టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పట్టించుకోని ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-07-31T05:30:00+05:30 IST

సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల ఆశలను రాష్ట్ర ప్రభుత్వం చిదిమేసింది.

టిడ్కో ఇళ్ల నిర్మాణాలను  పట్టించుకోని ప్రభుత్వం

ఎన్నాళ్లీ వివక్ష..?

మూడేళ్లుగా తప్పని ఎదురుచూపులు.. 

అద్దె ఇళ్లలో లబ్ధిదారులు

అనంతపురం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల ఆశలను రాష్ట్ర ప్రభుత్వం చిదిమేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఆ వర్గాల ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు టిడ్కో ఇళ్ల సముదాయానికి శ్రీకారం చుట్టింది. ఆ మేరకు జిల్లాలోని అనంతపురం కార్పొరేషనతో పాటు తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, గుత్తి మున్సిపాలిటీల్లోనూ, పామిడి నగర పంచా యతీలోనూ టిడ్కో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. వీటి పరిధిలో దాదాపు 11996 ఇళ్ల నిర్మాణాల సముదాయాల పనులను వేగవంతం చేశారు. ఈలో పు రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరింది. కాగా... అప్పటికే కొన్ని ప్రాంతాల్లో 80 శాతం ఇళ్లు పూర్తికాగా... మరికొన్ని మున్సిపాలిటీల పరిధిలో దాదాపు 60 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి సొంతింటి కలను సాకారం చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా... పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో గృహ సముదాయాలు ముళ్ల కంపలు, వర్షపునీరు నిలబడి అధ్వానంగా తయారయ్యాయి. సామగ్రికి తుప్పుపడుతోంది. ఏదీ ఏమైనప్పటికీ ప్రభుత్వం చూపుతున్న వివక్షపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.




ఏపుగా ముళ్ల పొదలు

-అనంతపురం నగర శివారులో 5184 మంది లబ్ధిదారులకు టిడ్కో ద్వారా ఇళ్లను మంజూరు చేశారు. ఆ మేరకు గత ప్రభుత్వం నిర్మాణాలను వేగవంతంగా చేపట్టింది. మరో 30 శాతం పనులు పూర్తిచేస్తే లబ్ధిదారులకు సొంతింటి కల సాకారమయ్యేది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను ఆపేశారు. నాటి నుంచి నేటి వరకూ ఒక్క ఇటుక కూడా పడలేదు. ముళ్ల పొద ల మధ్య మూడేళ్లుగా మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. 


పునాదులకే పరిమితం..

- రాయదుర్గం పట్టణంలో 1008 మంది లబ్ధిదారుల కోసం టిడ్కో ద్వారా ఇళ్లను నిర్మించేందుకు రూ. 45 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 21 బ్లాక్‌లుగా విభజించి ఒక్కొక్క బ్లాక్‌లో 48 ఇళ్లను నిర్మిస్తోంది. కానీ నిర్మాణం మొదలుపెట్టి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. అదేవిధంగా ఇప్పటివరకు నిర్మించిన వాటిలో కొన్ని బ్లాకులు పునాదుల దశలోనే వున్నాయి. శిథిలమైన పిల్లర్ల కడ్డీలు దర్శనమిస్తున్నాయి. డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. 


దిష్టిబొమ్మల్లా...

- తాడిపత్రి పట్టణ సమీపంలోని ఆర్డీటీకాలనీలో టీడీపీ హయాంలో ప్రారంభమైన టిడ్కో ఇళ్లు ఇప్పటి వరకూ పూర్తికాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా... ఒక్క టిడ్కో ఇల్లు పూర్తి చేయలేదు. టీడీపీ హయాంలో మొత్తం 5184 ఇళ్లకు శంకుస్థాపన చేయగా ఫేస్‌-1 కింద 2304, ఫేస్‌-2 కింద 2880, ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఫేస్‌-1 కింద 1800, ఫేస్‌-2 కింద 1700 శ్లాబ్‌లు వేశారు. అప్పటి నుంచి పనులు చేపట్టకపోవడంతో దిష్టిబొమ్మల్లా కనిపిస్తున్నాయి. 


అరకొరగానే..

- గుత్తిలో 384 మంది టిడ్కో లబ్ధిదారుల్లో కేవలం 98 మందికి తగినన్ని ఇళ్లను నిర్మిస్తూ, మిగతా 286 మందికి ప్రభుత్వం మొండిచేయి చూపడానికి సిద్ధమైంది. గుత్తి పట్టణ శివారులోని నేమతాబాద్‌ రహదారిలో టిడ్కో గృహనిర్మాణాలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో 384 మంది లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇంటి కోసం డిపాజిట్‌ చెల్లించిన 286 మంది లబ్ధిదారుల ఆశలు గల్లంతుచేశారు. 


తుప్పు పట్టిన కడ్డీలు

- గుంతకల్లు పట్టణంలోని దోనిముక్కల రోడ్డులో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 4160 మంది లబ్ధిదారులు సింగిల్‌, డబుల్‌ బెడ్‌ రూంలకు దరఖాస్తు చేసుకున్నారు. టీడీపీ హయాంలో పనులు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. 


Updated Date - 2022-07-31T05:30:00+05:30 IST