ఆపత్కాల సాయం వృథా

ABN , First Publish Date - 2022-05-17T06:22:06+05:30 IST

కరోనా మహమ్మారి విస్తృతంగా ప్రబలిన విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది దాతలు ముందుకువచ్చి ప్రభుత్వ ఆస్పత్రులకు లక్షల రూపాయలు విలువచేసే వైద్య పరికరాలు అందజేసి దాతృత్వం చా టుకున్నారు.

ఆపత్కాల సాయం వృథా
పేటలో ఆదానీ సంస్థ నెలకొల్పిన ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంటు

(ఆంధ్రజ్యోతి)యాదాద్రి/నల్లగొండ అర్బన్‌, సూర్యాపేట సిటీ, హుజూర్‌నగర్‌, దేవరకొండ : కరోనా మహమ్మారి విస్తృతంగా ప్రబలిన విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది దాతలు ముందుకువచ్చి ప్రభుత్వ ఆస్పత్రులకు లక్షల రూపాయలు విలువచేసే వైద్య పరికరాలు అందజేసి దాతృత్వం చా టుకున్నారు. ఆక్సీమీటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు, ప్రత్యేక బెడ్లు అందజేశారు. ఇవి కరోనా బాధితుల చికిత్సకు ఎంతో ఉపయోగపడ్డాయి. కాగా, ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో వీటి వినియోగం కూడా తగ్గింది. అయితే వీటిని ఆస్పత్రుల్లో నిర్లక్ష్యంగా మూలనపడేయడంతో విలువైన పరికరాలు తప్పుపట్టే అవకాశం ఉంది. ఒక్క భువనగిరి, దేవరకొండ ఆస్పత్రుల్లో మాత్రమే దాతలు సమకూర్చిన పరికరాలు వినియోగంలో ఉన్నాయి.


కరోనా కోరలు చాచిన సమయంలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సీమీటర్లతోపాటు ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. ఒక దశలో ఆస్పత్రి సిబ్బంది సైతం పీపీఈ కిట్లు లేక ఇబ్బందులు పడ్డారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలెటర్లు, హైప్రెజర్‌ నాజల్‌ వంటి పరికరా లు లేకపోవడంతో రోగులను హైదరాబాద్‌కు తరలించారు. కార్పొర్రేట్‌ ఆస్పత్రులు కావడంతో కరోనా బాధితులు లక్షల రూపాయలు చికిత్స కోసం వెచ్చించి ఆర్థికభారాన్ని మోశారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరికరాలు లేక బాధితులు మృత్యువాతపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఎన్‌ఆర్‌ఐలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, స్థానికులు ముందుకు వచ్చి వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని వితరణ చేశారు.


నల్లగొండ జనరల్‌ ఆస్పత్రికి సుమారు రూ.3లక్షల విలువైన వైద్య పరికరాలను దాతలు వితరణ చేసినట్లు ఆస్పత్రి రికార్డుల్లో ఉంది. ఓ ఫార్మాకంపెనీ 56 పల్స్‌ ఆక్సీమీటర్లు ఇవ్వగా, అందులో సగానికిపైగా నిరుపయోగంగా ఉన్నాయి. ఒక్కో ఆక్సీమీటర్‌ ధర రూ.1500పై చిలుకు ఉంది. ఎస్‌బీఐ బ్యాంకు 500పీపీ కిట్లు ఇవ్వగా, వాటిని కూడా మూలనపడేశారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు 20 ఇవ్వగా, వాటిని సైతం పక్కన పడేశారు. ఇవేగాక గ్లౌజులు, మాస్క్‌లు, శానిటైజర్లు, సిరంజీలు, ఐవీ సెట్లు, ఐవీ క్యాన్లు, ఎన్‌-95 మాస్క్‌లను దాతలు సమకూర్చారు. వీటన్నింటినీ స్టోర్‌ రూంలో నిర్లక్ష్యంగా పడేశారు. వీటి లో కొన్నింటి గడువు తేదీ పూర్తికావొస్తుండగా, అవి చెత్తబుట్టకు పరిమితమయ్యే ప్రమాదం ఉంది. మాస్క్‌ లు, గ్లౌజులు, శానిటైజర్ల కాలం చెల్లిపోయే పరిస్థితి నెలకొంది.


గిరిజన ప్రాంతంలో వినియోగంలో..

దేవరకొండ ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో 100 పడకలు ఉన్నాయి. కరోనా సమయంలో గత ఏడాది దా తలు 10 ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేశారు. గిరిజన ప్రాంతమైన దేవరకొండ ఆస్పత్రిలో ఇవి రోగులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో ఇక్కడి ఆస్పత్రిలో ఆక్సిజన్‌, ఐసీయూ సదుపాయంలేక రోగులు హైదరాబాద్‌, నల్లగొండకు వెళ్లేవారు. కాగా గుడుగుంట్ల బ్రదర్స్‌ సహకారంతో ఐసీ యూ బెడ్లు ఏర్పాటుకాగా, ఇవి వినియోగంలో ఉన్నాయి. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమీత్‌రెడ్డి కరోనా కిట్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేశారు. ప్రభుత్వం సైతం ఇటీవల ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి వంద పడకలకు సౌకర్యం కల్పించింది. త్వరలో ఈ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్టు వైద్యులు తెలిపారు.


యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలో జిల్లా ఆస్పత్రితో పాటు మూడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. భువనగిరి ఆస్పత్రిలో 100పడకలు అందుబాటులో ఉన్నాయి. చౌటుప్పల్‌, రామన్నపేట, ఆలేరులో ఏరియా ఆస్పతులు, 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. కరోనా సమయంలో బాధితులను హైదరాబాద్‌కు తరలించకుండా, స్థానికంగానే వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్‌ నిధులతోపాటు దాతలు సహకారంతో మొత్తం 54 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందజేసింది. వీటిలో జిల్లా ఆస్పత్రికి 12, మూడు ఏరియా ఆస్పత్రులకు ఒకటి చొప్పున అందజేశారు. ప్రధానమంత్రి కేర్‌ ఫండ్‌ ద్వారా 42 పీహెచ్‌సీలకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఇచ్చారు. అదేవిధంగా జిల్లా ఆస్పత్రిలో ఒక ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అన్ని పరికరాలు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను హైదరాబాద్‌ తరలించకుండా ఉపయోగపడుతున్నాయి.


 సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి దాతలు అందజేసిన శానిటైజేషన్‌, క్లినింగ్‌ పరికరాలు తప్ప మిగతావన్నీ మూలనపడ్డాయి. ఆక్సిజన్‌ ప్లాంటు నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి సైతం నిలిచింది. రోగుల పడక లు ఒక గదిలోకి చేరాయి. పీపీ కిట్లు నిల్వ చేసేందుకు ఆస్పత్రిలో గదులే లేనట్లు సుమారు 2వేలకుపైగా కిట్లను ఓ మూలన పడేశా రు. ఆదానీ అనే ఓ ప్రైవేటు సంస్థ సుమారు రూ.1కోటి వ్యయంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఆక్సిజన్‌ ప్లాంటును ఏర్పాటుచేసింది. కరోనా సమయంలో ఈ ప్లాంట్‌ ద్వారా నిరంతరం ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి ఆస్పత్రిలో కొరత లేకుండా చూశారు. ప్రస్తుతం కరోనా తగ్గడంతో ఈ ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. ఒక స్వచ్ఛందసంస్థ ఉచితంగా 50 ఆక్సిజన్‌ సిలిండర్లు ఇవ్వగా, అప్పుడప్పుడు వీటిని వినియోగిస్తున్నారు.  అమెరికాకు చెందిన తెలంగాణ అభివృద్ధి ఫొరం సభ్యులు రూ.9 లక్షలు విలువ చేసే క్లినింగ్‌, శానిటైజేషన్‌ యంత్రాలను ఆస్పత్రికి ఉచితంగా అందజేశారు. ప్రస్తుతం వీటిని మాత్రమే జనరల్‌ ఆస్పత్రిలో వినియోగిస్తున్నారు. రోజుకు రెండుమార్లు ఆస్పత్రి ప్రాంగణా న్ని క్లీనింగ్‌ యంత్రం స హాయంతో శుభ్రం చేస్తున్నట్టు సూపరింటెండెంట్‌ మరళీధర్‌రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్‌ మండలంలోని లింగగిరి ప్రాథమి ఆరోగ్య కేంద్రానికి పట్టణ రైస్‌మిల్లర్స్‌ సుమారు రూ.1లక్షతో థర్మల్‌ స్కానర్లు అందజేశారు. వేపలసింగారానికి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ ఆర్థిక సహకారంతో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ అందచేశారు. హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ సభ్యులు రెండు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేశారు. హుజూర్‌నగర్‌ ఆస్పత్రిలోని కాన్సన్‌ట్రేటర్లు మాత్రమే నామమాత్రంగా పనిచేస్తున్నాయి. మండలంలోని ఆశా కార్యకర్తల వద్ద ఉన్న థర్మల్‌ స్కానర్లు మూలనపడ్డాయి.

Updated Date - 2022-05-17T06:22:06+05:30 IST