కాల పరిమితి ముగిసిన చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-29T05:57:42+05:30 IST

హుజూర్‌నగర్‌ మండలంలో అధికార పార్టీ నాయకుల ఆధిపత్య పోరులో సామాన్యులకు ఆర్థికంగా తోడ్పాటుగా ఉండే ముఖ్యమంత్రి సహా య నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కులు చెల్లుబాటుకాలేదు.

కాల పరిమితి ముగిసిన చెక్కుల పంపిణీ
చెల్లని చెక్కు పంపిణీ చేసిన నాయకులు

నాయకుల ఆధిప్యత పోరులో ప్రభుత్వ సాయానికి దూరం

ఇబ్బందుల్లేమీ ఉండవు; తేదీలు మార్పించుకోవచ్చు

హుజూర్‌నగర్‌, సెప్టెంబరు 28 : హుజూర్‌నగర్‌ మండలంలో అధికార పార్టీ నాయకుల ఆధిపత్య పోరులో సామాన్యులకు ఆర్థికంగా తోడ్పాటుగా ఉండే ముఖ్యమంత్రి సహా య నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కులు చెల్లుబాటుకాలేదు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. హుజూర్‌నగర్‌ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన కర్నె కు మారికి రూ.20 వేలు, సారెడ్డి చైతన్యరెడ్డికి రూ.16 వేల సీఎంఆర్‌ఎ్‌ఫ్‌ చెక్కులు మంజూరయ్యాయి. కాగా చెక్కులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అధికార పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు, స్థానిక ఎంపీటీసీ గోపిరెడ్డి జూన్‌ 25న తీసుకెళ్లారు. లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వకుండా ఈ నెల 25న గ్రామశాఖ ఆధ్వర్యంలో వాటిని పంపించారు. దీంతో వారు చెక్కులు తీసుకుని బ్యాంకుకు వెళ్లగా, అప్పటికే చెక్కు గడువు ముగిసిందని, చెక్కులు చెల్లవని బ్యాంక్‌ అధికారులు తెలిపారు.

వర్గపోరుతో పంపిణీలో జాప్యం

గ్రామ ఎంపీటీసీ గోపిరెడ్డి, సారెడ్డి భాస్కర్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పో రు నడుస్తోంది. గత ఎంపీటీసీ ఎన్నికల వరకు ఒక్కటిగా ఉన్న గోపిరెడ్డి, సా రెడ్డి భాస్కర్‌రెడ్డి పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో వర్గాలుగా విడిపోయా రు. అనంతరం భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సర్పంచ్‌ అన్నెం శిరీషాకొండారెడ్డి, టీడీపీ నాయకులు రెక్కల శంభిరెడ్డి, కుందూరు పెద్ద కోటిరెడ్డి, వెంకటాచారి, భూపాల్‌రెడ్డిలు టీఆర్‌ఎ్‌సలో చేర్పించారు. దీంతో ఎంపీటీసీకి, భాస్కర్‌రెడ్డికి మధ్య మరింత దూరం పెరిగింది. సారెడ్డి భాస్కర్‌రెడ్డికి మద్దతుగా ఇటీవల పార్టీలో చేరిన నాయకులతో పాటు పార్టీ మొదటి నుంచి గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేసిన నందిరెడ్డి సైదిరెడ్డి, గోపిరెడ్డి రాజమోహన్‌రెడ్డి కలిసి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్‌ 25న వేపలసింగారానికి ఏడు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరు కాగా, తనకు అనుకూలంగా ఉన్న ఐదుగురి కి ఎంపీటీసీ చెక్కులు పంపిణీ చేశారు. భాస్కర్‌రెడ్డి వర్గానికి చెందిన చైతన్యరెడ్డి, కర్నె కుమారి చెక్కులు నిలిపేశారు.  కాగా కర్నె కుమారి టీఆర్‌ఎ్‌సకు చెందిన పీఏసీఎస్‌ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. నెలరోజుల క్రితం ఎమ్మెల్యే సైదిరెడ్డి వేపలసింగారంలో పీఏసీఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి రాగా, లబ్ధిదారులైన కర్నె కుమారి, చైతన్యరెడ్డి కుటుంబసభ్యులు చెక్కుల పంపిణీ జాప్యంపై ఫిర్యాదుచేశారు. ఎమ్మెల్యే వెంటనే చెక్కులు ఇవ్వాలని ఆదేశించినా నెల రోజుల తరువాత చెక్కులు ఇచ్చినట్లు కర్నె కుమారి తెలిపారు. సొంత పార్టీకి చెందిన లబ్ధిదారులకు కూడా నాయకుల ఆధిపత్య పోరులో ప్రభుత్వ సాయం దూరం అయ్యేలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిష్టానం నాయకుల మధ్య సమన్వయం కుదర్చకపోవడంతో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా చెక్కులు ఆలస్యంగా వచ్చాయని, కాల పరిమితి ముగిసినా తిరిగి చెక్కులపై డేటు మార్పించుకోవచ్చని ఎంపీటీసీ గోపిరెడ్డి తెలిపారు. చెక్కుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. 

Updated Date - 2022-09-29T05:57:42+05:30 IST