అశనిపాతం!

ABN , First Publish Date - 2022-04-25T05:56:19+05:30 IST

యాసంగిలో సాగుచేస్తున్న వరి, జొన్న, మామిడి రైతులను అకాల వర్షాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

అశనిపాతం!
వడగండ్లతో నేలకొరిగిన జొన్న పంట


  • యాసంగి పంటలకు వడగండ్ల దెబ్బ
  • ఈదురు గాలులతో అకాల వర్షాలు, 
  • చేతికొచ్చిన వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం
  • వికారాబాద్‌ జిల్లాలో 45 వేల ఎకరాల్లో వరి సాగు
  • మరో 15 రోజులైతే గట్టెక్కనున్న రైతులు

యాసంగిలో సాగుచేస్తున్న వరి, జొన్న, మామిడి రైతులను అకాల వర్షాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముందస్తుగా వేసిన వరి పంట మరో వారం రోజుల్లో కోతకు రానుండగా ఇప్పుడే చెడగొట్టు వానలు, వడగండ్లతో రైతులు నష్టపోతున్నారు. కాయగూర పంటలకు తక్కువ నష్టమే వాటిల్లినా వరి, మామిడి ఫలసాయం నేలరాలి అన్నదాతలు నష్టపోతున్నారు.  జిల్లాలో వడగండ్ల  వానలతో రైతులు నష్టపోతున్నారు. ఈదురు గాలుల  వర్షంతో  పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులు పరిహారం కోసం ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు.

పరిగి, ఏప్రిల్‌ 24: ఉరుములు, మెరుపులు, అకాల వర్షాలు రైతులను కలవపెడుతున్నాయి. ఎండలు, విద్యుత్‌ కోతలతో పంటలకు నీరందక కష్టాలు పడ్డ రైతులను ఇప్పుడు పంట చేతికొస్తున్న సమయంలో గాలి దుమారాలు, వడగండ్ల వానలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో అక్కడక్కడ వడగండ్ల్లు, అకాల వర్షాలతో వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. ఎప్పుడు వడగండ్లు పడుతాయోననే భయంతో కొందరు చేను మక్కక ముందే కోస్తున్నారు. ముఖ్యంగా వరి, మామిడి తోటలకు చెడగొట్టు వానలతో ప్రమాదం పొంచి ఉంది. వరి చేన్లు ఇప్పుడిప్పుడే ఎర్రబారుతున్నాయి. మామిడి పీచుకట్టి ఇంకా కొన్ని రోజుల చెట్టు మీదే ఉండాల్సి పరిస్థితి ఉంది. వడగండ్ల వానలొస్తే అంతా నేలరాలుతాయని రైతులు కలవరపడుతున్నారు. వారం రోజులుగా ఆకాశం మేఘావృతం అవుతుండడంతో వరి, మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎప్పుడూ కోతకొచ్చే సమయంలోనే వడగండ్లు

యాసంగిలో ఏప్రిల్‌ మూడో వారం నుంచి ఎక్కువగా వడగండ్ల వానలు కురుస్తాయి. ఇదే సమయంలో వరి చేలు ఎర్రబారడం మొదలవుతుంది. మే మొదటి వారానికల్లా కోతలు 80-90శాతం వరకు పూర్తవుతాయి. అలాగే ఉద్యాన పంటలైన మామిడి, పుచ్చ తదితర పంటలు సైతం ఇదే సమయంలో చేతికొస్తాయి. ఈ సమయంలోనే రాళ్ల వానలతో రైతులు నష్టపోతున్నారు. ఒక్క పక్షం రోజుల వాతావరణం సహకరిస్తే 90శాతం మంది వరకు రైతులు గట్టెక్కనున్నారు. అయితే ఈ సమయంలోనే అకాల వర్షాలు ఎక్కువగా కురుస్తుండడం రైతుల్లో ఆందోళన రేపుతోంది. ఏప్రిల్‌ 18న పరిగి, వికారాబాద్‌, ధారూరు, పూడూర్‌ తదితర మండలాల్లో ఈదురు గాలులు, వడగండ్ల వానతో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే టమాట, వంగ, దోస, కీర తదితర కూరగాయ పంటలకు తక్కువ నష్టం వాటిల్లింది. వరి, మామిడి పంటలతో పోలిస్తే కాయగూర పంటలతో నష్టం తక్కువే అని చెప్పొచ్చు.

నష్టభయం ఉన్నా వరివైపే మొగ్గు

యాసంగిలో వరికి ఎక్కువ నీరు అవసరం. మండే ఎండలు, బోర్లలో నీరు తగ్గి పంట ఎంత వరకు కాపాడుకుంటామో రైతులకు సైతం తెలియని పరిస్థితి. ఇదిలా ఉంచితే తీరా చేతికొచ్చే సమయంలోనూ అకాల వర్షాలు, వడగండ్లు, గాలి దుమారం వంటివి పంటకు తీవ్ర నష్టాన్ని కల్గిస్తాయి. అన్ని భయాలకూ ఓర్చి నీటి సౌకర్యం ఉన్న రైతుల్లో ఎక్కువ మంది వరినే సాగుచేశారు. జిల్లాలో ఈ యాసంగిలో అన్ని పంటలు 78,985 ఎకరాల్లో వేశారు. వరి 45,009 ఎకరాల్లో వేశారు. వేరుశనగ 19,918 ఎకరాల్లో, జొన్న 6,306 ఎకరాల్లో సాగుచేశారు. ప్రధాన పంటగా వరి ఉంది. వడ్ల దిగుబడి 11.4లక్షల క్వింటాళ్లు అంచనా వేశారు. పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, బొంరా్‌సపేట్‌, కొడంగల్‌, దౌల్తాబాద్‌, తాండూరు, యాలాల్‌, పెద్దేముల్‌ మండలాల్లో బోర్ల కింద వేసిన పంటలు చేతికొచ్చాయి. ప్రాజెక్టులు, చెరువుల కింద భారీగా సాగు చేశారు. సోమవారం పరిగి, దోమ, ధారూర్‌, పేద్దేముల్‌, వికారాబాద్‌, బొంరా్‌సపేట మండలాల్లో గాలివాన, వడగండ్లు కురిసిశాయి. వందల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. వడగండ్లు పడ్డ గ్రామాల్లో ఇప్పటికే 50శాతం పంట నేలపాలైనట్టే! యాసంగిలో వానలకు, వడగండ్లకు తట్టుకునే కూరగాయలు, జామ, నేరెడు వంటి పండ్ల తోటల పంటలు మినహా మిగతా ఏ పంటకైనా తీవ్రంగా నష్టం కలుగుతుంది. ముఖ్యంగా వరి, మామిడి పంటలకు వడగండ్లు ఆశనిపాతం అవుతున్నాయి.

వడగండ్లతో ఎక్కువ నష్టం జరిగింది

నిన్న, మొన్నటి వరకు నీళ్లపారకంతో ఇబ్బంది పడ్డాం. ఎట్లోగట్ల పంటలను గట్టెక్కించ గలిగాం. ఇప్పుడే పంటచేతికొచ్చే దశకు చేరింది. మరో వారంపది రోజులు చేనుపై ఉంటే గింజ గట్టిపడి మక్కుతుంది. ఎండలు బాగా కొడితే వారంలోనే కోతలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు మొగుళ్లు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులు చూస్తే రైతుల గుండె జారుతోంది. నేను రెండు ఎకరాల్లో వరి వేశాను. మూడురోజుల క్రితం వడగళ్ల వానతో నష్టం జరిగింది.

                                                                                           - ఎజాజ్‌, రైతు, సుల్తాన్‌పూర్‌ 

Updated Date - 2022-04-25T05:56:19+05:30 IST