వరద నిధులపై సంవాదం

ABN , First Publish Date - 2022-07-21T09:43:24+05:30 IST

కేంద్ర, రాష్ట్రాల మధ్య వరద నిధుల పంచాయితీ మొదలయింది. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా ఉన్న రాష్ట్ర సర్కారు.

వరద నిధులపై సంవాదం

  • కేంద్ర, రాష్ట్రాల మధ్య విపత్తు వాగ్వాదం
  • లెక్కలను తవ్వితీస్తున్న నేతలు
  • ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధులేమీ రాలేదు
  • సాయం శూన్యమంటున్న టీఆర్‌ఎస్‌
  • నేరుగా ప్రధానిని ప్రశ్నించిన కేటీఆర్‌ 
  • నిధులు ఇచ్చామంటున్న బీజేపీ
  • పద్ధతుల ప్రకారం అడిగితేనే నిధులొస్తాయన్న కేంద్రం
  • రూ.1400 కోట్ల నష్టం 
  • తక్షణ సాయంగా వెయ్యి కోట్లివ్వండి
  • కేంద్రానికి తెలంగాణ సర్కారు నివేదిక


హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్రాల మధ్య వరద నిధుల పంచాయితీ మొదలయింది. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా ఉన్న రాష్ట్ర సర్కారు.. వరదలతో అతలాకుతలమైన తెలంగాణకు ఎలాంటి సాయం చేయడం లేదంటూ అక్కసు వెళ్లగక్కడం.. అనేక వాగ్వాదాలకు దారితీసింది. పరస్పర వ్యంగ్యాస్త్రాలు, తీవ్ర విమర్శలు, రాజకీయ వేడి పెంచేందుకు కారణమైంది. ఒకవైపు తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్టు వ్యవహారం, మరోవైపు కేంద్ర, రాష్ట్రాల మధ్య విపత్తు నిధులపై విమర్శలు రగడ రాజేశాయి. 2018 నుంచి 2022 వరకు జాతీయ విపత్తుల సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ) కింద తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ నేరుగా ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీనిపై బీజేపీ అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో ప్రతి విమర్శలకు దిగింది. ఎవరి లెక్కలు వారు చెప్తూ విమర్శల వేడి పెంచారు. అంతేకాదు.. అటు కేంద్ర ప్రభుత్వం-బీజేపీ నేతలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం-టీఆర్‌ఎస్‌ నేతలు తమ తమ అధికారులతో మాట్లాడి విపత్తుల సాయంపై లెక్కలు తీయించే పనిలోపడ్డారు. ఇక్కడ సీఎం కార్యాలయ అధికారులు కూడా ఈ లెక్కలపైనే వివరాలు తీశారు. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ కింద నిధులు రావాలంటే కొన్ని పద్ధతులుంటాయని, అదే సమయంలో ప్రభుత్వం నివేదిక ద్వారా అడిగితేనే కేంద్రం సాయం చేస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ‘గతంలో అడిగితే ఇచ్చారా? అయినా సరే ఇప్పుడు రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించడంతో విపత్తు నిధులు ఇవ్వాలని మళ్లీ అడుగుతున్నాం.. ఈ వరదల వల్ల రూ.1400 కోట్ల నష్టం వాటిల్లింది.. తక్షణసాయం కింద వెయ్యి కోట్లివ్వండి’ అటూ సీఎంవో నుంచి బుధవారం రాత్రి కేంద్రానికి నివేదిక వెళ్లింది. రోడ్లు, భవనాలశాఖకు రూ.498కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ.449కోట్లు, సాగునీటిశాఖకు రూ.33 కోట్లు, పురపాలక శాఖకు రూ.379కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.7కోట్లు నష్టం వాటిల్లిందని అందులో పేర్కొన్నారు.


సాయంలో ఎవరి వాటా ఎంత?

వాస్తవానికి విపత్తు నిధుల విషయంలో ఉన్న రెండు రకాల నిధులకు గాను ఒకదాని విషయంలో అసలు వాగ్వాదమే లేదు. ఉన్నదంతా రెండో రకం నిధితోనే. విపత్తు సహాయం కింద రెండు నిధులుంటాయి. ఒకటి రాష్ట్ర విపత్తు సహాయ నిధి(ఎస్‌డీఆర్‌ఎఫ్‌). రెండోది జాతీయ విపత్తు సహాయ నిధి(ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ). వీటిల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద ఇచ్చే నిధి విషయంలో ఏ పేచీ ఉండదు. ఏటేటా రాష్ట్రాల జనాభా, అక్కడ విపత్తులతో ఏర్పడే పరిస్థితులను బట్టి కొంత నిధిని కేటాయిస్తారు. ఇందులో 75% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 25%  రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇక, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ కింద నిధులను పూర్తిగా కేంద్రమే ఇస్తుంది. అయుతే వీటిని ఏటేటా ఇంత అని స్థిరంగా ఇవ్వరు. ఏ రాష్ట్రంలో అయినా వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు.. సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగితేనే కేంద్రం స్పందిస్తుంది. జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే.. ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం బృందాలను పంపుతుంది. ఆ బృందాలు నష్టాన్ని అంచనా వేసి నివేదికను అందిస్తాయి. దానిని కేంద్ర ఆర్థిక, హోం తదితర శాఖలు పరిశీలించి, చర్చించి ఎంత సాయం చేయాలనేదానిపై నిర్ణయిస్తాయి. ఆ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రానికి ఇస్తుంది. 


ఎన్‌డీఆర్‌ఎఫ్‌పైనే వివాదం

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద నిధుల విషయంలో కేంద్ర-రాష్ట్రాలు, బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య పరస్పర విమర్శలు పెద్దగా లేవు. ఎందుకంటే దీనికింద సాధారణంగా ఏటేటా నిధులొస్తూనే ఉన్నాయి. కేంద్రం తన వాటా నిఽధులను ఇస్తూనే ఉంది. 2015-16లో రూ.468.2 కోట్లు, 2016-17లో రూ.328.16 కోట్లు, 2021-22లో సుమారు 359 కోట్లు, 2022-23లో రూ.377.60 కోట్లు ఇలా కేంద్రం ఏటేటా నిధులు విడుదల చేసింది. అయితే ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ కింద కేంద్రం ఏమాత్రం నిధులు విడుదల చేయలేదని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. గతంలో కుండపోత వర్షాల కారణంగా హైదరాబాద్‌ నగరమంతా అతలాకుతలం అయినప్పుడు కూడా సాయం చేయాలని కేంద్రాన్ని అడిగామని, కానీ ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ కింద ఇచ్చింది శూన్యమని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఈ విమర్శలను బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రం ఉపయోగించుకోలేదని, పూర్తిస్థాయిలో వాటిని ఉపయోగిస్తేనే ఆ తర్వాత మరోమారు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ కింద నిధులు వస్తాయని పేర్కొన్నారు. దానికోసం ఆయన ఏకంగా కాగ్‌ ఆడిట్‌ నివేదికను కూడా తవ్వితీశారు. ‘కాగ్‌ ఆడిట్‌ రిపోర్టు ప్రకారం.. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అకౌంట్‌లో రూ.977.67 కోట్ల ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌ ఉంది. ఈ నిధుల నుంచి రూ.397.11 కోట్లు ఉపయోగించుకోవడానికి అనుమతులున్నాయి. ఈ  మొత్తంలో రూ.282 కోట్లు కేంద్ర వాటానే. అయినా రాష్ట్ర ప్రభుత్వం రూ.21.03కోట్లు మాత్రమే వినియోగించుకుంది’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. అంతేకాకుండా ఏటేటా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద కూడా నిధులు విడుదల చేశామని తెలిపారు. తొమ్మిదేళ్లలో ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్‌డీఆర్‌ఎ్‌ఫల కింద రూ.2970.87 కోట్లు విడుదల చేశామని వివరించారు. అయితే..  ఆయన కూడా ఈ మొత్తంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు ఎంత? అన్నది విడిగా చెప్పకపోవడం గమనార్హం. మరోవైపు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ నిధులను విడుదల చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయని, వాటి విషయంలో రాష్ట్రం విఫలమైందని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. ‘ఉత్తరాఖండ్‌ బీజేపీ పాలిత రాష్ట్రం. అక్కడ ఎప్పుడూ వరదలు వస్తుంటాయి.. కానీ ఆ రాష్ట్రానికి 2017నుంచి ఇప్పటివరకు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ కింద నిధులివ్వలేదు’ అని చెప్పారు. ఇటీవలి వరదలతో అతలాకుతలమైన తెలంగాణకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. అయితే.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రికి రాత్రి రూ.1400 కోట్ల నష్టం జరిగిందని అంచనావేసి నివేదిక పంపించడంతో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-07-21T09:43:24+05:30 IST