‘రామగుండం’ బంద్‌!

ABN , First Publish Date - 2022-05-30T08:47:27+05:30 IST

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) షాక్‌ ఇచ్చింది.

‘రామగుండం’ బంద్‌!

  • ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేయండి
  • రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశం
  • కాలుష్యంపై ప్రజల ఆందోళనలు 
  • టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఫిర్యాదు
  • విచారణ జరిపి నిలిపివేతకు పీసీబీ ఆదేశం


గోదావరిఖని, మే 29: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) షాక్‌ ఇచ్చింది. కాలుష్య నియంత్రణ చర్య లు చేపట్టకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే కారణంతో పరిశ్రమలో ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతోపాటు టీఆర్‌ఎ్‌సకు చెందిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు పీసీబీ సభ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. గతంలో మూతపడిన ఎఫ్‌సీఐ స్థానంలో ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగం గా రూ.6,330కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సంస్థ రోజూ 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియాను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన నేషనల్‌ ఫర్టిలైజర్స్‌, ఈఐఎల్‌, గెయిల్‌, ఎఫ్‌సీఐతోపాటు డెన్మార్‌కు చెందిన హల్దర్‌ టాప్స్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నాయి. గత ఏడాది మార్చిలో ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే ఉత్పత్తి ప్రారంభంలోనే అమ్మోనియా లీక్‌ కావడంతో వివాదం చెలరేగింది. దీనిపై విచారణ జరిపిన కాలుష్య నియంత్రణ మండలి వివిధ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. కానీ, షరతుల ప్రకారం ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో అమ్మోనియా లీకేజీ నివారణ చర్యలను పూర్తి స్థాయిలో చేపట్టడం లేదు. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేసి ప్లాంటేషన్‌కే వాడతామని చెప్పి.. పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండానే గోదావరి నదిలోకి వదులుతున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల బ్యారేజీ నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. 


ఎమ్మెల్యే ఫిర్యాదుతో..

ప్రజల ఆందోళనల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎ్‌సకు చెందిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆర్‌ఎ్‌ఫసీఎల్‌పై మార్చి 22న కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో పీసీబీకి చెందిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ విచారణ జరిపి కాలుష్య నియంత్రణకు సంబంధించి సరైన చర్యలు చేపట్టడం లేదని నివేదిక ఇచ్చింది. దీనిపై ఈ నెల 26న హైదరాబాద్‌లో విచారణ నిర్వహించగా.. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు మూడు నెలలు, నీటి శుద్ధికి జీరో లెవల్‌ డిశ్చార్జి విధానం అమలు చేసేందుకు ఏడాది గడువు కావాలని ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ యాజమాన్యం కోరింది. దీనిని తిరస్కరించిన పీసీబీ.. కాలుష్య నియంత్రణపై చర్యలు చేపట్టే వరకు పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది. ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ సమర్పించిన రూ.25 లక్షల బ్యాంక్‌ గ్యారంటీలో 50 శాతాన్ని (రూ.12.5 లక్షలను) జప్తు చేస్తున్నట్టు పేర్కొంది. దీంతో పీసీబీ ఆదేశాలపై ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ యాజమాన్యం శనివారం రాత్రే కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖను సంప్రదించింది. సోమవారం పరిశ్రమల శాఖను సంప్రదించే అవకాశం ఉంది. త్వరలో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుండడంతో యూరియా ఉత్పత్తి అవసరాల దృష్ట్యా మినహాయింపు కోరే అవకాశాలున్నాయి. కాగా, పీసీబీ ఆదేశాలను పాటిస్తామని ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ పేర్కొంది. అయితే ఒకేసారి ఉత్పత్తి నిలిపివేయడం సాధ్యం కానందున.. ఆదివారం 50 శాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేశామని, సోమవారానికల్లా ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తామని తెలిపింది. 

Updated Date - 2022-05-30T08:47:27+05:30 IST