‘కమలం’లో కట్టుతప్పిన క్రమశిక్షణ!

ABN , First Publish Date - 2021-05-08T09:40:13+05:30 IST

క్రమశిక్షణ గల కమల దళంలో కొంతమంది నాయకులు గీత దాటుతున్నారా? ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఇంకా బీజేపీ నిబంధనలు తెలియడంలేదా.

‘కమలం’లో కట్టుతప్పిన క్రమశిక్షణ!

మోత్కుపల్లి వ్యాఖ్యలపై జాతీయ నాయకత్వం ఆరా!

హైదరాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణ గల కమల దళంలో కొంతమంది నాయకులు గీత దాటుతున్నారా? ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఇంకా బీజేపీ నిబంధనలు తెలియడంలేదా?.. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ‘లింగోజిగూడ’ వ్యవహారం సమసిపోకముందే పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై జాతీయ నాయకత్వం ఆరా తీస్తోంది. గీత దాటితే ఎవరినైనా ఉపేక్షించవద్దని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆదేశించినట్లు పార్టీ వర్గాల సమాచారం. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ నాయకత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని, దీంతో, వీటికి అనుగుణంగానే స్పందిస్తున్నామని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మాజీమంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యవహారంపై మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతోంది. బీసీ నేతకు మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌ బొమ్మ పెట్టుకుని పూజ చేయాలని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని, ఈటల తీరు సరికాదని మోత్కుపల్లి విమర్శించిన సంగతి తెలిసిందే.


రాష్ట్ర పార్టీ నాయకత్వమంతా ఒకవైపు కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతున్న సందర్భంలో.. ఆయనను సమర్థించేలా మోత్కుపల్లి వ్యాఖ్యలు చేయడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.  పార్టీ నిబంధనల ప్రకారం వ్యక్తిగత విమర్శలు చేయమని, మోత్కుపల్లి అలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. తనకు తెలిసి మోత్కుపల్లి వంటి సీనియర్‌ నేత పార్టీ నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడరని, ఆయనకు పార్టీ లైన్‌ గురించి తెలిసి ఉండకపోవచ్చని మరో నేత అన్నారు. బహుశా ఆయనకు, ఈటలకు మధ్య ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయేమో అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు.. లింగోజిగూడ డివిజన్‌ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ బృందం, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమైన ఘటనపై రాష్ట్ర పార్టీ ఒక నివేదికను జాతీయ నాయకత్వానికి అందించినట్లు పార్టీ ముఖ్యనేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. మోత్కుపల్లి వ్యవహారాన్ని కూడా శుక్రవారమే జాతీయ పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. 


Updated Date - 2021-05-08T09:40:13+05:30 IST