సచివాలయంలో ప్లాన్‌ల జారీపై భిన్నాభిప్రాయాలు

ABN , First Publish Date - 2020-07-11T09:58:30+05:30 IST

200 గజాల లోపు స్థలంలో నిర్మాణాలకు వార్డు సచివాలయంలోనే ప్లాన్‌ జారీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు

సచివాలయంలో ప్లాన్‌ల జారీపై భిన్నాభిప్రాయాలు

200 గజాలలోపు స్థలాలకు ప్లాన్‌ జారీ సరళతరం

చిన్నపాటి నిర్మాణాలకు నిబంధనల అమలు కష్టమేనంటున్న అధికారులు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం):   200 గజాల లోపు స్థలంలో నిర్మాణాలకు వార్డు సచివాలయంలోనే ప్లాన్‌ జారీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి భవన నిర్మాణాలు చేసుకునేవారికి, స్వంతంగా ఇల్లు కట్టుకునేవారికి దీనివల్ల కొంతవరకు ప్రయోజనం కలుగుతున్నప్పటికీ, వంద గజాల లోపు స్థలంలో ఇళ్ల నిర్మాణం చేసుకునేవారికి మాత్రం ఇబ్బందికరంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. 


భవన నిర్మాణాలకు ప్లాన్‌ల జారీని సరళతరం చేయడంతోపాటు అవినీతికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో 200 గజాల లోపు స్థలాల్లో నిర్మాణాలకు ప్లాన్లను వార్డు సచివాలయాల్లోనే జారీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో జారీ చేయాలని యోచిస్తోంది. దీనివల్ల జీవీఎంసీ పరిధిలో ఎవరైనా 200 గజాల్లోపు స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇకపై ప్లాన్‌కోసం జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలిన పని ఉండదు. నేరుగా వార్డు సచివాలయానికి వెళ్లి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేస్తే అక్కడి వార్డు ప్లానింగ్‌ సెక్రటరీ ప్లాన్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 


ప్లాన్‌ కోసం దరఖాస్తు పెట్టుకున్న స్థలాన్ని బట్టి ప్లాన్లు కంప్యూటర్‌లోనే సిద్ధంగా ఉంటాయి కాబట్టి, తమకు నచ్చిన ప్లాన్‌ను ఎంపిక చేసుకుంటే ఆ మేరకు ఫీజులు కట్టాల్సి ఉంటుంది. వెంటనే ప్లాన్‌ జారీ అయిపోతుంది. దీనివల్ల దరఖాస్తుదారుడు  సర్వేయర్ల చుట్టూ, జీవీఎంసీ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన బాధ తప్పుతుంది. అలాగే లంచాలు ఇవ్వకుండానే ప్లాన్‌ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే దీనికి మరో కోణం కూడా ఉండడం గందరగోళానికి దారితీస్తోంది. ప్రస్తుతం 100 గజాల లోపు స్థలంలో ఇల్లు కట్టుకునేవారు ప్లాన్‌ తీసుకోకుండానే నిర్మాణాలు చేసుకుంటున్నారు. జీవీఎంసీ అధికారులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అయితే ఇకపై మాత్రం తప్పనిసరిగా ప్లాన్‌ తీసుకోనిదే నిర్మాణం చేసేందుకు అవకాశం ఉండదు. ప్లానింగ్‌ సెక్రటరీలు వార్డులపై నిరంతర నిఘా ఉంటుంది కాబట్టి, నిర్మాణం ప్రారంభించగానే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటారు.


దీనివల్ల తప్పనిసరిగా ప్లాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వంద గజాల స్థలాలు ఉన్నవన్నీ చిన్నపాటి రోడ్డు అప్రోచింగ్‌ ఉన్నవే ఉంటాయి. వీటికి ప్లాన్‌ తీసుకోవాలంటే ఆ స్థలానికి కనెక్టవిటీగా కనీసం 25 అడుగులు రోడ్డు ఉండాలి. కానీ పది అడుగులు వెడల్పు ఉన్న రోడ్లుకు ఆనుకునే ఉంటాయి కాబట్టి, వీరంతా కచ్చితంగా ప్రస్తుతం పది అడుగుల రోడ్డు ఉన్న స్థలం అయితే అలాంటి వారంతా రోడ్డుకి ఇరువైపులా ఏడున్నర అడుగులు చొప్పున విడిచిపెట్టి నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. నిర్మాణంలో కూడా సెట్‌బ్యాక్‌లు పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీపాటిస్తే వంద గజాల్లో కనీసం 50 నుంచి 60 గజాలు కోల్పోయి, మిగిలిన స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలి.


దీనికి నిర్మాణదారులు ఎవరూ అంగీకరించే పరిస్థితి ఉండదు. కాబట్టి, అలాంటి వారంతా ప్లాన్‌ తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తారు. అలాగని ప్లాన్‌ లేకుండా నిర్మాణం చేపడితే నిబంధనలు అంగీకరించవు.  కొత్తగా అమలుచేయబోయే నిర్ణయం ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందోనని జీవీఎంసీ అధికారులు గందరగోళానికి గురవుతున్నారు.

Updated Date - 2020-07-11T09:58:30+05:30 IST