మమ్మల్ని పిలవకుండా చర్చలా?

ABN , First Publish Date - 2021-10-14T14:03:49+05:30 IST

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలకు..

మమ్మల్ని పిలవకుండా చర్చలా?

ఉపాధ్యాయ సంఘాల కినుక


అమరావతి(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలకు ఉపాధ్యాయ సంఘాలను పిలవకపోవడంపై సంఘాలు కినుక వహించాయి. సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ, ఇతర ప్రధాన సమస్యలపై ఉద్యోగుల జేఏసీలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపారు. ఈ చర్చల కు ఉపాధ్యాయ సంఘాలను పిలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వాస్తవానికి సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ ప్రకటన డిమాండ్‌ చేస్తూ గతంలో చేసిన ఆందోళనల్లో ఉపాధ్యాయ సంఘాలే కీలకపా త్ర పోషించాయి. ఉద్యోగుల జేఏసీతో కలిసి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆందోళనలు చేసింది. ఆ తర్వాత విడిగా కూడా ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు నిర్వహించాయి.


అలాంటిది ఇప్పుడు తమను పిలవకుండా చర్చలకు వెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నాయి. గతంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చర్చలకు వెళ్లినప్పుడు తమను పిలిచేవారని, ఇప్పుడు కేవలం వారు మాత్రమే కలవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉపాధ్యాయులది ప్రధాన సంఖ్యే. దాదాపు 1.5 లక్షల మంది ఉపాధ్యాయులకు ఆయా సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తుంటాయి. గతంలో ఉద్యోగ సంఘాల జేఏసీలో వీరికీ ప్రాతినిధ్యం ఉండేది. ప్రభుత్వంతో కీలక విషయాలు చర్చించేందుకు వెళ్లినప్పుడు ఉపాధ్యాయ సంఘాలనూ పిలిచేవారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ గెజిటెడ్‌ అధికారుల సమాఖ్యలో కూడా దాదాపు 81 సంఘాల నుంచి ప్రాతినిధ్యం ఉంది.

Updated Date - 2021-10-14T14:03:49+05:30 IST