Abn logo
Mar 4 2021 @ 01:32AM

భూముల సర్వేలో అపశ్రుతి


అదుపు తప్పి కొండపై పడి... ముక్కలైన డ్రోన్‌ కెమెరా

రావికమతం మండంల గుమ్మాళ్లపాడులో ఘటన

నిలిచిపోయిన సర్వే పనులు
రావికమతం, మార్చి 3: మండలంలోని గుమ్మాళ్లపాడులో భూముల సమగ్ర రీసర్వే పనులకు వినియోగిస్తున్న డ్రోన్‌... బోడికొండపై పడి ధ్వంసమైంది. డ్రోన్‌ని ఆపరేట్‌ చేస్తున్న సిబ్బంది, సర్వే బృందం, అధికారులు ఆందోళన చెందారు. బోడికొండపైకి వెళ్లి డ్రోన్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

భూముల సమగ్ర రీసర్వే కోసం రావికమతం మండలం గుమ్మాళ్లపాడు గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మొత్తం 60 సర్వే నంబర్లలో 303 ఎకరాల భూమి వుంది. బుధవారం తహసీల్దార్‌ కనకారావు, ఎంపీడీవో రామచంద్రమూర్తి, పంచాయతీ సర్పంచ్‌ బంటు సన్యాసినాయుడు, తదితరులు డ్రోన్‌తో సర్వే పనులను ప్రారంభించారు. డ్రోన్‌ సుమారు అర గంట పాటు బాగానే పనిచేసింది. అనంతరం మెలికలు తీరుగుతూ సమీపంలోని బోడి కొండపై పడింది. దీంతో డ్రోన్‌ ఆపరేటర్‌, సర్వే ఆఫ్‌ ఇండియా అధికారి గోవిందరాజు, మండల సర్వేయర్‌ హరీశ్‌, ఇతర అధికారులు కలిసి మండుటెండలో కొండపైకి పరుగులు తీశారు. ధ్వంసమైన డ్రోన్‌, కెమెరా ముక్కలను తీసుకుని తిరుగుముఖం పట్టారు. దీంతో సర్వే పనులు నిలిచిపోయాయి. డ్రోన్‌ ఎందుకు పడిపోయిందో కారణం తెలియదని అధికారులు అంటున్నారు.  


Advertisement
Advertisement
Advertisement