశుధ్యంపై అధికారులు దృష్టి సారించారు. పలుచోట్ల మురుగు నీటి కాల్వలను శుభ్రం చేశారు. ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉండాలని, దోమలు వృద్ధి చెందకుండా చూడాలని, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.  

జిల్లాలో గతంలో పలు గ్రామాల్లో అతిసారా, విష జ్వరాలు ప్రబలాయి. కన్నెపల్లి, వేమనపల్లి, కాసిపేట, తాండూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో గతంలో విష జ్వరాలు ప్రబలి ఎంతో మంది ఆసుపత్రుల పాలయ్యారు. కొన్ని గ్రామాల్లో కలుషిత తాగునీరు, అపరిశుభ్రతతోను వ్యాధులు సోకాయి. ఈ పరిస్థితుల్లో ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

అన్ని చర్యలు తీసుకుంటున్నాం 

సుబ్బారాయుడు, డీఎంహెచ్‌వో 

ఈ సీజన్‌లో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. మండల స్ధాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని చెప్పాం. శుకవ్రారం నిర్వహించే డ్రైడేను ఇక నుంచి రోజు నిర్వహించేలా సూచనలు ఇచ్చాం. ఇప్పటి వరకు అవసరమైన మందులు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా గ్రామాల్లో ఆర్‌ఎంపీ వైద్యులతోనే సమావేశాలు ఏర్పాటు చేసి సీజనల్‌ వ్యాధులను అరికట్టడంలో వారిని భాగస్వాములను చేస్తున్నాం. ఆశా కార్యకర్తల ద్వారా ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నాం. సబ్‌ సెంటర్‌ వారీగా కావాల్సిన మందులన్నీ త్వరలోనే పంపిణీ చేస్తాం.  

Updated Date - 2022-06-27T03:58:53+05:30 IST