Abn logo
Sep 21 2021 @ 00:56AM

యురేనియం అన్వేషణ ప్రతిపాదనల నిలిపివేత

  • రాష్ట్ర ప్రభుత్వ లేఖతో కేంద్రం నిర్ణయం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, సర్వే కోసం అనుమతుల ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ శాఖ నిలిపివేసింది. ఈ ప్రతిపాదనలు తాము చేయలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నల్లమల అటవీ ప్రాంతంలో అన్వేషణకు అటవీ అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు గతంలో అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ సంస్థ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.


ఆ ప్రతిపాదనలను పరిశీలించిన పర్యావరణ శాఖలోని అటవీ సలహా కమిటీ (ఎఫ్‌ఏసీ).. రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు నిర్ణయంతోపాటు ఈ ప్రాజెక్టును అనుమతించే విషయంపై స్పష్టమైన సిఫారసును అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి గత ఏడాది సూచించింది. అయితే, యురేనియం అన్వేషణకు తాము సిఫారసు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం సమాధానమివ్వడంతో ఈ ప్రతిపాదనలను నిలిపివేస్తున్నామని ఎఫ్‌ఏసీ ప్రకటించింది.