Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీకాలో కువైత్‌ ప్రవాసీయులపై వివక్ష!

  • అక్కడి జనాభాలో 70% సేవల్లో విదేశీయులే
  • డ్రైవర్లుగా, ఇంటి పనివాళ్లుగా, పిల్లల సంరక్షకులుగా పనుల్లో
  • 2.38 లక్షల మంది ప్రవాసీయుల అర్జీ..
  • 18వేల మందికే  వ్యాక్సిన్‌ అర్హత 

దుబాయ్‌ (యూఏఈ), ఏప్రిల్‌ 4: కరోనా నేపథ్యంలో కువైత్‌లో ప్రవాసీయులకు తలనొప్పి వచ్చిపడింది. కొవిడ్‌-19 నిరోధక టీకా వేయించుకునేందుకు వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీకా దరఖాస్తుదారు ప్రవాసీయులైతే పెద్దగా అనుమతి ఇవ్వడం లేదు. ఎందుకంటే వ్యాక్సినేషన్‌లో అక్కడి ప్రభుత్వం తమ పౌరులకే తొలి ప్రాధాన్యాన్ని ఇస్తోంది. బతుకుదెరువు కోసం కువైత్‌కు వెళుతున్నవారిలో దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. పిల్లలను సంరక్షించడం, ఇళ్లను శుభ్రం చేయడం, కార్లను నడపడం, కిరాణా కొట్ల నుంచి సామాను తేవడం వంటి అన్ని పనుల్లో అక్కడి పౌరులు ప్రవాసీ పనివాళ్ల మీదే ఆధారపడుతున్నారు. కిరాణాషాపుల్లో, కాఫీ షాపుల్లోనూ విదేశీయులు పని చేస్తుంటారు. ఆ రకంగా అక్కడి జనాభాలోని 70శాతం ప్రజల సేవల్లో ప్రవాసీయులదే కీలక పాత్ర. అలాంటిది వారిని అక్కడి ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు దూరం పెడుతోంది. టీకా రిజిస్ట్రేషన్‌ కోసం గత ఏడాది డిసెంబరులో అక్కడ ప్రత్యేక సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్య సిబ్బంది, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి టీకా వేయడంలో ప్రాధాన్యమిస్తామని అందులో ప్రకటించారు. అయితే ఈ ప్రకటనలో వాస్తవం లేదని కొన్ని వారాల్లోనే తేలిపోయింది. వయసు, ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా కువైత్‌ జాతీయులకే ప్రాధాన్యమిస్తున్నారు.

దేశ పౌరులకు ఆరురెట్లు ఎక్కువగా.. 

ప్రవాసీయులతో పోల్చితే తమ పౌరులకు ఆరు రెట్లు ఎక్కువగా టీకాలు వేశామని ఈ ఏడాది ఆరంభంలో అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అప్పటి వరకు 2.38 లక్షల ప్రవాసీయులు టీకా కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 18వేల మందికే టీకా కోసం అనుమతులు లభించాయి. అందులోనూ ఎక్కువగా వైద్యులు, నర్సులు, ఆయిల్‌ కంపెనీలో పనిచేసే సిబ్బందే ఉన్నారు. అదేసమయంలో 1.19 లక్షల కువైత్‌ వాసులకు టీకా వేశారు.  తన తండ్రి వయసు 62 ఏళ్లు అని, ఆయన మధుమేహంతో బాధపడుతున్నారని.. ఇప్పటికీ వ్యాక్సిన్‌ వేయించడం కుదరలేదని భారత సంతతికి చెందిన యువతి వాపోయారు. ‘కువైత్‌ వాసుల్లో నాకు పరిచయం ఉన్నవారంతా ఇప్పటికే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు’ అని ఆమె చెప్పారు. ‘టీకా ఎప్పుడు వేస్తారా? అని మేమంతా ఎదురు చూస్తున్నాం’ అని అక్కడ ఇళ్లలో పనిచేసే శ్రీలంకకు చెందిన 55 ఏళ్ల మహిళ పేర్కొన్నారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement