ఆదుకునే దిక్కెవరు?

ABN , First Publish Date - 2020-10-21T08:04:41+05:30 IST

ఆదుకునే దిక్కెవరు?

ఆదుకునే దిక్కెవరు?

విపత్తు ప్రణాళికల అమలు ఎక్కడ?

వరుసగా వరదలు, భారీగా వర్షాలు

ఈ సీజన్‌లో ఇప్పటికి మూడోసారి

ప్రత్యేక అధికారులను నియమించరా?

కానరాని ముందస్తు జాగ్రత్తలు 

వరద పోయాకా ఉపశమనం కరువు

క్షేత్రస్థాయిలో కనిపించని ప్రజాప్రతినిధులు

ఆగస్టు, సెప్టెంబరు నష్టంపై అంచనాలే లేవు

అధికార యంత్రాంగంలోనే విస్మయం


ఒక్కసారి కాదు... రెండుసార్లూ కాదు! ఈ సీజన్‌లో ఇప్పటికి మూడుసార్లు భారీ వర్షాలు, వరదలు! రైతులు అతలాకుతలమవుతున్నారు. ముంపులు, మునకలతో లోతట్టు ప్రాంతాల వారు  నీళ్లతోనే సహవాసం చేస్తున్నారు. అయినా సరే... సర్కారు వారికి ఏమీ పట్టడం లేదు. వరదలు, భారీ వర్షాల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన తప్పనిసరి చర్యలు, కార్యాచరణ కూడా ఇప్పుడు ప్రకటించలేదు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

వర్షాలనూ, వరదలను ఆపలేం! కానీ, నష్టాన్ని తగ్గించవచ్చు. ప్రజల కష్టాలనూ తగ్గించవచ్చు. తగిన సహాయం చేసి ఉపశమనం కలిగించవచ్చు. ఇందుకు సర్కారు వద్ద ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. యంత్రాంగం రంగంలోకి దిగాలి. అందుకు... పైస్థాయిలో తగిన పర్యవేక్షణ, మార్గదర్శకత్వం కావాలి. ఇప్పుడు... అవేవీ సక్రమంగా జరుగుతున్న దాఖలాలు కనిపించడంలేదు. ‘‘వరదలు, వాయుగుండాలు, తుఫాన్లు వస్తుంటాయ్‌, పోతుంటాయ్‌! బాధితులకు రూ.500 ఇస్తాం. వారంరోజులకుపైగా ముంపులో ఉంటే నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేస్తాం’’ ఇదీ ప్రభుత్వ వైఖరి! ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు గతంలో కనిపించిన ముందస్తు సన్నద్ధత, అనంతర చర్యలేవీ ఇప్పుడు కనిపించడంలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లోనూ భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. పెద్ద ఎత్తున పంటనష్టం సంభవించింది. వందల గ్రామాలు నీట మునిగాయి. గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. అప్పుడు కూడా సర్కారు తగిన చర్యలు తీసుకోలేదు. రైతులు ఎంత పంట నష్టపోయారు, ప్రజలకు జరిగిన ఆస్తి నష్టం ఏమిటి? అనే అంచనాలే రూపొందించలేదు. కేంద్ర సహాయం కూడా కోరలేదు. ఇక... పరిహారం పంపిణీ ఊసే లేదు. ఆ కష్టాలనుంచి జనం తామే గట్టెక్కి, మళ్లీ కుదుటపడకముందే... ఈ నెల ఐదో తేదీ నుంచి మళ్లీ వర్షాలు దంచి కొడుతున్నాయి.  దీనికితోడు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాలకు గ్రామాలు నీటమునిగాయి. ఎగువ నుంచి వచ్చే వరద, వర్షపాతం అంచానాలేవీ ప్రభుత్వానికి తెలియనివి కావు. అలా తెలిసిన వెంటనే... నష్ట నివారణ కోసం నిబంధనల ప్రకారమే అనేక చర్యలు తీసుకోవాలి. కానీ... ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ కనిపించనే లేదు.


ప్రణాళిక ఏదీ? 

వర్షాలు, వరదల సమయంలో రాష్ట్రం, జిల్లా, డివిజన్‌, మండలం, గ్రామ స్థాయి విపత్తు ప్రణాళికలు అమలు చేయాలి. జిల్లాలకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా పంపించాలి. వారు జిల్లాల్లో మకాం వేసి సహాయ చర్యలను సమర్థంగా పర్యవేక్షించాలి. కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలి. ఇప్పటికి మూడుసార్లు వరదలు వచ్చినా... పై కార్యాచరణ లేదు. వరదల సమయంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లడం ఎప్పుడూ జరిగేదే. బాధితులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున భరోసా ఇచ్చి... అధికార యంత్రాంగాన్ని కదిలించడమే ఈ పర్యటనల ఉద్దేశం. కానీ, ఇదంతా జరుగుతోందా? అక్కడక్కడా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మిగిలిన చర్యలను  ‘నీటికి’ వదిలేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముంపు  ప్రాంతాల ప్రజలను విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియానికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించారు. పరిస్థితి చక్కబడకముందే... ‘ఎన్నాళ్లుంటారో. ఇక వెళ్లిపోండి’ అని గుడ్లురిమారు. 


సీఎం, సీఎస్‌ ఏం చేస్తున్నారు?

వరదలు, వర్షాలపై సీఎం ఇప్పటి వరకు రెండుసార్లు కలెక్టర్లతో సమీక్షించారు. సోమవారం హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ రివ్యూ చేశారు. అదికూడా... తూతూమంత్రంగానే! భారీగా నష్టపోయిన ఉభయ గోదావరి జిల్లాలను వదిలేసి... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కృష్ణా నది వెంబడి అటూ ఇటూ మాత్రమే పరిశీలించి వెళ్లారు. ‘‘రాష్ట్రమంతా వర్షాలు, వరదలు ఉంటే సీఎం రాజధాని పరిధిలో ఏరియల్‌ సర్వేనిర్వహించారు. గోదావరి జిల్లాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సీఎం ఆ ప్రాంతాల్లో పర్యటించరా? ఇప్పటి వరకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరదల పరిస్థితిని సమీక్షించారా? కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారా? జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించి సహాయక చర్యలను పర్యవేక్షించే బాధ్యత ఎవరిది? ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేకంగా గుర్తుచేయాలా?’’ అని సీనియర్‌ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.


పొరుగున ఇలా...

హైదరాబాద్‌ ఎదుర్కొంటున్న కష్టాలతో పోల్చలేం కానీ... మనం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలూ వరదలు, వర్షాలతో విలవిలలాడుతున్నాయి. అక్కడి ప్రభుత్వ స్పందనతో పోల్చితే...  ఏపీ సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో సోమవారం నుంచే ఒక్కో ఇంటికి రూ.10వేల సహాయం అందిస్తున్నారు. బాగా దెబ్బతిన్న ఇళ్లకు లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.  తెలంగాణ మంత్రులు, అధికారులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 


నాడు ఇలా... 

సుదీర్ఘ తీరప్రాంతమున్న ఏపీకి తుఫాన్లు, వరదలు కొత్త కాదు. దివిసీమ ఉప్పెన తర్వాత వచ్చిన తుఫాన్లలో అత్యంత భయంకరమైనది హుద్‌హుద్‌. 2014 అక్టోబరు 7-14 వరకు తుఫాను ప్రభావం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలోనే మకాం వేశారు. విపత్తు, రెవెన్యూ, విద్యుత్‌, ఇతర కీలక శాఖల ఉన్నతాధికారులు విశాఖలోనే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించారు. 2013కు ముందు కోస్తాంధ్రను వణికించిన పైలిన్‌, జల్‌ తుఫాన్ల సమయంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ అధికారులు ప్రజల వద్దకు వెళ్లి సహాయ  చర్యలను పర్యవేక్షించారు.

Updated Date - 2020-10-21T08:04:41+05:30 IST