కలసిరాని 2021.. YS Jagan- Sharmila మధ్య విభేదాలు

ABN , First Publish Date - 2021-12-31T07:03:09+05:30 IST

కాలగమనంలో ఓ వసంతం కలసిపోనుంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు అర్ధరాత్రి ఎన్నో ఆశలు.. ఆలోచనలతో 2021లో అడుగుపెట్టాం. ఈ ఏడాది వస్తూ.. వస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను తీసుకొచ్చింది.

కలసిరాని 2021.. YS Jagan- Sharmila మధ్య విభేదాలు
పులపత్తూరును ముంచెత్తిన చెయ్యేరు వరద

  • కడప గడపను వెంటాడిన విపత్తులు
  • వరద విధ్వంసం.. కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు
  • 41 మంది మృతి, రూ.1,705 కోట్ల ఆస్తులు నష్టం
  • మైనింగ్‌లో పేలుళ్లకు 12 మంది మృత్యువాత
  • 650 మందిని కబళించిన కరోనా మహమ్మారి
  • బడ్జెట్‌ కేటాయింపులు అంతంతే.. ముందడుగు వేయని పారిశ్రామిక ప్రగతి


(కడప-ఆంధ్రజ్యోతి): కాలగమనంలో ఓ వసంతం కలసిపోనుంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు అర్ధరాత్రి ఎన్నో ఆశలు.. ఆలోచనలతో 2021లో అడుగుపెట్టాం. ఈ ఏడాది వస్తూ.. వస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను తీసుకొచ్చింది. రాజకీయంగా ఎందరికో పదవులు ఇచ్చింది. ఆ ఒక్కటి తప్పా ఏడాదంతా ప్రజలకు కష్టాలు.. కన్నీళ్లే. పారిశ్రామిక ప్రగతి పట్టాలెక్కలేదు. కరోనాతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మహమ్మారి నుంచి కాస్త ఊరట పొంది సాధారణ జనజీవనం ఆరంభం కాగానే జవాద్‌ తుఫాన నిలువునా ముంచేసింది. వరద సృష్టించిన విధ్వంసానికి ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో చెయ్యేరు నదితీర గ్రామాలకు 2021 చీకటి సంవత్సంగానే మిగిలింది. అన్నదాతలు కుదేలు అయ్యారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బ్రహ్మంగారి మఠం 11వ పీఠాధిపతి శివైక్యం చెందారు. జిల్లాలో రాజకీయ దిగ్గజ కుటుంబం వైఎస్‌ ఇంట విభేదాలు మొదలయ్యాయి.. ఎన్నో కొంగొత్త ఆశలతో.. ఎన్నో ఆంకాక్షలతో 2022కి ఆహ్వానం పలుకుతున్న వేళ.. 2021 మిగిల్చిన సంఘటనలు, ఎదురైన సవాళ్లు, అధిగమించిన విపత్తుల సమాహారాలను మరోసారి మననం చేసుకుందాం.


స్థానిక ఎన్నికలతో వచ్చి..

జనవరి 9న 807 పంచాయతీలు, 2,700 వార్డులకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు జారీ చేసింది.  ఫిబ్రవరి 9తో మొదలై 21వ తేదీ వరకు నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి. అలాగే పురపోరుకు సంబంధించి 2020 మార్చి 15న ఆగిన ఎన్నికలు 2021 మార్చి 10న జరిగాయి. కడప కార్పొరేషన, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాయచోటి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లో 135 వార్డులకు పోలింగ్‌ జరిగింది. ఏప్రిల్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అక్టోబరు 30న బద్వేలు అసెంబ్లీ నియోజవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది.


బడ్జెట్‌ కేటాయింపుల్లో అన్యాయమే!

మే 20న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన 2021-22 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన కింద రూ.10,388.23 కోట్లతో చేపట్టే ఏడు నూతన ప్రాజెక్టులకు సీఎం జగన ఇప్పటికే శంకుస్థాపన చేసినా.. బడ్జెట్‌ కేటాయింపులకు నోచుకోలేదు. జిల్లా ప్రాజెక్టులకు రూ.500.41 కోట్లు కేటాయిస్తే.. పనులు, భూసేకరణ, పునరావాసానికి రూ.399 కోట్లకు మించడం లేదు. వైఎ్‌సఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌, పులివెందుల ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (పాడా), కొప్పర్తి మెగా ఇండసీ్ట్రయల్‌ పార్కుకు అరకొర కేటాయింపులు చేశారు.


ఈ ప్రాజెక్టులు మొదలయ్యేదెన్నడో..?

జిల్లాను సస్యశామలం చేయాలనే లక్ష్యంగా రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషనలో భాగంగా మొత్తం ఏడు ప్రాజెక్టులకు రూ.10,388.23 కోట్లతో సీఎం శంకుస్థాన చేశారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థలు సర్వేలతో కాలం గడిపేస్తున్నాయి. నిధుల కొరత వేధిస్తుండడం వల్ల ఈ ప్రాజెక్టులు కొత్త ఏడాదిలోనైనా ప్రారంభం అవుతాయా..? అన్నది ప్రశ్నార్థకమే.


అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు

అన్నాచెల్లెలు సీఎం జగన్, షర్మిల మధ్య 2021 దూరం పెంచిందనే చెప్పాలి. మార్చి 15న దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి వర్ధంతికి సీఎం జగన తల్లి విజయలక్ష్మి, చెల్లెలు వైఎస్‌ షర్మిల హాజరయ్యారు. తెలంగాణలో నూతన రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు షర్మిల ప్రకటించడంతో వైసీపీ నేతలు ఆమెకు దూరంగా ఉన్నారు. జూలై 8న దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజున ఉదయం షర్మిల, సాయంత్రం జగన వేరువేరుగా నివాళి అర్పించారు. సెప్టెంబరు 2 వైఎ్‌సఆర్‌ వర్ధంతి రోజున సీఎం జగన, షర్మిల పక్కపక్కనే కూర్చొని ప్రార్థనలు నిర్వహించినా.. ఇద్దరూ మాట్లాడుకోకపోవడం కొసమెరుపు. డిసెంబరు 24న వెఎస్‌ ఘాట్లో నివాళి, కుటుంబ సభ్యులతో క్రిస్మస్‌ సంబరాల్లో పాల్గొనడానికి తల్లి విజయలక్ష్మితో కలసి 23వతేది రాత్రి 7.30 గంటలకు షర్మిల ఇడుపులపాయకు చేరుకున్నారు. వేడుకల్లో పాల్గొనకుండానే రాత్రికిరాత్రే షర్మిల హైదరాబాదుకు వెళ్లిపోయారు. అన్న చెల్లెలి మధ్య ఘర్షణ జరగడం వల్లే వెళ్లిపోయారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 24న విజయలక్ష్మి, తనయుడు సీఎం జగన వేరువేరుగా నివాళి ఆర్పించడం కొసమెరుపు.


‘వ్యథ’సాయమే..!

సేద్యం నమ్ముకున్న కష్టజీవులకు 2021 కనికరం చూపలేదు. వరుస విపత్తులతో అన్నదాత కుదేలు అయ్యారు. నవంబరు 16 నుంచి 19వ తేది వరకు జవాద్‌ తుఫాన కారణంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయారు. నవంబరు సాధారణ వర్షపాతం 89.3 మి.మీలు కాగా.. 332.7 మి.మీలు నమోదు అయింది. చెయ్యేరు, పాపాఘ్ని, చిత్రావతి, పెన్నా నదులు ఉప్పొంగాయి. పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. 1,81,973.56 హెక్టార్లలో ఖరీఫ్‌, రబీ పంటలు దెబ్బతిని రూ.356.95 కోట్ల నష్టం జరిగిందని అంచనా. ఉద్యాన పంటలు 17,708.80 హెక్టార్లలో దెబ్బతిని రూ.110.22 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. వాస్తవంగా రూ.2,500 కోట్లకు పైగా నష్టం జరిగిందని రైతుల ఆవేదన. అంతేకాదు.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఓ పక్క ప్రకృతి విపత్తులు.. మరో పక్క తగ్గిన దిగుబడి.. ఇంకో వైపున గిట్టుబాటు ధరలు లేక ఆర్థికంగా చితికిపోతున్న రైతులపై ప్రభుత్వం ఎరువులు, పురుగుమందులు, పెట్రో ధరలు పెంచి మరింత భారం మోపింది. 2022లోనైనా వ్యవ‘సాయం’ కావాలని ఆశిస్తున్నారు. 


పట్టాలెక్కని పారిశ్రామిక ప్రగతి

- రాయలసీమ ఉక్కు పరిశ్రమ (వైఎస్సార్‌ స్టీల్‌ ప్లాంట్‌) 2021లో నిద్యోగులకు నిరాశే మిగిల్చింది. రూ.12-15 వేల కోట్ల పెట్టుబడి, దశల వారీగా 3 మిలియన టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ నిర్మాణానికి 2019 డిసెంబరు 23న సీఎం వైఎస్‌ జగన శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం పర్యావరణ అనుమతులు సైతం ఇచ్చింది. కొద్ది మేర ప్రహరీగోడ తప్ప ఇప్పటి వరకూ పనులు ప్రారంభం కాలేదు.

- జూన 30న కొప్పర్తి పారిశ్రామికవాడ కేంద్రంగా రెండు పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన బోర్డు ఆమోదం తెలిపింది. రూ.25 వేల కోట్ల పెట్టుబడి, 2.50 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా 6,500 ఎకరాల విస్తీర్ణంలో మెగా ఇండసీ్ట్రయల్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైఎ్‌సఆర్‌ ఎలకా్ట్రనిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌, జగనన్న మెగా ఇండసి్ట్రయల్‌ పార్క్‌, వైఎ్‌సఆర్‌ ఎస్‌ఎంఈ పార్కుకు డిసెంబరు 23న సీఎం జగన శంకుస్థాపన చేశారు. శిలాఫలకాలకే పరిమితం కాకుండా 2022లో పనులకు నాంది పలకాలని నిరుద్యోగులు ఆశతో ఆహ్వానం పలుకుతున్నారు.


నేరాలు.. ఘోరాలు

- మే 8న కలసపాడు మండలం మామిళ్లపల్లెకు 3 కి.మీల దూరంలోని ముగ్గురాళ్ల (బైరటీస్‌) క్వారీలో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 12 మంది కార్మికులు, వాహన డ్రైవర్‌ మృత్యువాత పడ్డారు. ఈ క్వారీని అధికార వైసీపీ నాయకుడు నాగేశ్వరరెడ్డి నిర్వహిస్తున్నారు. అవసరమైన మందుగుండు సామాగ్రిని పులివెందులకు చెందిన వైఎస్‌ ప్రతా్‌పరెడ్డి లైసెన్సడ్‌ స్టాక్‌ పాయింట్‌ నుంచి ఆ రోజు బొలేరో వాహనంలో దిగుమతి చేసుకున్నారు. క్వారీ లీజ్‌ ప్రదేశంలో దింపుతుండగా ఈ ఘటన జరిగింది. 

- జూన 15న పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో వైసీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొమ్మా శివప్రసాద్‌రెడ్డి (60) ఎదురింట్లోని భూమిరెడ్డి పార్థసారథిరెడ్డి (45)పై లైసెన్సడ్‌ తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే శివప్రసాద్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి తన గనతో తానే కాల్చుకొని ఆత్యహత్య చేసుకున్నారు.

- జూన 30న మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సీబీఐ రంగంలో దిగింది. దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ ఎంపీ అవినాశరెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, చిన్నాన్న వైఎస్‌ మనోహర్‌రెడ్డి సహా పలువురుని విచారించింది. వాచమన రంగన్న, డ్రైవర్‌ షేక్‌ దస్తగిరిలను కోర్టులో హాజరు పరచి వాంగ్మూలం నమోదు చేయించింది. ఎంపీ అవినాశరెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సహా యాదాటి సునీల్‌యాదవ్‌, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలను ఆరెస్టు చేశారు. 2021లో వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. 

- జూలై 27న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన స్వంత నియోజకవర్గంలో సొంత పార్టీ వైసీపీలోనే ఆధిపత్య పోరుకు గ్రామ సర్పంచి బలయ్యారు. లింగాల మండలం కోమనూతల గ్రామం వైసీపీ సర్పంచి గడ్డం మునెప్ప (55)ను గ్రామ సమీపంలో ప్రత్యర్థి వైసీపీ వర్గీయులే మోటర్‌ బైక్‌తో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో వెంటాడి అతికిరాతకంగా హతమార్చారు. 

- ఆగస్టు 8న స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషనలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగు చూసింది. కడప రూరల్‌, అర్బన స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన ఆఫీసుల్లో డాక్యుమెంట్‌ రైటర్లు నకిలీ చలానాలు సృష్టించి రూ.కోట్లు స్వాహా చేశారు. పలువురు సబ్‌ రిజిసా్ట్రర్లు సస్పెండ్‌ అయ్యారు.

- సెప్టంబరు 3న వేముల మండలంలో యురేనియం టెయిల్‌పాండ్‌ కట్ట 10-15 మీటర్ల వెడల్పుతో కోతకు గురైంది. యురేనియం వ్యర్థాలు వర్షపు నీటిలో కలసి అరటి, చీనీ తోటల్లో చేరింది. సమీప వంక, వాగుల్లో యురేనియం వ్యర్థాలు కలిసిన వర్షపు నీరు ప్రవహించింది.


అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి

చెయ్యేరు నదితీర గ్రామాలకు 2021 చీకటి సంవత్సరం. నవంబరు 19వ తేదీ తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది. పచ్చని పంటపొలాలు, పల్లెలను ముంచేసింది. వరద రక్కసి విధ్వంసానికి పులపత్తూరు, మందపల్లి, తొగూరుపేట, రామచంద్రాపురం, గుండ్లూరు, పాటూరు, తాళ్లపాక, పాపరాజుపేట, హేమాద్రివారిపల్లి, నందలూరు సహా మొత్తం 16 గ్రామాలు సర్వం కోల్పోయాయి. పులపత్తూరు, మందపల్లి, తోగూరుపేట, రామచంద్రాపురం గ్రామాలకు జరిగిన నష్టం అంచనాలకు అందనిది. ఈ పల్లెల్లో 41 మంది మృత్యువాత పడ్డారు. 2,200 ఇళ్లు దెబ్బతింటే అందులో 475 ఇళ్లు రాళ్ల కుప్పలు, ఇసుక దిబ్బలుగా మారాయి. అక్కడ ఇళ్లు ఉన్నాయనే అనవాళ్లే లేకుండా పోయాయి. 13 వేలకు పైగా పాడి పశువులు, ఎద్దులు మృతి చెందాయి. 3,600 హెక్టార్లలో సాగు భూముల్లో ఇసుక మేటలు, అడ్డంగా కోతకు గురయ్యాయి. 860కి పైగా వ్యవసాయ విద్యుత మోటార్లు, బోర్లు వరదకు కొట్టుకుపోయాయి. కార్లు, ద్విచక్రవాహనాలు గల్లంతు అయ్యాయి. ఇంట్లో విలువైన సామాగ్రి సర్వం వరదార్పణం అయింది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులు ఎందరో. ప్రతి బాధితుడు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పైగా నష్టపోయారు. బడా రైతులు కొందరు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల దాకా నష్టపోయారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం రాజంపేట డివిజనలో రూ.500 కోట్లకుపైగా నష్టం జరిగిందని అంచనా. జిల్లా వ్యాప్తంగా వరద విలయానికి రూ.1,705 కోట్ల నష్టం జరిగిందని అధికారిక అంచనా.

Updated Date - 2021-12-31T07:03:09+05:30 IST