విదేశీ విద్యా దీవెనపై వివక్ష

ABN , First Publish Date - 2021-11-28T06:34:07+05:30 IST

తెలుగుదేశం హయాంలో జిల్లా వ్యాప్తంగా విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందారు.

విదేశీ విద్యా దీవెనపై వివక్ష

  1. టీడీపీ హయాంలో విదేశాలకు విద్యార్థులు
  2. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం
  3. డబ్బు చెల్లించని వైసీపీ ప్రభుత్వం
  4. అప్పులు చేస్తున్న తల్లిదండ్రులు
  5. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు


 ఇప్పటికే రూ.15 లక్షల అప్పు..


నేను ఆటో డ్రైవర్‌ను. ఎలాంటి ఆస్తులు లేవు. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. నా పిల్లలు నాలా కాకూడదనే గొప్ప చదువులు చదివించాలని అనుకున్నాను. 2019లో విదేశీ విద్యా దీవెన పథకం కింద నమోదు చేసుకుని నా కొడుకును వైద్య విద్య కోసం కజికిస్థాన్‌కు పంపించాను. చదువు పూర్తి కావాలంటే రూ.40 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే రూ.15 లక్షలు అప్పు చేశాం. మిగిలిన డబ్బులు సమకూర్చే దారి కనిపించడం లేదు. డబ్బులు కట్టకపోతే నా కొడుకు చదువు మధ్యలో ఆగిపోతుంది. ఇంతా చేసి కొడుకును చదివించుకోలేక పోతానేమో అన్న భయం పట్టుకుంది. వైసీపీ ప్రభుత్వం మా లాంటి వారికి అండగా నిలుస్తుందని అనుకున్నాం. ఇలా మోసం చేస్తుందని అనుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా గోడును విని, మా పిల్లల చదువులు ఆగిపోకుండా చూడాలి.                       


- నాగేశ్వరగౌడ్‌, కర్నూలు


అమలు చేయాలి..


బళ్లారి చౌరస్తాలో చిన్న టీ దుకాణం ఏర్పాటు చేసుకుని బతుకుతున్నాం. నా కొడుకును విదేశాల్లో వైద్య విద్య చదివించాలని అనుకున్నాను. అందుకు దాదాపు రూ.35 లక్షలు అవుతుంది. అంత డబ్బును సమకూర్చడం నా తాహతుకు మించిన పని. ప్రభుత్వం విదేశీ విద్యా దీవెన పథకం కింద సాయం చేస్తుందన్న ఆశించి నా కొడుకును ఫిలిప్పైన్స్‌కి పంపించాను. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సంబంధిత శాఖ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. అధికారులను అడిగితే సైట్‌ ఓపెన్‌ కావడం లేదని చెబుతున్నారు. ఎపుడు ఓపెన్‌ అయ్యేది చెప్పలేమంటున్నారు. ఇప్పటికే చాలా అప్పు చేశాం. ఇక చేసే శక్తి కూడా లేదు. ప్రభుత్వం సాయం చేయకపోతే నా కొడుకు చదువు మధ్యలోనే ఆగిపోతుంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని అమలు చేసి మా లాంటి వారికి న్యాయం చేయాలి.


- నాగరాజు, కర్నూలు 


కర్నూలు, ఆంధ్రజ్యోతి: తెలుగుదేశం హయాంలో జిల్లా వ్యాప్తంగా విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. అదే తరహాలో ప్రభుత్వ సాయంతో విదేశాల్లో చదువుకుందామని అనుకునే వారికి వైసీపీ ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పక్కన పెట్టేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకుందామంటే సైట్‌ ఓపెన్‌ కావడం లేదని ఆశావహులు నిరాశ చెందుతున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో అర్హత పొంది విదేశాలకు వెళ్లిన వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. గత ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది కదా, డబ్బులు ఇవాళ కాకపోతే రేపైనా పడతాయన్న ఉద్దేశంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పు చేసి మరీ తమ పిల్లలను విదేశాలకు పంపించారు. వైసీపీ ప్రభుత్వం పథకాన్ని విస్మరించడంతో మిగతా డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల తాము అప్పుల పాలవ్వడమే కాక, తమ పిల్లలు ఇబ్బందుల్లో పడ్డారని, వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ డబ్బులను విడుదల చేయాలని, తమ పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని కోరుతున్నారు. 



సాయం చేస్తుందని నమ్మి..


పేద, మధ్య తరగతి ప్రజలకు విదేశీ విద్య అంటే తాహతుకు మించిన వ్యవహారం. గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని నమ్మి జిల్లాలోని చాలా మంది తమ పిల్లలను విదేశాల్లో చదువుకునేందుకు పంపించారు. అదే ఇపుడు వారి పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు వారి శక్తికి మించి అప్పులు చేయాల్సి వస్తోంది. కొంతమంది ఒంటిపై నగలు అమ్ముకున్నా పూర్తి ఫీజుకు చాల లేదు. అప్పులకు వడ్డీలు కట్టలేక, మిగతా డబ్బులు సర్దలేక నరకయాతన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. విద్యార్థులు, తల్లిదండ్రుల గోడు వినే నాథుడే లేడు. జిల్లాలో ఆయా సామాజిక వర్గాల సంక్షేమ శాఖ అధికారులను అడిగితే తమకు ఏ మాత్రం సమాచారం లేదని చెబుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరిని కలవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. విదేశాల్లో ఉన్న తమ పిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉందని, డబ్బులు కట్టకపోతే అక్కడి యూనివర్సిటీలు ఇంటికి కూడా పంపించవని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడును పట్టించుకుని పథకాన్ని అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


ఇదేం తీరు..?


ఏ ప్రభుత్వమైనా బడుగు, బలహీన, మైనారిటీ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటుంది. వారికి లబ్ధి చేకూర్చే పథకాలను గత ప్రభుత్వం తీసుకువచ్చినా కొనసాగిస్తుంది. కానీ విదేశీ విద్య పథకంపై వైసీపీ తీరు విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులకు మేలు చేసే పథకమే అయినా, టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి పక్కన పెట్టింది. ప్రభుత్వ పక్షపాత వైఖరితో విదేశాలకు వెళ్లిన, వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు కూడా నష్టం జరుగుతోంది. ఇదే ప్రభుత్వం తాము టీడీపీ ప్రభుత్వం కంటే విదేశీ విద్యకు ఎక్కువ నిధులు కేటాయిస్తామని అధికారంలోకి వచ్చిన కొత్తలో బీరాలు పలికింది. ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ అంటూ కొన్ని రోజులు హడావుడి చేసింది. ఆ తర్వాత దాని ఊసే లేదు. అధికారంలోకి రాగానే పేద ప్రజలకు మేలు చేసే పథకాన్ని తీసేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి నెమ్మదిగా పథకాన్ని విస్మరించిందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. 


గత ప్రభుత్వ హయాంలో..


విదేశాల్లో ఉన్నత విద్యను చదవాలని అనుకునే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు టీడీపీ ప్రభుత్వం 2017లో ‘విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని ప్రారంభించింది. డబ్బు లేని కారణంగా వారి చదువులు ఆగిపోకూడదని భావించింది. ఈ పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలు అందించాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.15 లక్షలకు పెంచింది. విదేశీ చదువుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన విద్యార్థులకు విడతల వారీగా ఈ మొత్తాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంది. విమాన చార్జీలను కూడా ప్రభుత్వమే భరించింది. ఈ మొత్తం సరిపోకుంటే ప్రభుత్వ పూచీకత్తుపై బ్యాంకులు రుణం ఇచ్చేలా ఏర్పాటు చేసింది. దీంతో చాలామంది విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 66 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో మైనారిటీ విద్యార్థులు 28 మంది, బీసీ విద్యార్థులు 33 మంది, ఎస్టీ విద్యార్థులు ఐదుగురు ఉన్నారు. ఎస్టీ విద్యార్థులకు రెండు విడతలకు సంబంధించి మొత్తం డబ్బులు విడుదల చేశారు. బీసీ వర్గానికి చెందిన 10 మంది విద్యార్థులకు మొదటి విడతలో రూ.55 లక్షలు, రెండో విడతలో 10 మందికి రూ.40.49 లక్షల మొత్తం రూ.95.49 లక్షలు విడుదల చేసింది. మైనారిటీ వర్గానికి చెందిన 8 మందికి మొదటి, రెండో విడతలో కలిపి రూ.65 లక్షలు విడుదల చేసింది. మిగిలిన డబ్బులు విడుదల చేద్దామని టీడీపీ ప్రభుత్వం అనుకునేలోపు ఎన్నికలు వచ్చాయి. దీంతో మిగిలిన వారిలో చాలా మందికి పథకం ఫలాలు అందలేదు. ఆ తరువాత అధికారం చేపట్టిన వైసీపీ.. మొత్తం పథకాన్ని మూలన పడేసింది.

Updated Date - 2021-11-28T06:34:07+05:30 IST